సాక్షి, గజ్వేల్: ‘మిషన్ భగీరథ’దేశంలోనే గొప్ప పథకమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. నయా పైసా ఇవ్వడం లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని మిషన్ భగీరథ హెడ్‌వర్క్స్ వద్ద నాలెడ్జ్ సెంటర్‌లో పథకం అమలు తీరుపై సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్‌తో కలసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగీరథ పథకానికి నిధుల కోసం తాను, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రూ.15 వేల కోట్ల నిధులు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ కూడా సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. కానీ, గుజరాత్, వారణాసిలో తాగునీటి పథకాలకు కేంద్రం సాయం చేస్తుందని, అదే తెలంగాణ విషయమై వివక్ష చూపుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన ‘జల్‌జీవన్ మిషన్ పథకం’ కంటే కూడా భగీరథ గొప్పదన్నారు. అప్పులు తెచ్చి భగీరథ ప్రాజెక్టును పూర్తి చేశామని, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని విజయవంతంగా అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు.
భగీరథ డిజైన్ చూశాకే మనసు మార్చుకున్నా..
ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మంచినీటి కోసం పడుతున్న గోస చూసి చలించిపోయానని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. టీడీపీ పక్ష నేతగా ఉన్న తాను ఈ ప్రాజెక్టు డిజైన్ చూసిన తర్వాతనే మనసు మార్చుకున్నానని, టీఆర్‌ఎస్‌లో చేరడానికి భగీరథ పథకమే కారణమని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వందశాతం ఆవాసాలకు తాగునీటిని అందిస్తున్నామని స్మితాసబర్వాల్ తెలిపారు. కాగా, ఉత్తమ సేవలందించిన ఇంజనీర్లను మంత్రి ఎర్రబెల్లి సన్మానించి జ్ఞాపికలను బహూకరించారు. కాగా, భగీరథ లేబుళ్లు ఉన్న వాటర్ బాటిళ్లను ప్రారంభించిన మంత్రి దయాకర్‌రావు, స్మితాసబర్వాల్.. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భగీరథ వాటర్ బాటిళ్లనే వినియోగించాలని, వీటిని ఉచితంగానే పంపిణీ చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment