bills payment
-
రైల్వేలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు నొక్కేసిన విషయం బయటపడింది. సుమారు రూ.2.2 కోట్లు స్వాహా చేసినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. రైల్వే శాఖలో గతేడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించి మోసానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం విషయంలో రైల్వే అకౌంట్ అసిస్టెంట్స్ వి. గణేశ్ కుమార్, సాయిబాలాజీపై కేసులు నమోదు చేశారు. అలాగే వినాయక ఏజెన్సీస్, తిరుమల ఎంటర్ ప్రైజెస్‌పై కూడా కేసు నమోదు చేశారు. రైల్వే విజిలెన్స్ విభాగం ఫిర్యాదుతో సీబీఐ ఈ కేసులు నమోదు చేసింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సికింద్రాబాద్ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల స్కాం -
ఆఖరి పందేరం
సాక్షి, అమరావతి: ప్రస్తుత ప్రభుత్వం గడువు మరో 12 రోజుల్లో ముగుస్తుందనగా తనకు కావాల్సిన వారి బిల్లులను ఆగమేఘాలపై చెల్లించేస్తోంది. క్లియరెన్స్ సేల్ మాదిరి కోట్ల నుంచి లక్షల రూపాల బిల్లులను వివిధ శాఖల కార్యదర్శులు వారాంతంలో విడుదల చేశారు. సశేషం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అస్మదీయ సంస్థలు, వ్యక్తుల బిల్లుల చెల్లింపునకు సంబంధిత శాఖలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేస్తూ శుక్రవారం పలు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శాఖలో కంప్యూటర్ల ఏర్పాటునకు 13.47 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్షర ఎంటర్ప్రైజెస్ కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ఐటంలను సరఫరా చేసిందని, ఇందు కోసం 13,47,82,782 రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించినందుకు మరో 1.38 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. ఇక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు అవార్డు గ్రహీతలకు ఒక రోజు ఇచ్చిన డిన్నర్‌కు 3,44,430 రూపాయలను విడుదల చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఎన్. శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే ఉత్తర్వులో ఈ ఏడాది, గత ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాల నిర్వహణ కోసం 2.29 కోట్ల రూపాయలు వ్యయం కాగా ఆ మొత్తాన్ని విడుదల చేశారు. హైకోర్టు భవనాల తనిఖీ కోసం అయిన 7,54,231 రూపాయలను విడుదల చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న వారికి సౌకర్యాల కల్పన కోసం 42,80,477 రూపాయలు వ్యయం కాగా దాన్ని కూడా విడుదల చేశారు. గుర్తింపు కార్డులు ముద్రించినందుకు 4,36,314 రూపాయలు విడుదల చేశారు. ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల రెమ్యూనరేషన్ కోసం 50 లక్షల రూపాయలను విడుదల చేస్తూ ప్రణాళికా శాఖ కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించినట్లు గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శాసనసభలో గృహ నిర్మాణ శాఖ వార్షిక బడ్జెట్ పద్దులపై గురువారం జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి అసంపూర్తిగా మిగిలిన 4,12,218 ఇందిరమ్మ గృహాలకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వీటిలో అర్హులైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించగా 2,09,012 గృహాల లబ్ధిదారులు అర్హులని, మరో 1,29,633 మంది లబ్ధిదారులు అనర్హులని తేలిందన్నారు. మిగిలిన 73,573 గృహాల సర్వే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు అర్హులకు రూ.396.63 కోట్లు చెల్లించామని, మరో రూ.1133.55 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బీసీల స్థితిగతులపై బీసీ కమిషన్ నివేదిక రాగానే ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు. ఏపీలోని 23 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి అందించే రూ.10 వేల ప్రోత్సాహకాన్ని పెంచే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. -
ఈ వెలుగులు ఆ ప్రస్థానానికే...
అక్కడ స్విచ్ వేస్తేనే... ఇక పల్లెకు వెలుగులు. అదెలాఅనుకుంటున్నారా? కమాండ్ కంట్రోల్ సిస్టమ్ద్వారానేజిల్లా కేంద్రం నుంచి నియంత్రణ మొదలవుతుంది.ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్ సిద్ధమవుతోంది. జిల్లాలోని ప్రతి పల్లెలోనూ ఇక ఎల్ఈడీల ఏర్పాటు ముమ్మరమవుతోంది.ఎక్కడ దీపం వెలగకున్నా... కమాండ్ కంట్రోల్ సిస్టమ్గుర్తిస్తుంది. తక్షణం దాని పునరుద్ధరణకు తగు సూచనలిస్తుంది. అంతేనా... బిల్లులు చెల్లించని పంచాయతీలకుసరఫరా నిలిపివేసేందుకు కూడా ఈ విధానం దోహదపడనుంది. విద్యుత్‌బిల్లులు సకాలంలో వసూలు కావాలంటేఇలాంటి నియంత్రణ ఇక అనివార్యమేమో... సాక్షిప్రతినిధి, విజయనగరం: జిల్లాలోని పంచాయతీల్లో వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. మూడేళ్లుగా వరుసగా 14వ ఆర్థిక సంఘం, ఎంపీల్యాడ్స్ నిధులతో జిల్లాలోని 594గ్రామాల్లో ఇప్పటికే ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. మరో 326 గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు ఎలక్ట్రిసిటీ ఎఫీషియెన్సీ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సిద్ధమవుతోంది. ఈ దీపాలను నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రమైన విజయనగరంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల విద్యుత్ బకాయిల వసూళ్లకు కూడా అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఏర్పాటు చేసిన దీపాల్లో చాలా వరకూ పనిచేయడం లేదు. వాటిని మరమ్మతు చేయడానికి కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. కమాండ్ కంట్రోల్ విధానం అమలులోకి వస్తే ఈ పరిస్థితిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది. నగరం నుంచే వీధిలైట్ల నియంత్రణ జిల్లాలో 920 పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి లైట్లు ఏర్పాటు పూర్తి చేసిన తర్వాత వాటిని జిల్లా పరిషత్, కలెక్టరేట్లో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌కు అనుసంధానిస్తారు. వాటిని ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. ఏయే లైట్లు వెలుగుతున్నాయి. ఏయే లైట్లు వెలగడం లేదు. గ్రామాల్లోని వీధి లైట్ల సంఖ్యను అనుసరించి కమాండ్ కంట్రోల్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమయిన టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామంలో తక్కువగా ఉంటే ఓ టీసీఎంఎస్ బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. అదే పెద్ద గ్రామమయితే అక్కడి అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు బాక్సులు అవసరమవుతాయని చెబుతున్నారు. ఫ్రీక్వెన్సీని గ్రహించే దూరాన్ని బట్టి ఈ టీసీఎంఎస్ బాక్సులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మార్చాల్సి ఉందన్న విషయాలు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సిబ్బంది తెలుసుకుని ఆయా ఏజెన్సీలను అప్రమత్తం చేస్తారు. వెంటనే ఆయా గ్రామాల పరిధిలో ఉండే సిబ్బంది వెళ్లి లైట్లకు మరమ్మతులు చేయడం లేదా కొత్తవి ఏర్పాటు చేయడం చేస్తారు. బిల్లులు చెల్లించకుంటే కట్! పంచాయతీల్లో ఉన్న వీధి లైట్లకు అయ్యే విద్యుత్ చార్జీలను చెల్లించేందుకు సర్పంచ్‌లు, విద్యుత్ శాఖాధికారుల మధ్య గతంలో వివాదాలు నడిచేవి. గతంలో ప్రభుత్వం చెల్లించే వీధిలైట్ల విద్యుత్ బిల్లులను ఇప్పుడు నిధుల్లేని గ్రామ పంచాయతీలు చెల్లించాల్సిందేనని టీడీపీ ప్రభుత్వం వచ్చాక రూల్స్ మార్చింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 83,013 విద్యుత్ స్తంభాలుంటే వాటిలో 75,047 స్తంభాలకు వీధిలైట్లను నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. విద్యుత్ శాఖకు జిల్లాలోని మైనర్ పంచాయతీలు రూ.21.29 కోట్లు, మేజర్ పంచాయతీలు రూ. 2.50 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2017–18 బకాయిలే రూ.10.35 కోట్లు కాగా వాటిలో కేవలం రూ.5.43 కోట్లు వసూలు చేయగలిగారు. ఇలా ఏటా సగానికిపైగా బకాయిలు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. -
‘భగీరథ’ బిల్లు చెల్లింపులు ఇక చకచకా!
నిబంధనలను సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఇకపై కొనుగోలు చేసిన పైపులకు వెంటనే 45 శాతం, లైనింగ్ వేశాక 20 శాతం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొనుగోలు చేసిన స్టీల్ పైపులను భూమిలో వేసి లైనింగ్ చేసిన తర్వాతే బిల్లులు చెల్లిస్తుండటం, భూమిలో వేయని పైపులకు చెల్లించక పోవడటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించడంతో తాజాగా నిబంధనలు సవరించింది. అలాగే మరికొన్ని రకాల చెల్లింపుల్లోనూ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించింది. గతంలో రెండో విడత పైపులను కొనుగోలు చేశాకే తొలి విడత భూమిలో వేసిన పైపులకు 50 శాతం చెల్లించాలని నిబంధన ఉండగా, తాజాగా 10 శాతం పైపుల విలువను అట్టిపెట్టుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అలాగే ప్రతి అర కిలోమీటరుకు వేయాల్సిన వాల్వ్‌లను పైపులకు బిగించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉండగా, తాజాగా సరఫరా చేసిన 400 డయామీటర్ల సైజు వాల్వ్‌లకు 50 శాతం, ఆపై సైజు వాల్వ్‌ల విలువలో 65 శాతం చెల్లించాలని ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది.