మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
సాక్షి, కాకినాడ : నగరంలోని దేవి మల్టీప్లెక్స్ సమీపంలో పక్కకు ఒరిగిన ఐదంతస్తుల భవనం భాస్కర్ ఎస్టేట్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం భాస్కర్ ఎస్టేట్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ రమేష్, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు కలెక్టర్ వద్ద తమ గోడును వెల్లబోసుకున్నారు. మందులు కూడా తీసుకోకుండా కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మురళీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ భవనాన్ని పరిశీలించాము. మూడు పిల్లర్లు డామేజ్ అయ్యాయి.
భవనంలోనికి ఎవరినీ అనుమతించేది లేదు. విలువైన సామగ్రిని తీసుకోవడానికి అవకాశం కల్పించాలంటూ స్థానికులు కోరుతున్నారు. ఫైర్ సిబ్బందితో మాట్లాడి వారి సహాయంతో ఒక్కొక్కరినీ లోపలికి పంపించి సామాన్లు తెప్పించే ప్రయత్నం చేస్తాము. భవనం పరిస్థితిని అధ్యయనం చేయడానికి జేఎన్‌టీయూ కాకినాడ నిపుణుల బృందం వస్తుంది. భవనం పరిస్థితిని అధ్యయనం చేసిన తరువాత వారి సూచనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. నిపుణుల నివేదిక ఆధారంగా భవనాన్ని కూల్చాలా లేక రిట్రో ఫిటింగ్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. భవనం నిర్మించిన బిల్డర్లను, ఇంజనీర్లను రప్పించి వారితో మాట్లాడతామ’’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment