రాజకీయ దురుద్దేశంతో కేసులు తగదని హైకోర్టు వ్యాఖ్య
అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులను సమంగా చూడాలని సూచన
ధర్మాసనం స్పందనపై జిల్లా వ్యాప్తంగా చర్చ
రాజకీయ ప్రత్యర్థులను వేధించే అధికార పార్టీ నాయకులకు పోలీసులు కొమ్ముకాయొద్దని హైకోర్టు సూచించింది. రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులకు అండగా నిలిచిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసులు పెట్టిన అధికారులు, అదే క్రమంలో వారి ఫిర్యాదును పట్టించుకోకపోవడం తగదని హితబోధ చేసింది. కోర్టు స్పందన నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపై పెడుతున్న అక్రమ కేసులు మరోమారు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
తిరుపతిః అధికారులను పావులుగా ఉపయోగించి ప్రతిపక్షంపై అక్రమకేసులు బనాయిస్తు న్న అధికారపార్టీ నాయకులకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. పోలీసులు, అధికారులు ఒక వర్గం ఫిర్యాదుతో కేసు నమో దు చేసి.. మరొకరి విన్నపాన్ని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ దురుద్దేశంతో వేసే కేసులు, ఫిర్యాదులపై అధికారులు, పోలీసులు విచక్షణతో నిర్ణయాలు తీసుకోవాలని హితబోధ చేసింది. రేణిగుంట విమానాశ్రయంలో ఈనెల 26వ తేదీన ఎయిర్ ఇండియా విమానంలో న్యూఢిల్లీకి వెళ్లాల్సిన 19 మంది ప్రయాణికుల విషయంలో ఆ సంస్థ మేనేజరు రాజశేఖర్ దురుసుగా వ్యవహరించారని బాధితులు ఎంపీ మిథున్‌రెడ్డి వద్ద వాపోయారు. దీంతో ఆయన ప్రయాణికులకు అండగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ప్రయాణించే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక పోలీసులు మాత్రం ఎంపీ, ఎమ్మెల్యేపై అధికారపార్టీ నాయకుల ప్రోద్భలంతో కేసులు నమోదు చేయడంతో హైకోర్టు ఈ వాఖ్యలు చేసింది. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తే.. ఇక బాధితులకు పోలీసులు ఏం న్యాయం చేసినట్లని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ తర్వాత సెక్షన్ 41(ఏ)కింద వారికి నోటీసులు ఇచ్చి వాటిపై బాధితుల వివరణ పూర్తిగా తెలుసుకున్నాకే కేసులో ముందుకు సాగాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జిల్లా నాయకులు వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులపై పెట్టిన అక్రమ కేసులు మరోమారు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
‘మచ్చ’తునకలు
మార్చి నెలలో పూతలపట్టులో ట్రాన్స్‌కో షిప్టు ఆపరేటర్ పోస్టు స్థానికుడికి ఇవ్వలేదని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై అధికారపార్టీ నాయకులు తప్పుడు కేసులు బనాయించారు. దీనికి ప్రధాన కారణం రోస్టర్ పాయింట్ ప్రకారం తన నియోజకవర్గంలోని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకుండా ఇతర జిల్లాల వారికి ఎందుకు స్థానం కల్పించారని ఎమ్మెల్యే ప్రశ్నించడమే. దీనిపై ఇప్పటికీ ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. పూతలపట్టు, ఐరాల మండలాల్లోని స్థానికులు ఈ అంశంపై ఆయన ఆమరణదీక్షకు దిగిన ఎమ్మెల్యేకు తమ మద్దతు ప్రకటించారు.
ఆగస్టులో పుత్తూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దళిత సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే రోజా ధర్నా చేస్తుండగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకులు అడ్డుకుని ధర్నాను భగ్నం చేశారు. పైగా దళితులను కులంపేరుతో కించపరిచినట్లు ఆరోపిస్తూ.. అక్రమ కేసులు బనాయించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఇరువర్గాలు చర్చించి కేసులు ఎత్తివేశారు.
అడుగడుగునా ఆగడాలు..
ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులోనూ అధికారపార్టీ నాయకులు యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఒక్కచోట కూడా ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదు. రేషన్‌కార్డు మంజూరు నుంచి కాంట్రాక్టుల వరకు అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట్ల ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ఇక నీరు- చెట్టు పథకంలో తెలుగుదేశం నాయకులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చెరువు మట్టిని వ్యవసాయ పొలాలకు తరలించాల్సి ఉండగా.. పారిశ్రామిక వేత్తలు, రియల్‌ఎస్టేట్ వ్యాపారుల లేఔట్లకు తరలించడంపై చాలా మండలాల్లో రైతులు తిరగబడ్డారు. ఇక జన్మభూమి కమిటీ సభ్యుల పేరిట అధికారపార్టీ నాయకులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తప్పా.. నిజమైన అర్హులకు పెన్షన్లు, గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇకనైనా అధికార పార్టీ నాయకులు విచక్షణతో ప్రవర్తించాలని పలువురు సూచిస్తున్నారు.
అధికారపార్టీకి చెంపపెట్టు
Published Wed, Dec 2 2015 1:49 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement