జగన్ దీక్షకు తరలిరండి
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జూన్ 3, 4వ తేదీల్లో గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టనున్న నిరాహారదీక్షకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవర్చేకపోగా, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ వ స్తోందన్నారు.
విచ్చలవిడిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన వ్యవసాయ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, రూ.2వేల నిరుద్యోగ భృతి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా లాంటి ప్రధాన విషయాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు శ్రీకారం చుట్టడం హేయమైన చర్యన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
దీక్షకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యేలు, పార్లమెంట్ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, మండల , గ్రామ స్థాయిల్లోని పార్టీ నాయకులు, అనుబంధ సంస్థల కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తరలిరావాలని కోరారు.