అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : కరువు జిల్లా అయిన అనంతలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారిని ఆదుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వైవీ అనూరాధను కలెక్టర్ లోకేష్‌కుమార్ కోరారు. సోమవారం రాత్రి స్థానిక డ్వామా హాలులో జిల్లాలో వేరుశనగ పంట పరిస్థితి, వర్షాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు పలు సమస్యలను తెలియజేశారు. జిల్లాలో సకాలంలో వర్షాలు కురవక, కొన్ని రోజుల క్రితం అధిక వర్షాల వల్ల వేరుశనగ దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని, కట్టె కూడా మేతకు
పనికిరాకుండా పోయిందని కలెక్టర్ వివరించారు. 2011-12కు సంబంధించి ‘మిస్ మ్యాచింగ్’ వల్ల రూ.65 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు అందలేదన్నారు. 2012-13కు సంబంధించి రూ.644 కోట్లకు గాను రూ.230 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సి ఉందన్నారు.
టీబీ డ్యామ్ నుంచి జిల్లాకు రావాల్సిన 18 టీఎంసీల నీటిలో ఇప్పటి వరకు 13 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 1.34 టీఎంసీలు, ఎంపీఆర్‌లో 1.15 టీఎంసీల నీరు ఉందన్నారు. హెచ్‌ఎల్‌సీ ద్వారా 1,800 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. ఓడీ చెరువు, అమడగూరు, పుట్లూరు, యల్లనూరు మండలాల పరిధిలోని 80 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నాన్ సీఆర్‌ఎఫ్ కింద నిధులు మంజూరు చేయించాలని కలెక్టర్‌తో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ప్రభాకర్ కోరారు. 1.34 లక్షల హెక్టార్లలో పండ్ల తోటలు ఉన్నాయని, మల్చింగ్, ఫారం పాండ్స్‌కు నిధులు అధికంగా ఇప్పించాలని కోరారు. ప్రత్యేకాధికారి అనురాధ స్పందిస్తూ రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాన్ని రుణాలకు జమ చేయకుండా చూడాలని నాబార్డు ఏజీఎం రవీంద్రను ఆదేశించారు. వచ్చే వేసవిలో తాగు నీటి ఎద్దడి నివారణకు పీఏబీఆర్‌లో రెండు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవాలన్నారు. గడ్డి కొరత ఏర్పడకుండా కణేకల్లు తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచాలని పశుసంవర్ధక శాఖ జేడీ శ్యాంమోహన రావుకు సూచించారు.
పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డికి సూచించారు. మార్పు పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డ్వామా పీడీ సంజయ్ ప్రభాకర్, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, సీపీఓ సుదర్శన్ పాల్గొన్నారు.
అనంతను ఆదుకోండి
Published Tue, Oct 29 2013 4:25 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement