సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. వీటిని సద్వినియోగించుకుంటూ అక్కచెల్లెమ్మలు వారి కాళ్లపై వారు నిలదొక్కుకోవడమే కాకుండా, మరికొందరికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. ఇదే క్రమంలో పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా కూడా రూపుదిద్దుకుంటున్నారు. పొదుపు సంఘాల మహిళలు రాష్ట్ర ప్రథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలనూ సద్వినియోగం చేసుకొంటున్నారు.
ఇలా పొదుపు సంఘాల మహిళలను హయ్యర్ ఆర్డర్ ఎంటర్‌ప్రెన్యూర్ (ఉన్నతస్థాయి పారిశ్రామికవేత్తలు)గా తీర్చిదిద్దడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2021 – 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 1,126 మంది పేద పొదుపు సంఘాల మహిళలు ఉన్నత స్థాయి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. వారు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంతో పాటు పెద్ద సంఖ్యలో తోటి మహిళలకు ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. వీరు ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణిస్తున్నారు.
ధాన్యాలు, చిరు ధాన్యాలతో కూడిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, నూనె, బెల్లం తయారీ, పిండిమర, పచ్చళ్ళు, కారం పొడులు తదితర యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరి వివరాలు, విజయగాథలతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) “ఆంధ్రప్రదేశ్ కొత్త తరం మహిళా పారిశ్రామికవేత్తలు’ పేరుతో తెలుగు, ఇంగ్లిష్,, హిందీ భాషల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించింది.
శుక్రవారం ఈ పుస్తకాన్ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్యి బి. రాజశేఖర్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్ అహ్మద్, ఆర్.వై.ఎస్.ఎస్ సీఈవో విజయ్ కుమార్ ఆవిష్కరించారు. గ్రామాల్లో మహిళా శక్తిని, గ్రామీణాభివృద్ధి రెండూ విదదీయరానివని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ చెప్పారు. పేదరికంలో నివసిస్తున్న గ్రామీణ నిరక్ష్యరాస్యులైన సామాన్య మహిళలు తగిన ప్రేరణతో మార్పును తేగలరనే నమ్మకంతోనే సెర్ప్ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. మహిళలు నూతన శిఖరాలను అధిరోహించే క్రమం, వారు సాధించిన విజయాలు, ఆర్థికంగా ఎదుగుతున్న వైనాన్ని ఈ పుస్తకంలో ప్రచురించినట్టు సెర్ప్ సీఈవో ఇంతియాజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment