సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 70 శాతం భూభాగా నికి తాగు, సాగు నీటి అవసరాలను తీరుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్రం మరోమారు పట్టించుకోలేదు. ఈ ప్రాజెక్టుకు లేదా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా లేక కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆర్థిక సాయం అందించాలన్న వినతిని పెడచెవిన పెట్టింది. శనివారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎక్కడా కాళేశ్వరం ప్రస్తావన కానరాలేదు. దీనికి జాతీయ హోదా ఇవ్వాలని ఇప్పటికే సీఎం కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ఎంపీలు కోరినా పట్టనట్లే వ్యవహరించింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతున్నాయని, వాటిలో అధికభాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీక రించిన అప్పుల ద్వారానే పూర్తి చేస్తున్నా మని చెబు తున్నా, కేంద్రం ప్రాజెక్టుపై ఎక్కడా ప్రస్తావన చేయలేదు.
జల్‌జీవన్ తెచ్చినా.. మనకు దక్కేది శూన్యమే..
దేశంలోని ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా నల్లా నీటిని అందించే లక్ష్యంతో జల్‌జీవన్ మిషన్‌కు కేంద్రం పెద్దపీట వేసింది. 2024 నాటికి సంపూర్ణ తాగునీటిని అందించే లక్ష్యంతో జల్ జీవన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.11,500 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ అప్పుల తిరిగి చెల్లింపులకు కేంద్రం నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇప్పటికే పూర్తయిన పథకానికి జల్ జీవన్ మిషన్‌నుంచి నిధులు కేటాయిస్తారా? అన్నది ప్రశ్నగానే ఉంది. ఇక పీఎంకేఎస్‌వై కింద బడ్జెట్‌లో కేంద్రం రూ.11,127 కోట్లు కేటాయించింది. అయితే గత బడ్జెట్‌లో రూ.9,682 కోట్లు కేటాయించినప్పటికీ దాన్ని తిరిగి రూ.7,896 కోట్లకు సర్దుబాటు చేసింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత ఏడాది ఎంతమేర ఖర్చు ఉంటుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. ఇక పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధులతో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద చేపట్టిన కొమురం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టు లకు మరో రూ.300 కోట్ల మేర రావాలి. క్యాడ్‌వామ్ కింద 18 ప్రాజెక్టులు గుర్తించగా, వాటికి రూ.2వేల కోట్ల మేర ఇవ్వాల్సి ఉంది.వాటికి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. వీటిని పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంది. వీటికి ఈ ఏడాది ఏమైనా ఖర్చు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. మొత్తంగా కేంద్ర జల శక్తి శాఖకు కేటాయించిన రూ.30,478కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు దక్కే నిధుల వాటా అంతంతమాత్రమేనని సాగునీటి శాఖ ఇంజనీర్లు, నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment