work force
-
జాబ్ మార్కెట్లో ఇప్పుడిదే ట్రెండ్.. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కంపెనీలు
ప్రపంచ వ్యాప్తంగా ఓ వైపు కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు. మరోవైపు పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం. ఫలితంగా జాబ్ మార్కెట్ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో అదే జాబ్ మార్కెట్లో ‘గోస్ట్ జాబ్స్’ ట్రెండ్ మొదలైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్ థ్రెడ్ యూజర్, హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మౌరీన్ క్లాఫ్ అనే మహిళా ఉద్యోగి జాబ్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్ గురించి షేర్ చేశారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న గోస్ట్ జాబ్స్ ఏంటో తెలుసా? గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గోస్ట్ జాబ్స్ ట్రెండ్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే..ఓ టెక్ కంపెనీలో సంబంధిత విభాగాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అప్లయ్ చేసుకోవచ్చంటూ సదరు కంపెనీ హైరింగ్ కేటగిరిలో సమాచారం ఇస్తుంది. పనిలో పనిగా అందులో ఓపెన్ అనే ఆప్షన్ ఉంచుతుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసి కంపెనీకి కావాల్సిన అర్హతులు ఉన్న అభ్యర్ధులు జాబ్స్ కోసం అప్లయ్ చేస్తుంటారు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. రోజులు, నెలలు గడుస్తున్నా ఉద్యోగాలకు అప్లయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ కాల్ రాదు. కానీ కంపెనీ వెబ్సైట్ హైరింగ్ కేటగిరిలో ఉద్యోగులు కావాలనే సంకేతం ఇస్తూ ఓపెన్ అనే ఆప్షన్‌ను అలాగే ఉంచుతుంది. ఇదిగో ఇప్పుడు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి ఆయా కంపెనీలు. దీన్ని గోస్ట్ జాబ్స్ అని పిలుస్తున్నారు. ఘోస్ట్ జాబ్ అంటే ఏమిటి? ఘోస్ట్ జాబ్స్ అంటే తమ సంస్థలో ఖాళీలు ఉన్నాయి. జాబ్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చంటూ ప్రకటనలు ఇస్తాయి. కానీ ఉద్యోగుల్ని నియమించుకోవు. దీనికి కారణం కంపెనీని బట్టి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకునేందుకు తమ వద్ద నిధులు లేకపోవడం, టాలెంట్ ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించేందుకు ఇలా చేస్తాయి. లేదంటే ఈ ఓపెన్ జాబ్‌లు త్వరలో ఖాళీ అవుతున్న ఉద్యోగాలకు ముందుగానే కొత్త వారిని ఎంపిక చేసుకునేందుకు ఇలా చేసేందుకు అవకాశం ఉందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఏం చెబుతోంది హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. కరోనా కష్టాలంలో చేస్తున్న ఉద్యోగులకు రాజీనామాలు చేసే సంఖ్య పెరగడం, ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఘోస్ట్ జాబ్స్ ఉద్యోగాల సంఖ్య పెరిగినట్లు అంచనా. అంతేకాదు భవిష్యత్‌పై స్పష్టత లేని కంపెనీలు ఇలా ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగుల్ని నియమించుకోవడం ఓ కారణమని అధ్యయనం తెలిపింది. ఉద్యోగం నిజమా? కాదా? అని తేల్చేదెలా? ఓ కంపెనీ ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చినప్పుడు అవి నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఘోస్ట్ జాబ్స్‌లో ఉద్యోగులు చేయాల్సి విధులు, ఇతర జీతభత్యాల గురించి అస్పష్టంగా ఉంటుంది. ఒక అభ్యర్థి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారాలు లేదా నెలల తరబడి ఎలాంటి స్పందన ఉండదు. దీన్ని ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి. లేదంటే తమ కంపెనీలో ఉద్యోగం ఉందని, అదే జాబ్స్ రోల్ ఎక్కువ కాలం ఉంచితే దాన్ని ఘోస్ట్ జాబ్‌గా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
టాప్ 10 టెక్నాలజీ కంపెనీలు: అరకోటి మంది టెకీలు వీటిలోనే..
ప్రపంచవ్యాప్తంగా టెక్ జాబ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. మంచి వేతన ప్యాకేజీలు, మెరుగైన లైఫ్ స్టైల్ కారణంగా చాలా వీటిని డ్రీమ్ జాబ్స్‌గా భావిస్తున్నారు. ఇలాంటి టెక్ జాబ్‌లు కల్పించే టెక్నాలజీ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కేవలం 10 కంపెనీల్లోనే సుమారు అరకోటి మందికిపైగా టెకీలు పనిచేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ గ్యాడ్జెట్స్ నౌ నివేదిక ప్రకారం.. అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 10 టెక్నాలజీ కంపెనీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ▶ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సుమారు 1,461,000 మంది ఉద్యోగులతో అగ్రస్థానంలో ఉంది. కంపెనీకి చెందిన క్లౌడ్ కంప్యూటింగ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో సహా వివిధ విభాగాల్లో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶యాపిల్ (Apple)కు సంబంధించిన అతిపెద్ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ప్రసిద్ధి చెందిన ఫాక్స్‌కాన్ (Foxconn) 826,608 మంది ఉద్యోగులతో రెండవ స్థానంలో నిలిచింది. ఐఫోన్ల ఉత్పత్తిలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. ▶జాబితాలో తర్వాతి స్థానంలో ఐటీ కన్సల్టెన్సీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) సుమారు 738,000 మంది ఉద్యోగులతో ఉంది. ▶భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 614,795 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్ కలిగి ఉంది. ఇది ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా మారింది. ▶ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫర్ఫార్మెన్స్ (Teleperformance) ప్రపంచవ్యాప్తంగా 410,000 మంది ఉద్యోగులతో కూడిన గ్లోబల్ డిజిటల్ బిజినెస్ సర్వీస్ ప్రొవైడర్. ▶యునైటెడ్ స్టేట్స్కు చెందిన కాగ్నిజెంట్ (Cognizant)లో దాదాపు 351,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶మరొక భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys)లో ప్రపంచవ్యాప్తంగా 336,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కన్సల్టింగ్, ఐటీ సేవలలో ప్రత్యేక కంపెనీగా నిలిచింది. ▶జర్మన్ సమ్మేళనం సిమెన్స్ ప్రపంచవ్యాప్తంగా 190 కేంద్రాల్లో సుమారు 3,16,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ▶యూఎస్ కేంద్రంగా ఉన్న ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐబీఎం (IBM)లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 288,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ▶సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,21,000 మంది ఉద్యోగులతో డ్రీమ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మైక్రోసాఫ్ట్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 60 శాతం మంది దాని స్వదేశమైన యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉన్నారు. -
సారీ బాస్.. ఇలా అయితే కష్టం! కంపెనీలకు గుడ్ బై అంటున్న ఉద్యోగులు!!
ఇటీవల కాలంలో ఉద్యోగులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరడం (ఆట్రిషన్ రేట్) విపరీతంగా పెరిగిపోయింది. ఓవైపు నిరుద్యోగ సమస్య పీడిస్తున్నా.. ఉద్యోగాల్లో ఉన్న వారు మేనేజ్మెంట్ పట్ల సౌకర్యంగా ఫీలవకపోతే సంస్థలను వీడేందుకు వెనుకడాటం లేదు. ఇన్ఫోసిస్ లాంటి సంస్థలైతే దీన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయాల్సి వస్తోంది. దీనికి వ్యతిరేకంగా లేబర్ ఆఫీసుల చుట్టు తిరగాల్సి వస్తోంది. సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై స్పందించే ఆర్పీజీ గ్రూపు చైర్మన్ హార్ష్ గోయెంకా కార్పొరేట్ సెక్టార్ ఎదుర్కొంటున్న సీరియస్ సమస్యను ఈసారి లేవనెత్తారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న వీడియో ద్వారా ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపించే ప్రయత్నం చేశారు. వర్క్‌ఫోర్స్‌కి సంబంధించి ఇండియాలో మూడు రెవల్యూషన్స్ వచ్చాయని. ఒక్కో రెవల్యూషన్ అప్పుడు వర్క్‌ఫోర్స్ పనితీరు ఎలా ఉందో, వాళ్లు ఏం ఆశిస్తున్నారనే అంశాలను ఈ వీడియోలో సవివరంగా చర్చించారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవంతో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ సమయంలో ఎన్ని గంటలైనా పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండేవారు. యజమానులు కొట్టినా తిట్టినా పడేవారు. అవకాశాలు తక్కువగా ఉండటంతో ఎన్నో ఇబ్బందుల నడుమ ఆరోజుల్లో ఉద్యోగులు పని చేయాల్సి వచ్చేది. వేరే జాబ్ దొరికే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండేవారు తప్పితే సంస్థలను వీడాలనే ఆలోచనే వచ్చేది కాద ఆ తరం వారికి. ఉపాధి కల్పించే సంస్థ పట్ల ప్రేమాభిమానాల కంటే భయమే ఎక్కువగా ఉండేది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ 90వ దశకం తర్వాత క్రమంగా ఐటీ రంగం పుంజుకోవడం మొదలైంది. ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ వచ్చాక ఐటీ కంపెనీలు వచ్చాయి. ఈ తరుణంలో వచ్చిన వర్క్‌ఫోర్స్ కనీస అవసరాల కోసం కాకుండా మెరుగైన జీవితం (స్టాండర్డ్ లైఫ్‌స్టైల్) లక్ష్యంగా పని చేయడం మొదలైంది. వీళ్లకు కార్ ఈఎంఐ, హౌజ్ ఈఎంఐ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేవి ప్రధాన సమస్యలు. అవకాశం ఉంటే వేరే చోటుకి వెళ్లేందుకు ఆలోచించేవారు. ఎక్కువ శాతం సంస్థను వీడేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ సంస్థ పట్ల భయం అనేది పోయింది. అయితే పని చేసే సంస్థ పట్ల నమ్మకం ఉండేది. సోషల్ రెవల్యూషన్ 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం సోషల్ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగ భద్రత , స్టాండర్డ్ లైఫ్ వంటి బెంచ్‌మార్క్‌లను దాటి పోయారు. ఇప్పటి వర్క్‌ఫోర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని కోరుకుంటున్నారు. ఈ క్వాలిటీ అనేది పని, పని ప్రదేశం, యాజమాన్యం ప్రవర్తన వంటివి కోరుకుంటున్నారు. క్వాలిటీలో ఏ మాత్రం తేడా వచ్చిన కంపెనీ వదిలి వెళ్లేందుకు వెనుకాడటం లేదు. ఉద్యోగాలిచ్చే సంస్థల పట్ల భయం, నమ్మకం వంటివాటికి ఇక్కడ చోటు లేదు. పరస్పర గౌరవం, ఆదరణ ఇక్కడ ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. చిన్న చూపు తగదు ఏ సంస్థ అయినే సరే ఉద్యోగం ఇచ్చామనో, మంచి జీతం ఇస్తున్నామనే భావనలో ఉంటే ఆ కంపెనీలు ఉద్యోగుల వలస అనే సమస్యను ఎదర్కోక తప్పదని హార్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది. ఈ తరం వర్క్‌ఫోర్స్ ఉద్యోగ భద్రత, మంచి జీతంతో పాటు క్వాలిటీ ఆఫ్ వర్క్‌ను కూడా కోరుకుంటున్నారు. పనితీరును గమనించి ప్రోత్సహకాలు అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సరైన సమయంలో వేతనాల పెంపు ఉండాలంటున్నారు. అవి లేకుంటే అదే కంపెనీలో ఉండేందుకు రెడీగా ఉండటం లేదు. కాబట్టి ఉద్యోగ, భద్రత జీతం ఇస్తున్నామని ఇంకే కావాలని ఆలోచించే కంపెనీలను వదిలి వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఉద్యోగుల విషయంలో జాగ్రత్త మెసలుకోవాలంటే యాజమాన్యాలకు సూచన చేశారు. An interesting explanation as to why people are resigning from their jobs and what it takes to retain employees pic.twitter.com/3mQmwGL8hX — Harsh Goenka (@hvgoenka) June 22, 2022 చదవండి: మహ్మద్ రఫీ పాటనే స్ఫూర్తిగా.. వేల కోట్లకు అధిపతిగా.. -
చదువుకున్నంత మాత్రాన పని చేయాలనేం లేదు
ముంబై: చదువుకున్నంత మాత్రాన మహిళలను ఉద్యోగం చేసి తీరాలని ఒత్తిడి చేసే అధికారం ఎవరికీ లేదని ముంబై హైకోర్టు పేర్కొంది. పని చేయాలా, ఇల్లు చక్కదిద్దుకోవడానికే పరిమితం కావాలా అన్నది పూర్తిగా ఆమె ఇష్టమేనని న్యాయమూర్తి జస్టిస్ భారతీ డాంగ్రే స్పష్టం చేశారు. ఓ విడాకుల కేసులో భార్యకు మనోవర్తి చెల్లించాలన్న ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఓ వ్యక్తి పెట్టుకున్న రివిజన్ పిటిషన్‌ను శుక్రవారం ఆమె విచారించారు. డిగ్రీ చేసిన తన మాజీ భార్యకు సంపాదించుకునే సామర్థ్యముంది గనుక మనోవర్తి చెల్లించాలన్న ఆదేశాలు సరికాదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చారు. ‘‘ఈ రోజు నేను న్యాయమూర్తిని. రేపు బహుశా ఇంట్లో కూర్చోవాల్సి రావచ్చు. న్యాయమూర్తిగా పని చేయగల సామర్థ్యముంది గనుక అలా ఊరికే ఉండొద్దని చెప్తారా మీరు?’’అని ప్రశ్నించారు. తన భార్యకు స్థిరమైన ఆదాయ వనరు ఉన్నా ఆ వాస్తవాన్ని దాచిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై వచ్చే వారం తదుపరి విచారణ జరగనునుంది. -
ఉబర్‌లో మరో 500 నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రయాణ సేవలు అందిస్తున్న ఉబర్ టెక్నాలజీస్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్తగా 500 మంది సాంకేతిక నిపుణులను నియమించుకోనుంది. హైదరాబాద్, బెంగళూరులోని సంస్థ కార్యాలయాల్లో ఇప్పటికే 1,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 2021లో 250 మందిని చేర్చుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారత్ పట్ల సంస్థ నిబద్ధతను, దేశంలోని ఇంజనీరింగ్ ప్రతిభను గుర్తించడాన్ని ఈ నియామక ప్రణాళిక నొక్కి చెబుతుందని ఉబర్ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: క్యాబ్ అగ్రిగేటర్లపై కేంద్రం సీరియస్ -
మహిళల వద్దకే ఉద్యోగాలు
పదహారు శాతం అంటే... ప్రపం చంలో ఏ దేశంతో పోల్చి చూసినా భారతదేశంలో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం అత్యల్పమనే! ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం కోవిడ్‌కు ముందు ఈ శాతం 21గా ఉండేది. ఇందులో ఉన్న మరింత ప్రతికూలత ఏమిటంటే... ఉద్యోగాలలో మహిళల భాగస్వామ్యం ప్రాంత, వర్గ తారతమ్యం లేకుండా రెండిటిలోనూ ఒకే విధమైన అనిమిత్తతతో ఉండటం. గ్రామీణ ప్రాంతాల్లో కొంత నయం. పట్టణాల్లోనైతే ఉద్యోగ పంతం పట్టింపు లేనట్లే ఉంటుంది. ఇక సంపన్న స్థాయిలో వివాహిత మహిళల్లో 6.5 శాతం మాత్రమే ఉద్యోగాలలో కనిపిస్తుండగా ఈ శాతం అవివాహిత మహిళల్లో 15 శాతంగా ఉంది. ఈ స్వల్పశాతాలకు అనేకానేక కారణాలు దోహదం చేస్తుండవచ్చు. అందుకే దీన్నొక సమష్టి సమస్యగా చూడాలి తప్ప వ్యక్తిగత స్థాయిలో పరిష్కారానికి ప్రయత్నించలేం. ఎవరో కొంతమంది ప్రతిభావంతులైన, అవకాశాలున్న మహిళలు ఉద్యోగాలలోకి రావడం వల్ల మహిళా ఉద్యోగ భాగస్వామ్యంలో మెరుగుదల, పెరుగుదల ఏమీ కనిపించవు. సాధారణంగా ఉద్యోగ రంగంలో మహిళలు తక్కువగా కనిపించడానికి వ్యక్తిగత, సామాజిక, కుటుంబపరమైన కారణాలు అనేకం అవరోధంగా ఉంటాయి. మహిళలకు ఉద్యోగావకాశాలను, అనుకూలతలను కల్పించేందుకు పైస్థాయిలో ఎన్ని నిర్ణయాలు జరిగినప్పటికీ... పైన పేర్కొన్న అవరోధాల వల్ల వీటి ప్రభావం తక్కువగానే ఉంటుంది. మరేం చేయాలి? ‘వండర్ గర్ల్స్’ చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ పరిస్థితిని మార్చగల కొన్ని పరిష్కార మార్గాలైతే కనిపించాయి. మొదటిది, ఉద్యోగాల ఉన్నతస్థాయిలలో ఆదర్శ ప్రాయంగా వెలుగొందుతున్న మహిళల నుంచి సమాజానికి ప్రేరణను అందించడం. అంటే వారి గురించి విస్తృతంగా తెలియబరచడం. సామర్థ్యాలను నిరూపించుకుంటూ విజయ పథంలో దూసుకువెళుతున్న మహిళామణుల గురించి పాఠశాల స్థాయి బాలికలకు, బాలురకు తెలిసే అవకాశం తక్కువ. పాఠ్యాంశాలలోనే ఆ మహిళల గురించి తెలియజేయడం వల్ల పిల్లల్లో లక్ష్యాలు ఏర్పడతాయి. ఈ విషయంలో తల్లిదండ్రుల చేయూత కూడా ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అబ్బాయిలకు మహిళపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. అమ్మాయిల్ని ఉద్యోగాలకు ప్రోత్సహించే వాతావరణం కుటుంబాలలో ప్రారంభం అవు తుంది. రెండోది, సంరక్షణ రంగంలో మౌలిక సదుపాయాలను నిర్మించడం. సంరక్షణ అనే ప్రాథమిక మూలస్తంభం మీదనే మన ఆర్థికవ్యవస్థ నిలబడి ఉంది. శిశు సంరక్షణ, వృద్ధుల సంరక్షణ అనేవి శ్రమ, ప్రయాసలతో కూడినవి కనుక ఆ రంగం సహజంగానే మహిళలపై ఆధారపడవలసి వస్తుంది. డిగ్రీ వరకు చదువుకున్నప్పటికీ నాలుగు కోట్ల మంది భారతీయ మహిళలు సంరక్షణ రంగంలోనే పనిచేస్తున్నారు. సంరక్షణ రంగం ఆధునికం అయితే... ఇతర రంగాలలో మహిళల ఉద్యోగ భాగస్వామ్యం మెరుగయ్యే అవకాశం తప్పక ఉంటుంది. మూడు, విధాన నిర్ణయాలు అనేవి స్త్రీ పురుష సమానత్వ దృక్కోణంలో మాత్రమే జరగాలి. దేశంలో మహిళల, ఆర్థిక రంగ స్థితిగతులపై సామాజిక శాస్త్రవేత్త దీపా నారాయణ్, భట్టాచార్య కలిసి ఇటీవల ఒక నివేదికను వెలువరించారు. సామాజిక అధ్యయనాలపై విస్తృత చర్చ, అవగాహన కల్పన జరగాలని ఆ నివేదికలో వారు సూచించారు. విధాన నిర్ణయాలు చేసేటప్పుడు అధికారంలో ఉన్నవారు... చర్చల్లో వెల్లడైన అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసు కోవాలని పేర్కొన్నారు. నాలుగోది, ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుతం ఉన్న లింగ వ్యత్యాసాన్ని తగ్గించేలా ఒక సమానత్వ వారధిని నిర్మించడం. పాఠశాల స్థాయిలో విద్యార్థినులు గణితం, సైన్సు సబ్జెక్టులలో ప్రతిభను కనబరుస్తున్న వాస్తవాన్ని విస్మరించకుండా... ఉన్నతస్థాయి ఇంజనీరింగ్ విద్య కోసం వారికి అవసరమైన ఆర్థిక వనరులను కల్పిస్తే సమానత్వ వారధి నిర్మాణానికి ఎంతో కాలం పట్టదు. ఐఐటీ సీట్ల కోసం లక్షల మందితో పోటీ పడాలి. తల్లిదండ్రులు లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా ఆమెకు ఎంత ప్రతిభ ఉన్నా ఐఐటీకి వెళ్లే దారిలో వెనుకబడిపోతోంది. తనయుళ్లతో సమానంగా కూతుళ్లకూ డబ్బును ధారపోసి కోచింగ్ ఇప్పించే తల్లిదండ్రులెందరు?! అమ్మాయిని, అబ్బాయిని సమానంగా చూసినప్పుడు, చదివించినప్పుడు దీర్ఘకాలంలోనే అయినా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తప్పక కుదుట పడతాయి. ఐదు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా పట్టణ ప్రాంత సదుపాయాలను వృద్ధి చేయడం. కార్యాలయాలు నగరానికి దూరంగా ఎక్కడో శివార్లలో ఉంటే అంత దూరం వెళ్లలేని యువతులు తమలో ఎంత నైపుణ్యం ఉన్నా దగ్గరల్లోని ఉద్యోగానికే మొగ్గు చూపుతారు. ఈ కారణంగా శివార్ల ఉద్యోగ కేంద్రాలకు నైపుణ్యాల కొరత ఏర్పడటమే కాకుండా, అక్కడికి వెళ్లలేని మహిళల సామర్థ్యాలు తక్కువ ప్రతిఫలంతో వృధా అయే ప్రమాదం ఉంటుంది. (క్లిక్: జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం) ఆరు, ఉద్యోగాలకు అవసరమైన డిజిటల్ శిక్షణను పొందేందుకూ మహిళలకు భద్రమైన వాతావరణం కల్పించాలి. డిజిటల్ విద్యను నేర్పించే వారు మహిళా అధ్యాపకులై ఉండటం అత్యవసరం. పెద్ద ఎత్తున్న శిక్షణ తీసుకోవడానికి మహిళలు ముందుకు వచ్చేందుకు అవసరమైన ‘సేఫ్ డిజిటల్ స్పేస్’ను నగరాలు అందుబాటులోకి తేవాలి. (క్లిక్: ‘ఫ్యామిలీ డాక్టర్’ అవసరం) స్వీడన్ సంగీత పరిశ్రమకు ప్రసిద్ధి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గేయ రచయితలకు, ఆల్బమ్ నిర్మాతలకు నెలవు. ఆ ప్రాముఖ్యాన్ని నిలుపుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం... సామాన్యులు కూడా సంగీతం వైపు ఉత్సాహంగా అడుగులు వేసేందుకు అవసరమైన సబ్సీడీలను ఇవ్వడమే కాకుండా, పాఠశాల విద్య తర్వాత సంగీత సాధనకు ఉచిత ప్రభుత్వ సంగీత పాఠశాలను నిర్మించింది. ఇక్కడ మనం స్వీడన్‌ను ఆదర్శంగా తీసుకోవచ్చు. ఉద్యోగ రంగానికి చేరువవడంలో భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత సమస్యలకు పరిష్కారాలను అన్వేషించవచ్చు. ప్రజల్ని, ఫలితాల్ని మలిచేది వ్యవస్థే కదా! (క్లిక్: బాధ్యత అనుకుంటేనే ఫలం, ఫలితం!) - వర్ష అడుసుమిల్లి ‘వండర్ గర్ల్స్’ వ్యవస్థాపకురాలు -
బ్రిటానియా సంచలన నిర్ణయం.. 50 శాతం బాధ్యతలు వారికే !
కోల్‌కతా: ఎఫ్ఎంసీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. 2024 నాటికి సంస్థలో వీరి వాటాను 50 శాతానికి చేర్చనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం మహిళా ఉద్యోగుల సంఖ్య 38 శాతం ఉందని బ్రిటానియా ఇండస్ట్రీస్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ వెల్లడించారు. గువాహటి ఫ్యాక్టరీలో వీరి సంఖ్య 60 శాతం ఉందని, దీనిని 65కు చేర్చనున్నట్టు తెలిపారు. మహిళా సాధికారత కోసం కంపెనీ ఇప్పటికే స్టార్టప్ చాలెంజ్‌ను ప్రారంభించిందన్నారు. ఈ–కామర్స్, డిజిటల్ సర్వీసెస్, మొబైల్ వ్యాన్స్ ద్వారా కంటి సంబంధ చికిత్స సేవలు, పిల్లల విద్య తదితర విభాగాల్లో స్టార్టప్స్ కోసం 30 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నిధులు సమకూర్చామని వెల్లడించారు. మహిళలకు నైపుణ్య శిక్షణ కోసం గూగుల్‌తో చేతులు కలిపామన్నారు. -
Good News: కోటికి పైగా ఉద్యోగాలు..ఇక మీదే ఆలస్యం..!
