ఉపాధి పనులు చేస్తున్న కూలీలు
కడప సిటీ: జిల్లాలో ఉపాధి పనుల లక్ష్యం నెరవేరేందుకు అధికారులు తలమునకలు అవుతున్నారు. 2018 మార్చి నాటికి పనిదినాలు పూర్తిచేయాల్సి ఉంది. కాని ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో శ్రమిస్తేనే అది సాధ్యమౌతుంది. లేకపోతే లక్ష్యం నెరవేరక అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున 35000ల పనిదినాలు రోజుకు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు కొనసాగితే లక్ష్యం నెరవేరడం కష్టమే. రోజుకు సగటున 52,000 పనిదినాలు కల్పిస్తేనే లక్ష్యం నెరవేరేందుకు అవకాశం ఉంటుంది.
50రోజులు–22 లక్షల పనిదినాలు
2017–18 ఆర్థిక సంవత్సరంలోఉపాధి హామీ పథకం కింద 1.24 కోట్ల పని దినాలు కల్పించాలని నిర్దేశించారు. ప్రస్తుతం 1.24కోట్లకు గాను 1.02 కోట్ల పనిదినాలు ఇప్పటివరకు కూలీలకు కల్పించారు. అయితే ప్రస్తుతం సగటున రోజుకు 35000 ల పనిదినాలు జిల్లాలోని 50 మండలాల్లో నమోదవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు ఇలానే కొనసాగితే లక్ష్యం పూర్తికాదు మంజూరైన నిధులు కూడా నిరుపయోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే కనీసం సగటున రోజుకు 52000లు పనిదినాలు కల్పించగలిగితేనే సాధ్య పడుతుంది. ఇంతమందికి పని కల్పించాలంటే క్షేత్రస్థాయిలో భారీగా కసరత్తు చేస్తేనే సాధ్యమౌతుంది. ఉన్నతాధికారులు తరచుగా మండలాల్లోని ఎంపీడీఓలతోను, ఏపీఓలతోను సమావేశాలు నిర్వహించి ఒక ప్రణాళికను తయారుచేసి తగు సూచనలు చేస్తే లక్ష్యం నెరవేరేందుకు సులభతరంగా ఉంటుంది.
నిధులు రూ.473 కోట్లు
2017–18 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనులకు జిల్లాకు రూ.473 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కూలీలకు రూ.25.62కోట్లు, మెటీరియల్‌కు రూ.18.20 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తాన్ని ఉపాధి పనుల్లోని వివిధ పనులకు కేటాయించారు. ఈ మొత్తం లక్ష్యం నెరవేరాలంటే ఇంకా 22లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.
రోజుకు లక్ష పనిదినాలు కల్పిస్తాం: ఈ ఏడాది 1.24కోట్ల పనిదినాలు కల్పిం చాల్సి ఉంది. ఇప్పటివరకు 1.02 కోట్ల పనిదినాలు కల్పించాం. ఇంకా 22లక్షల పనిదినాలు మార్చి చివరి నాటికి కల్పిం చాల్సి ఉంది. ప్రస్తుతం సగటున రోజుకు 35000ల మంది కూలీలు జిల్లాలోని 50 మండలాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి నుండి రోజుకు లక్షమంది పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.టార్గెట్ పూర్తి చేస్తాం.
వై.హరిహరనాథ్, డ్వామా పీడీ
మండలాలు: 50
2017–18 ఆర్థిక సంవత్సరానికి నిధులు:రూ. 473 కోట్లు
ఇంతవరకు పెట్టిన ఖర్చు : రూ.257 కోట్లు
కల్పించాల్సిన ఉపాధి కూలీ పనిదినాలు: రూ.1.24 కోట్లు
ఇంతవరకు కల్పించిన పని దినాలు –రూ.1.02 కోట్లు
ఇంకా చేయవల్సిన పనిదినాలు –రూ. 22లక్షలు
Comments
Please login to add a commentAdd a comment