ఉపాధి సిబ్బందిపై పీడీ చిందులు
అసంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగులు
సహోద్యోగులమనే గౌరవం లేదంటూ అసహనం
గూడూరు రూరల్: ‘ఒరేయ్.. ఇటు రారా. ఏందిరా ఇది.. ఇంత అవినీతి ఎప్పుడైనా జరిగిందా.. ఎందుకిలా చేస్తున్నార్రా.. ఒరేయ్ మీకు అర్థం కావడం లేదురా..’ ఇదీ మంగళవారం ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరిగిన సమాజిక బహిరంగ సభావేదికలో ఉపాధి సిబ్బందినుద్దేసించి పీడీ శ్రీనివాసప్రసాద్ అన్న మాటలు.
తమ తోటి సిబ్బందితో మర్యాదగా మసులుకోవాల్సిన ఆయన ఏకవచనంతో పిలుస్తూ అవమానాలకు గురిచేస్తుండడంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులమనే గౌరవం కూడా లేకుండా రారా..పోరా.. అని సంబోధించడం ఏంటని ప్రశి్నస్తున్నారు. ఎంతకాదన్నా తాముకూడా సహోద్యోగులమేకదా అని చెబుతున్నారు. ఎలాగంటే అలా మాట్లాడడం సరికాదని హితవు పలుకుతున్నారు.
కాగా వివిధ గ్రామాలకు సంబంధించిన నలుగురు క్షేత్ర సహాయకులతోపాటు ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను తొలగిస్తున్నట్టు పీడీ పేర్కొన్నారు. వీరి నుంచి రూ.6.77 లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో మంగళపూరు, రామలింగాపురం, వెడిచెర్ల, కొండాగుంట గ్రామాల క్షేత్రసహాయకులు ఉన్నారని చెప్పారు. అలాగే విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీడీ వరప్రసాద్, ఏపీఓ పెంచలయ్య, పలువురు టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment