
దిగొచ్చిన బాబు
► ‘సాక్షి’ కథనాలు, విపక్షాల ఒత్తిడితో ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ వేర్వేరుగా ఇచ్చేందుకు సీఎం అంగీకారం
► ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా జిల్లాకు రూ.1,032 కోట్ల ఇన్‌పుట్ !
► బజాజ్ కంపెనీ నుంచి రైతులకు రూ.419 కోట్ల బీమా పరిహారం
► జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చమన్‌కు ఆదేశం...కొత్త చైర్మన్‌గా పూల నాగరాజు
► పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్‌గా చలపతికి అవకాశం...రాజీనామా చేయనున్న గంగన్న
► జేసీ వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని జిల్లా నేతలతో వాపోయిన చంద్రబాబు
► పనితీరు సరిగా లేకపోతే ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కవని సిట్టింగ్‌లకు హెచ్చరిక
విపక్షాల ఒత్తిడి, ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు దిగొచ్చారు. ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు ముడిపెట్టి రెండూ కలిపి హెక్టారుకు రూ.15వేల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ప్రకటించారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్షాలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డాయి.
ఇన్సూరెన్స్‌ను ఇన్‌పుట్ సబ్సిడీతో ముడిపెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని, బీమా అనేది రైతులకు హక్కుగా దక్కేదని, ప్రకటించిన మేర ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. జిల్లా రైతులకు జరుగుతున్న అన్యాయంపై ‘సాక్షి’ కూడా వరుస కథనాలు ప్రచురించింది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిని ఎండగట్టింది. దీంతో చంద్రబాబు దిగిరాక తప్పలేదు.
జిల్లాలో గత ఖరీఫ్‌లో 15.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ వేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.19,500 చొప్పున బ్యాంకర్లు పంట రుణం ఇచ్చారు. ఈ లెక్కన వేరుశనగకు రూ.2,954 కోట్ల పెట్టుబడిì పెట్టారు. ఇది కాకుండా ఇతర పంటలకు మరో రూ.700–900 కోట్ల వరకు వెచ్చించారు. బ్యాంకులో రైతులు తీసుకున్న రుణానికి ఇన్సూరెన్స్ చేసుకున్నారు. 10 శాతం ప్రీమియంలో రైతువాటాగా రెండు శాతం అంటే రూ.56 కోట్లను 6,25,050మంది రైతులు చెల్లించారు. తక్కిన 8 శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.112కోట్ల చొప్పున రూ.224 కోట్లు చెల్లించాయి.
మొత్తంగా రూ.280 కోట్ల ప్రీమియం బజాజ్ అలయంజ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అందింది. గత ఏడాది జిల్లా రైతులు పంటలు పూర్తిగా నష్టపోయారు. అయినా బజాజ్ కంపెనీ మంజూరు చేసిన బీమా పరిహారం రూ.419కోట్లు మాత్రమే. ఇన్సూరెన్స్ తక్కువగా మంజూరు కావడంతో ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ ఆశాజనకంగా ఇస్తుందని రైతులు ఆశపడ్డారు. 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించిన ప్రభుత్వం రూ.1,032.69 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించింది.
రైతులకు అయిన పెట్టుబడితో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీనికి కూడా ఇన్సూరెన్స్‌తో లింక్ పెడుతున్నట్లు గొల్లపల్లి, బుక్కపట్నం, పామిడి, అనంతపురం సభల్లో చంద్రబాబు ప్రకటించారు. దీంతో రైతులు పూర్తి నిర్వేదంలో మునిగిపోయారు. చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. సర్కారు మోసపూరిత వైఖరిని ‘సాక్షి’ మూన్నెళ్లుగా వరుస కథనాలతో ఎండగడుతూ వచ్చింది. ఈ విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అలసత్వాన్ని కూడా ఎత్తిచూపింది.
వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్షాలు కూడా దీనిపై గట్టిగానే గళాన్ని విన్పించాయి. ఈ క్రమంలోనే శనివారం ‘అనంత’ నేతలతో చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్‌కు లింకు పెడితే న్యాయపర సమస్యలు ఉత్పన్నమవుతాయని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారని, రైతులు కూడా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యారని జిల్లా నేతలు బాబుకు వివరించారు. అయినప్పటికీ చంద్రబాబు ససేమిరా అన్నారు. రాయదుర్గంలో రూ.1,032 కోట్ల చెక్కును విడుదల చేశారని, ఇది కూడా కోర్టుకు ఆధారమవుతుందని చెప్పారు.
తర్వాత వ్యవసాయ శాఖ అధికారులు, న్యాయనిపుణులతో ఫోన్‌లో చర్చించి.. విధిలేని పరిస్థితుల్లో ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ఇన్‌పుట్‌సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించారు. హెక్టారుకు రూ.15 వేలకు మించకుండా ఈ పరిహారం ఇస్తారు. ఒక్కో రైతుకు గరిష్టంగా రెండు హెక్టార్లకు చెల్లిస్తారు.
జెడ్పీ చైర్మన్‌గా పూల నాగరాజు
జెడ్పీ చైర్మన్ చమన్‌ను పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ‘ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు రాజీనామా చేయాలి? ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్నించారు. అనివార్య కారణాలతో చేయలేకపోయానని చమన్ తెలిపారు. వెంటనే చేయాలని సీఎం ఆదేశించగా.. జూలై 15న చేస్తానని చమన్ చెప్పారు. కొత్త చైర్మన్‌గా పూలనాగరాజును ఎంపిక చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అలాగే పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్‌గా గంగన్నతో రాజీనామా చేయించి చలపతిని చైర్మన్ చేయాలన్నారు.
జేసీ వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం
జేసీ దివాకర్‌రెడ్డి వైఖరితో పార్టీకి తీవ్రనష్టం వాటిల్లుతోందని చంద్రబాబు జిల్లా నేతలతో వాపోయారు. ఆయన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జేసీ బ్రదర్స్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో సమావేశానికి గైర్హాజరయ్యారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగోలేదని, మార్పు కన్పించకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడిగా బీకే పార్థసారథి మెతకవైఖరి అవలంబిస్తున్నారని, గట్టిగా ఉండాలని సూచించారు.