నిబంధనలను సవరిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు నిబంధనలను ప్రభుత్వం సవరించింది. ఇకపై కొనుగోలు చేసిన పైపులకు వెంటనే 45 శాతం, లైనింగ్ వేశాక 20 శాతం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొనుగోలు చేసిన స్టీల్ పైపులను భూమిలో వేసి లైనింగ్ చేసిన తర్వాతే బిల్లులు చెల్లిస్తుండటం, భూమిలో వేయని పైపులకు చెల్లించక పోవడటంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించడంతో తాజాగా నిబంధనలు సవరించింది.
అలాగే మరికొన్ని రకాల చెల్లింపుల్లోనూ కాంట్రాక్టర్లకు వెసులుబాటు కల్పించింది. గతంలో రెండో విడత పైపులను కొనుగోలు చేశాకే తొలి విడత భూమిలో వేసిన పైపులకు 50 శాతం చెల్లించాలని నిబంధన ఉండగా, తాజాగా 10 శాతం పైపుల విలువను అట్టిపెట్టుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అలాగే ప్రతి అర కిలోమీటరుకు వేయాల్సిన వాల్వ్‌లను పైపులకు బిగించిన తర్వాతే బిల్లులు చెల్లించాల్సి ఉండగా, తాజాగా సరఫరా చేసిన 400 డయామీటర్ల సైజు వాల్వ్‌లకు 50 శాతం, ఆపై సైజు వాల్వ్‌ల విలువలో 65 శాతం చెల్లించాలని ప్రభుత్వం నిబంధనలను సవరించింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను ఆదేశించింది.