ఐటీ ఉద్యోగం సంపాదిచడం మీ లక్ష్యమా? అయితే మీకో శుభవార్త. రాబోయే మరికొన్ని సంవత్సరాల్లో దేశీయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9 -10 మిలియన్ల చేరుతుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నిలేకని అసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం స్వచ్ఛంద సంస్థ 'అసెంట్ ఈ -కాంక్లేవ్' 6వ ఎడిషన్‌లో నందన్ నిలేకని పాల్గొన్నారు. ఈ సందర్భంగా "అడాప్టివ్ అడ్వాంటేజ్" అనే అంశంపై ప్రసంగించారు. దేశంలో పెరిగిపోతున్న డిజిటల్ సేవల వినియోగం, పెరుగుతున్న యునికార్న్ సంస్థలు (100కోట్ల వ్యాల్యూ), దిగ్గజ ఐటీ సంస్థలు భారీ ఎత్తున లాభాల్ని గడిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వర్క్ ఫోర్స్ డిమాండ్ 4.5 మిలియన్ల నుంచి 9-10 మిలియన్లకు చేరుకుంటుందని అన్నారు. కరోనా కారణంగా టెక్నాలజీ రంగం అభివృద్ది చెందిందని, దీంతో ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నా లేదంటే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశమని అన్నారు. విద్యా అర్హత, ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఏ టెక్నాలజీ మీద ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకొని ఆ దిశగా ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదని పలువురు ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్‌తో సహా నాలుగు ప్రధాన ఐటి సంస్థలు డిజిటల్ ఎక్స్పర్ట్స్ కోసం పెద్దపీఠ వేడయంతో అట్రిషన్ రేట్లు పెరిగాయని నివేదించాయి. మరోవైపు మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అన్ఎర్త్ ఇన్సైట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2022లో వరకు దాదాపు 2.5 లక్షల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లతో ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఐటీ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలిపింది. చదవండి: ఒక్క జాబ్‌కే 5 మంది పోటీ పడుతున్నారు..ఈ రంగాల్లోనే -
‘పనికి బలవంతం చేయొద్దు’
న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణలో ఉన్న మహిళను పనికి/ ఉద్యోగానికి వెళ్లమని బలవంతం చేయరాదని ఢిల్లీ కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ కోసం ఇస్తున్న రూ.10వేలను రూ.35వేలకు పెంచాలంటూ భార్యనుంచి విడిపోయిన ఓ భర్తను కోర్టు ఆదేశించింది. భర్త నుంచి విడిపోయిన భార్య పిల్లాడి సంరక్షణకోసం తనకు మంచి లాభదాయకమైన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చిందని, ఆమెకు ఇచ్చే మెయింటెనెన్స్‌ను రూ.10,000 నుంచి రూ. 35,000కు పెంచి ఆ మొత్తాన్ని రెండు నెలల్లోగా పూర్తిగా చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. పిల్లల సంరక్షణలో ఉన్న మహిళలను బలవంతంగా పనికి వెళ్లమని చెప్ప జాలరని, వారు రోజంతా పనిచేసే యంత్రాలు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. -
పని కావాలా నాయనా!
కడప సిటీ: జిల్లాలో ఉపాధి పనుల లక్ష్యం నెరవేరేందుకు అధికారులు తలమునకలు అవుతున్నారు. 2018 మార్చి నాటికి పనిదినాలు పూర్తిచేయాల్సి ఉంది. కాని ఇప్పటి నుంచి క్షేత్రస్థాయిలో శ్రమిస్తేనే అది సాధ్యమౌతుంది. లేకపోతే లక్ష్యం నెరవేరక అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. ప్రస్తుతం సగటున 35000ల పనిదినాలు రోజుకు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు కొనసాగితే లక్ష్యం నెరవేరడం కష్టమే. రోజుకు సగటున 52,000 పనిదినాలు కల్పిస్తేనే లక్ష్యం నెరవేరేందుకు అవకాశం ఉంటుంది. 50రోజులు–22 లక్షల పనిదినాలు 2017–18 ఆర్థిక సంవత్సరంలోఉపాధి హామీ పథకం కింద 1.24 కోట్ల పని దినాలు కల్పించాలని నిర్దేశించారు. ప్రస్తుతం 1.24కోట్లకు గాను 1.02 కోట్ల పనిదినాలు ఇప్పటివరకు కూలీలకు కల్పించారు. అయితే ప్రస్తుతం సగటున రోజుకు 35000 ల పనిదినాలు జిల్లాలోని 50 మండలాల్లో నమోదవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన పనిదినాలు ఇలానే కొనసాగితే లక్ష్యం పూర్తికాదు మంజూరైన నిధులు కూడా నిరుపయోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే కనీసం సగటున రోజుకు 52000లు పనిదినాలు కల్పించగలిగితేనే సాధ్య పడుతుంది. ఇంతమందికి పని కల్పించాలంటే క్షేత్రస్థాయిలో భారీగా కసరత్తు చేస్తేనే సాధ్యమౌతుంది. ఉన్నతాధికారులు తరచుగా మండలాల్లోని ఎంపీడీఓలతోను, ఏపీఓలతోను సమావేశాలు నిర్వహించి ఒక ప్రణాళికను తయారుచేసి తగు సూచనలు చేస్తే లక్ష్యం నెరవేరేందుకు సులభతరంగా ఉంటుంది. నిధులు రూ.473 కోట్లు 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి పనులకు జిల్లాకు రూ.473 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కూలీలకు రూ.25.62కోట్లు, మెటీరియల్‌కు రూ.18.20 కోట్లు కేటాయించారు. మిగతా మొత్తాన్ని ఉపాధి పనుల్లోని వివిధ పనులకు కేటాయించారు. ఈ మొత్తం లక్ష్యం నెరవేరాలంటే ఇంకా 22లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. రోజుకు లక్ష పనిదినాలు కల్పిస్తాం: ఈ ఏడాది 1.24కోట్ల పనిదినాలు కల్పిం చాల్సి ఉంది. ఇప్పటివరకు 1.02 కోట్ల పనిదినాలు కల్పించాం. ఇంకా 22లక్షల పనిదినాలు మార్చి చివరి నాటికి కల్పిం చాల్సి ఉంది. ప్రస్తుతం సగటున రోజుకు 35000ల మంది కూలీలు జిల్లాలోని 50 మండలాల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి నుండి రోజుకు లక్షమంది పనిచేసేలా చర్యలు తీసుకుంటాం.టార్గెట్ పూర్తి చేస్తాం. వై.హరిహరనాథ్, డ్వామా పీడీ మండలాలు: 50 2017–18 ఆర్థిక సంవత్సరానికి నిధులు:రూ. 473 కోట్లు ఇంతవరకు పెట్టిన ఖర్చు : రూ.257 కోట్లు కల్పించాల్సిన ఉపాధి కూలీ పనిదినాలు: రూ.1.24 కోట్లు ఇంతవరకు కల్పించిన పని దినాలు –రూ.1.02 కోట్లు ఇంకా చేయవల్సిన పనిదినాలు –రూ. 22లక్షలు -
భారతీయ మహిళలు ఎంత పనిచేస్తారో తెలుసా?
పని చేయడంలో మగవాళ్ల కంటే మగువలు ముందుంటారని పరిశోధకులు చెబుతున్నారు. రోజు మొత్తమ్మీద మగవాళ్ల కంటే ఆడాళ్లే ఎక్కువ సేపు పనిచేస్తారట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సగటున ఏడాదికి మహిళలు 39 రోజులు ఎక్కువ పనిచేస్తారు. అదే భారతదేశంలో అయితే 50 రోజులు ఎక్కువ పనిచేస్తారని అంటున్నారు. సగటున పురుషుల కంటే మహిళలు 50 నిమిషాలు ఎక్కువగా పనిచేస్తారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో కేవలం ఆరు దేశాలలో మాత్రమే మహిళల కంటే పురుషులు ఎక్కువ గంటలు పనిచేస్తారట. అయితే వీటిలో మూడు దేశాల్లో తల్లిదండ్రులకు ఇచ్చే సెలవులను పురుషులు, మహిళలు సమానంగా పంచుకోవచ్చు. భార్యాభర్తలలో ఒకరు ఉద్యోగానికి వెళ్తే, మరొకరు పిల్లల సంరక్షణ బాధ్యతను చూసుకుంటారని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో డేటా ఎనలిస్టుగా పనిచేస్తున్న వెసెలినా రచేవా చెప్పారు. మహిళల కంటే పురుషులకు 34 శాతం వరకు ఎక్కువ జీతాలున్నా, మహిళలే ఎక్కువ సేపు పనిచేస్తున్నారంటున్నారు. చాలావరకు ఇంటి పని, పిల్లల సంరక్షణ, వృద్ధుల సంరక్షణ లాంటి పనులు చేస్తున్నా, వాటికి జీతభత్యాలు ఏమీ ఉండవని చెప్పారు. దీంతో కలిపి చూసుకుంటేనే ఏడాది మొత్తమ్మీద పురుషుల కంటే ఎక్కువసేపు మహిళలు పనిచేస్తున్నారని చెప్పారు. భారతదేశం, పోర్చుగల్, ఈస్టోనియా దేశాల్లో మహిళలు ఏడాది మొత్తమ్మీద 50 రోజులు ఎక్కువ పనిచేస్తున్నారన్నారు.