కలెక్టరేట్‌ ఖాళీ  | Collectorate Seats Are Going To Vacanting In Srikakulam | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఖాళీ 

Published Sat, Jul 27 2019 10:39 AM | Last Updated on Sat, Jul 27 2019 10:39 AM

Collectorate Seats Are Going To Vacanting In Srikakulam - Sakshi

కలెక్టరేట్‌

సాక్షి, శ్రీకాకుళం : కలెక్టరేట్‌లో ఈనెలాఖరుకు పలు సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో నడుస్తున్న కలెక్టరేట్‌కు ఆగస్టు ఒకటి నుంచి మరింత సమస్య ఎదురుకానుంది. ఇప్పటికే పలు సెక్షన్లలో సూపరింటెండెంట్లు లేరు. జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్ల కొరత ఉంది. ఈనెలాఖరుతో ఈ సమస్య మరింత పెరగనుంది. జిల్లా కలెక్టరేట్‌లో పనులు చకచక జరిగితేనే డివిజన్, మండల స్థాయిలో పనులు వేగవంతం అవుతాయి. జిల్లా కేంద్రంలో ఉన్నత కార్యాలయంలోనే సిబ్బంది కొరత వేధిస్తుంటే.. ఇక దిగువస్థాయిలో పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల జరిగిన బదిలీల ఫలితంగా కలెక్టరేట్‌లోని ఎనిమిది సెక్షన్లలో ఆరు ఖాళీ అయ్యాయి. తహసీల్దార్లు ఆర్‌.గోపాలరావు, కృష్ణప్రసాద్‌లు ఇన్‌చార్జిలతో ఈ సెక్షన్లను నడిపించారు. వారు కూడా ఈనెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో అన్ని సెక్షన్లు ఖాళీ కా నున్నాయి. వీరితోపాటుగా రెవెన్యూ విభాగంలో తహసీల్దారు కేడరులో ఉన్న మరో ఇద్దరు.. జె.గోపాలరావు, ఎన్‌.సరళలు కూడా పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో తహసీల్దారు కేడర్లో పది పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరమేర్పడింది.

డీపీసీ అక్టోబర్‌ వరకు లేనట్టే..
జిల్లాలో తహసీల్దార్ల కొరత తీరాలంటే ఉన్న వారికి పదోన్నతులు ఇవ్వాలి. ప్రస్తుతం డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) అమలు చేసే పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో డీపీసీ సూచన ప్రకా రం పదోన్నతులు ఇచ్చారు. దీంతో జిల్లాలో 9 మందికి ప్రమోషన్లు వచ్చాయి. కొత్తగా డీపీసీ నిర్వహించాలంటే ప్రస్తుతం ప్రో డీటీలు ఉన్నారు. సెప్టెంబర్‌ నెలలో వారి ప్రొబేషన్‌ పీరియడ్‌ పూర్తవుతుంది. ఆ తరవాత డీపీసీ ఇచ్చే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గల సీనియారిటీ ప్రాప్తికి ఇప్పటికి ఉన్న డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతి కల్పించవలసివుంది. అయితే ఈ డీపీసీ అక్టోబర్‌ వరకు లేదని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. 

అడ్‌హక్‌ తప్పనిసరి
రెగ్యులర్‌ విధానంలో తహసీల్దార్లు లేనప్పుడు పరి పాలనా సౌలభ్యం కోసం ఉన్న డిప్యూటీ తహసీల్దార్లలో సీనియర్లకు తాత్కాలిక పద్ధతిలో పదోన్నతులు ఇచ్చి తహసీల్దారు బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతులు ఇస్తారు. ప్రస్తుతం మన జిల్లాలో ఈ పరిస్థితి ఏర్పడింది. జూలై 31 నాటికి పదవీ విరమణ చేయనున్న తహసీల్దార్‌ స్థానంతో కలిపి 10మంది తహసీల్దార్లు కావాలి. ఈ పోస్టులకు అడ్‌హక్‌ పదోన్నతులు ఇచ్చే అకాశం ఉంది. 

‘ఎ’ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కీలకం
కలెక్టట్‌లో ‘ఎ’ సెక్షన్‌ కీలకంగా ఉంటుంది. ఈ సెక్షన్‌ అధికారిని పరిపాలనాధికారి (ఏవో) అంటారు. జిల్లా రెవిన్యూ విభాగంలో ఉద్యోగులు, ఇతర అంశాలకు సంబంధించిన కీలక ఫైళ్లన్నీ ఈ విభాగం నుంచే కదులుతాయి. అందుకే ఈ సెక్షన్‌ సూపరింటెండెంట్‌కి అనుభవం ఉండాలి. సాధారణంగా జీవోలపై అవగాహన ఉన్న సీనియర్‌ తహసీల్దారుకు, పనులు వేగంగా నిర్వహించే వారికి ఈ సీటును కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న సీనియర్‌ తహసీల్దార్లందరినీ వివిధ మండలాలకు కేటాయించారు. ఇక అడ్‌హక్‌లో భర్తీ అయిన అత్యంత జూనియర్‌ తహసీల్దారుకు ఈ పోస్టును కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సెక్షన్‌లోని సిబ్బందిలో ఒకరిద్దరిపై అవినీతి ఆరోపణలు, అధికారులను తప్పుతోవ పట్టిస్తారని అభియోగాలు ఉన్నాయి. ఈ తరుణంలో జూనియర్‌ అడహక్‌ తహసీల్దారును ఈ సీటులో కూర్చోబెడితే ఈ సెక్షన్‌ పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది. 

పదోన్నతులు ఇచ్చినా చేరేవారేరి?
కలెక్టరేట్‌లో వివిధ సెక్షన్లకు అడ్‌హక్‌ విధానంలో తహసీల్దారుగా పదోన్నతులు కల్పించినా, ఆ పదో న్నతులు తీసుకొనే పరిస్థితి ప్రస్తుతం రెవిన్యూ విభా గంలో లేదు. ప్రస్తుతం పదోన్నతులు పొందిన వారు కలెక్టరేట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.  కలెక్టరేట్‌లో పని అంటే ఒత్తిడితోపాటు.. రాత్రి పగలు పనులు, ఉన్నతాధికారులకు ప్రతి విషయంలో సమాధానం చెప్పకో వాల్సిన పరిస్థితి ఉంటుంది. అందువలన ఈ సెక్షన్‌ సూపరిం టెండెంట్‌ పోస్టులకు చాలా మం ది సుముఖంగా లేనట్టు తెలు స్తోంది. పదోన్నతి ఇస్తే, తహసీ ల్దారుగా పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నా, కలెక్టరేట్‌ సెక్షన్‌లో పనిచేసేందుకు ముం దుకు వచ్చిన పరిస్థితి లేదు. దీంతో ఈ అడ్‌హక్‌ పదోన్నతులపై సందేహలు చోటు చేసుకొంటున్నాయి. ఏది ఏమైనా పదోన్నతులు ఇస్తే తప్ప కలెక్టరేట్‌లో సెక్షన్‌ సూపరింటెండెంట్ల సమస్యకు పరిష్కారం లేనట్టే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement