సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సీజను ముగుస్తుండటంతో పేదలు పనుల్లేక వలస పోయే పరిస్థితి లేకుండా ఉండాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంకల్పం. అందుకు అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మార్చి నెలాఖరుకి కనీసం ఐదు కోట్ల పని దినాల పాటైనా పేదలకు పనులు కల్పించేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గత ఐదేళ్లుగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది కూడా పేదలకు సొంత గ్రామాల్లో పనుల కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున పను22ళ కల్పనపై గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ రోజూ జిల్లా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పనుల గుర్తింపుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటికే రూ. 4,022 కోట్ల మేర ఉపాధి పనులు
గత వేసవి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా కల్పించిన పనులతో కలిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి) ఇప్పటివరకు 19.07 కోట్ల పనిదినాల పాటు ప్రభుత్వం పనులు కల్పించింది. 43.08 లక్షల కుటుంబాలకు చెందిన 76.08 లక్షల మంది వారి సొంత గ్రామాల్లోనే పనులు చేసుకొని ఇప్పటికే రూ. 4,022 కోట్లు లబ్ధి పొందారు. వీరిలో దాదాపు 34 శాతం ఎస్సీ, ఎస్టీలే. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన దాదాపు 70 రోజుల్లో కనీసం ఐదు కోట్లు పనిదినాలు పని కల్పించాలని, మొత్తంగా ఈ ఏడాది 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులు ఏర్పాట్లు చేశారు.
పని దినాల కేటాయింపులు పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఏడాది మూడో విడత పని దినాల కేటాయింపులు పెంచింది. ఈ ఆర్థిక ఏడాదికి మొదట రాష్ట్రానికి 14 కోట్ల పనిదినాలు మాత్రమే కేటాయించిన కేంద్రం.. గతంలో ఒక విడత మరో ఐదు కోట్ల పని దినాలకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 19 కోట్ల పనిదినాలు కేటాయింపులు చేసింది. ఆ లక్ష్యం కూడా ఇప్పటికే పూర్తవడంతో మంగవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, రాష్ట్ర అధికారుల వర్చువల్ సమావేశంలో మరో 1.20 కోట్ల పని దినాను కేటాయించింది. దీనితో పాటు వచ్చే రెండు నెలల్లో అవసరం ఉన్న మేరకు మరిన్ని పని దినాల కేటాయింపులు పెంచేందుకు సిద్ధమంటూ కేంద్ర అధికారులు రాష్ట్రానికి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment