
కొల్లేరులో నకిలీ చేపలు
కొల్లేరు తీరంలో నక్కిన నకిలీ చేపలు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాయి. పెద్దమనిషి ముసుగులో పెద్ద మొత్తంలో దొంగనోట్లు చెలామణి చేసిన టీడీపీ నేత నిజ స్వరూపం బయటపడింది.
- భారీగా నకిలీ కరెన్సీ చెలామణి
- టీడీపీ సర్పంచ్ కీలకపాత్ర
- గుడివాడ, కైకలూరు, కలిదిండిలతో లింకు
- రూ.500, 1,000 నోట్లు కర్ణాటక నుంచి వచ్చేవి
కొల్లేరు తీరంలో నక్కిన నకిలీ చేపలు ఎట్టకేలకు పోలీసుల వలకు చిక్కాయి. పెద్దమనిషి ముసుగులో పెద్ద మొత్తంలో దొంగనోట్లు చెలామణి చేసిన టీడీపీ నేత నిజ స్వరూపం బయటపడింది. ఇక్కడే కొందరు నకిలీ నోట్ల తయారీకి ఏర్పాట్లు చేయడం కలకలం రేపింది.
కైకలూరు/గుడివాడ/కలిదిండి : జిల్లాలో కలకలం రేపిన నకిలీ కరెన్సీ నోట్ల కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల విచారణలో వెలుగుచూసిన అంశాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. టీడీపీ నాయకుడు జనానికి నకిలీ నోట్లు అంటగట్టినట్లు తెలియడం సంచలనం సృష్టించింది. కొల్లేరు ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని నకిలీ కరెన్సీ రాకెట్ తమ కార్యకలాపాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనుకునే కొందరు వారికి సహరించారు.
కర్ణాటక నుంచి..
కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్‌కు చెందిన నాయక్ ద్వారా కైకలూరు నియోజకవర్గంలోని పలువురు నకిలీ నోట్లను భారీ ఎత్తున చెలామణి చేశారు. తొలుత కలిదిండికి చెందిన జలసూత్రం వెంకన్న మాత్రమే నాయక్ నుంచి నకిలీ నోట్లు తెచ్చుకుని చెలామణి చేసేవాడు. ఆ తర్వాత ఇదే ప్రాంతానికి చెందిన సూదాబత్తుల రాంప్రసాద్, సిరిగిరి సూర్యనారాయణ, కలిదిండిలో సెల్‌పాయింట్ నిర్వహిస్తున్న మండా ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా కాళ్లలో సెల్‌పాయింట్ నిర్వహిస్తున్న దొడ్డనపూడికి చెందిన కొల్లి నాగవెంకట సత్యనారాయణ, కలిదిండి మండలం సానారుద్రవరానికి చెందిన వడ్లాని రాము, మొగల్తూరుకు చెందిన గాదె ప్రదీప్ కూడా నకిలీ నోట్ల చెలామణి ప్రారంభించారు. వీరితోపాటు మరి కొందరు కూడా దొంగనోట్లు మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నోట్ల మార్పిడి ఇలా..
నకిలీ కరెన్సీ రాకెట్‌లో ఆరితేరిన నాయక్‌తో పరిచయం పెంచుకున్న జలసూత్రం వెంకన్న గత డిసెంబర్ నుంచి ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాయక్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ఆధారంగా విజయనగరం, శ్రీకాకుళం, గుంతకల్లు, హౌరా రైల్వేస్టేషన్‌లకు వెళ్లి అతను పంపిన మనిషి వద్ద నుంచి వెంకన్న దొంగనోట్లు తెచ్చుకునేవాడు. అతను రూ.5వేలు కమీషన్‌పై ఇతరులకు దొంగనోట్లు సరఫరా చేస్తాడు. నాయక్ నుంచి వెంకన్నకు రూ.500, రూ.1,000 నకిలీ నోట్లు వచ్చేవి. వెంకన్న ద్వారా రూ.28.25లక్షల విలువైన నకిలీ కరెన్సీని పలువురు చెలామాణి చేశారు. వెంకన్న సొంతంగా కలర్ ప్రింటర్, స్కానర్, పేపర్ కట్టర్‌ను కొనుగోలు చేసి రూ.100 నకిలీ నోట్లను ముద్రించి మార్పిడి చేశాడు.
గుడివాడలోనూ ముగ్గురు..
కలిదిండి మండలంలో పట్టుబడిన దొంగనోట్ల ముఠాలో గుడివాడకు చెందిన ముగ్గురు ఉన్నట్లు తేలడంతో ఈ ప్రాంతంలో కలకలం మొదలైంది. గుడివాడకు చెందిన బండారు రమేష్ రూ.3లక్షలు, కోతిబొమ్మ సెంటర్‌లో ఉండే వడ్డీ వ్యాపారి రాజేష్ రూ.1.50లు విలువైన నకిలీ కరెన్సీని చెలామణి చేసినట్లు వార్తలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేసే కిరణ్ కూడా ఈ దొంగనోట్లును పెద్ద ఎత్తున చెలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముగ్గురినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నట్లు సమా చారం. కర్ణాటకకు చెందిన నాయక్ ద్వారా వీరు దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నాయక్ అకౌంట్‌లో డబ్బులు జమచేస్తే అందుకు తగినంత దొంగనోట్లను ఓ వ్యక్తి గుడివాడ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందజేస్తాడు. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో కొద్ది మంది గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిస్తున్నారని తెలుస్తోంది.
నాయక్ ఖాతా నకిలీదే..
కర్నాటకకు చెందిన నాయక్ పేరుతో నిర్వహిస్తున్న బ్యాంకు ఖాతా కూడా నకిలీదేనని పోలీసులు గుర్తించారు. నాయక్ పేరుతో ఇక్కడి ఏజెంట్లు డబ్బు జమ చేస్తున్న ఖాతా మరో వ్యక్తి పేరుతో ఉన్నట్లు సమాచారం.
కలిదిండిలో రెండేళ్లుగా చెలామణి!
కలిదిండి మండలంలో రెండేళ్లుగా దొంగనోట్ల చెలామణి చేస్తున్నట్లు సమాచారం. గతంలో మండలంలోని తాడినాడకు చెందిన ఒక వ్యక్తి విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లాడు. అక్కడ కౌంటరులో లడ్డూలు కొనుగోలు చేయటానికి ముందుగా రూ.500 నోటు ఇవ్వగా.. అది దొంగనోటు అని గుర్తించారు. మరొకటి ఇవ్వగా అది కూడా దొంగనోటు కావడంతో పోలీసులకు సమాచారం అందించారు.
అప్పట్లో ఆ వ్యక్తిని విచారించగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన ఒక కొబ్బరికాయల వ్యాపారి ఆ నోట్లు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పటి నుంచి కలిదిండి మండలంలో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నట్లు సమాచారం. కలిదిండి మండలంలో ఎక్కువగా చేపల చెరువులు ఉండటంతో ఈ ముఠాలు సులభంగా దొంగనోట్లు చెలామణి చేస్తున్నారు. ఎట్టకేలకు దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్ట్‌చేయడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట నిఘా పెట్టాలని కొల్లేరు ప్రాంతవాసులు కోరుతున్నారు.
రూ.15లక్షలు చెలామణి చేసిన టీడీపీ నేత
నకిలీ నోట్ల ముఠాతో ముదినేపల్లి మండలంలోని వీరావిగుంట సర్పంచ్ భూపతి నాగరవీంద్రకు సంబంధం ఉంది. అతనికి రూ.15లక్షల విలువైన నకిలీ కరెన్సీ ఇచ్చినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు వెంకన్న పోలీసుల ఎదుట చెప్పాడు. రవీంద్ర భార్య నాగకళ్యాణి ముదినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిగా టీడీపీ తరఫున గెలుపొందారు. మండల టీడీపీ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే రవీంద్ర దొంగనోట్లు చెలామణి చేసినట్లు తెలియడంతో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఆయన్ను శుక్రవారం మధ్యాహ్నమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.