ఈ వెలుగులు ఆ ప్రస్థానానికే... | Command Control System On Street Led Lights | Sakshi
Sakshi News home page

ఈ వెలుగులు ఆ ప్రస్థానానికే...

Published Tue, Mar 13 2018 1:35 PM | Last Updated on Tue, Mar 13 2018 1:35 PM

Command Control System On Street Led Lights - Sakshi

రామభద్రపురంలోని పాల సొసైటీ వద్ద వెలగని ఎల్‌ఈడీ లైట్లు

అక్కడ స్విచ్‌ వేస్తేనే... ఇక పల్లెకు వెలుగులు. అదెలాఅనుకుంటున్నారా? కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ద్వారానేజిల్లా కేంద్రం నుంచి నియంత్రణ మొదలవుతుంది.ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్‌ సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఇక ఎల్‌ఈడీల ఏర్పాటు ముమ్మరమవుతోంది.ఎక్కడ దీపం వెలగకున్నా... కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌గుర్తిస్తుంది. తక్షణం దాని పునరుద్ధరణకు తగు సూచనలిస్తుంది. అంతేనా... బిల్లులు చెల్లించని పంచాయతీలకుసరఫరా నిలిపివేసేందుకు కూడా ఈ విధానం దోహదపడనుంది. విద్యుత్‌బిల్లులు సకాలంలో వసూలు కావాలంటేఇలాంటి నియంత్రణ ఇక అనివార్యమేమో...

సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని పంచాయతీల్లో వీధి దీపాలకు ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లుగా వరుసగా 14వ ఆర్థిక సంఘం, ఎంపీల్యాడ్స్‌ నిధులతో జిల్లాలోని 594గ్రామాల్లో ఇప్పటికే ఎల్‌ఈడీలను ఏర్పాటు చేశారు. మరో 326 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్‌(ఈఈఎస్‌ఎల్‌) సిద్ధమవుతోంది. ఈ దీపాలను నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల విద్యుత్‌ బకాయిల వసూళ్లకు కూడా అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన దీపాల్లో చాలా వరకూ పనిచేయడం లేదు. వాటిని మరమ్మతు చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. కమాండ్‌ కంట్రోల్‌ విధానం అమలులోకి వస్తే ఈ పరిస్థితిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది.

నగరం నుంచే వీధిలైట్ల నియంత్రణ
జిల్లాలో 920 పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి లైట్లు ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత వాటిని జిల్లా పరిషత్, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌కు అనుసంధానిస్తారు. వాటిని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏయే లైట్లు వెలుగుతున్నాయి. ఏయే లైట్లు వెలగడం లేదు. గ్రామాల్లోని వీధి లైట్ల సంఖ్యను అనుసరించి కమాండ్‌ కంట్రోల్‌ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమయిన టీసీఎంఎస్‌ బాక్సులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో తక్కువగా ఉంటే ఓ టీసీఎంఎస్‌ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. అదే పెద్ద గ్రామమయితే అక్కడి అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు బాక్సులు అవసరమవుతాయని చెబుతున్నారు. ఫ్రీక్వెన్సీని గ్రహించే దూరాన్ని బట్టి ఈ టీసీఎంఎస్‌ బాక్సులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మార్చాల్సి ఉందన్న విషయాలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి సిబ్బంది తెలుసుకుని ఆయా ఏజెన్సీలను అప్రమత్తం చేస్తారు. వెంటనే ఆయా గ్రామాల పరిధిలో ఉండే సిబ్బంది వెళ్లి లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం చేస్తారు.

బిల్లులు చెల్లించకుంటే కట్‌!
పంచాయతీల్లో ఉన్న వీధి లైట్లకు అయ్యే విద్యుత్‌ చార్జీలను చెల్లించేందుకు సర్పంచ్‌లు, విద్యుత్‌ శాఖాధికారుల మధ్య గతంలో వివాదాలు నడిచేవి. గతంలో ప్రభుత్వం చెల్లించే వీధిలైట్ల విద్యుత్‌ బిల్లులను ఇప్పుడు నిధుల్లేని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిందేనని టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూల్స్‌ మార్చింది.  జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 83,013 విద్యుత్‌ స్తంభాలుంటే వాటిలో 75,047 స్తంభాలకు వీధిలైట్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ శాఖకు జిల్లాలోని మైనర్‌ పంచాయతీలు రూ.21.29 కోట్లు, మేజర్‌ పంచాయతీలు రూ. 2.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2017–18 బకాయిలే రూ.10.35 కోట్లు కాగా వాటిలో కేవలం రూ.5.43 కోట్లు వసూలు చేయగలిగారు. ఇలా ఏటా సగానికిపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement