విజయవాడ సిటీ : విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోకి రాజధాని ప్రతిపాదిత ప్రాంతమైన తుళ్లూరు సబ్ డివిజన్‌ను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కమిషనరేట్ విస్తరణపై చర్చించేందుకు కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి చినరాజప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బి.ప్రసాదరావు, రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు, నగర పోలీసు కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని కమిషనరేట్ స్వరూప స్వభావాలపై చర్చించారు.
ఆదివారం నగరానికి వచ్చిన డీజీపీ కూడా సీపీతో పాటు గుంటూరు జిల్లా పోలీసు అధికారులతో మరోసారి ఈ విషయంపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాజధాని ఏర్పాటు నేపథ్యంలో తుళ్లూరు ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో కలపాల్సిన ఆవశ్యకతపై ఇక్కడి అధికారులు గతంలోనే నివేదిక ఇచ్చారు. కమిషనరేట్ పరిధితో పాటు పోలీసుల సంఖ్య పెంపు, వాహనాలు, ఆయుధాలు, ఇతర విభాగాల ఏర్పాటు తదితర అంశాలపై తయారుచేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
మరోవైపు తుళ్లూరు గుంటూరు జిల్లాలో ఉన్నందున గుంటూరు కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుచేయాలని అక్కడి అధికారులు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెండు నివేదికలను పరిగణనలోకి తీసుకొని సోమవారం నగర పోలీసు కమిషనరేట్‌లో జరిగే సమావేశంలో డీజీపీ రాముడు విధాన ప్రకటన చేసే అవకాశముంది. తుళ్లూరు ప్రాంతాన్ని పోలీసు కమిషనరేట్‌లో విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెండు ప్రతిపాదనలు...
అధికారులు ప్రభుత్వం ముందుకు రెండు ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు సమాచారం. నగర పోలీసు కమిషనరేట్ పరిధి విస్తరణలో భాగంగా తుళ్లూరు ప్రాంతాన్ని కలపడం వాటిలో మొదటిది. గుంటూరును సైబరాబాద్ కమిషనరేట్ తరహాలో విస్తరించడం రెండోది. హైదరాబాద్ కమిషనరేట్‌లో రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉన్న విషయాన్ని పలువురు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది.
మౌలిక సదుపాయాల కల్పన
నగర పోలీసు కమిషనరేట్ పరిధి విస్తరిస్తే మౌలిక సదుపాయాల కల్పన భారీగా చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని ప్రకటనతో వీవీఐపీ, వీఐపీల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 20 పోలీసుస్టేషన్లు ఉండగా, అన్ని రకాల సిబ్బంది కలిపి 2,500 మంది ఉన్నారు.
నగర పోలీసు కమిషనర్‌తోపాటు ఇద్దరు డీసీపీలు, ముగ్గురు అదనపు డీసీపీలు, ఆరుగురు ఏసీపీలు ఉన్నారు. కమిషనరేట్ పరిధిని విస్తరిస్తే అదనపు పోలీసు కమిషనర్‌తో పాటు జాయింట్ కమిషనర్‌ను నియమించాలి. సెక్యూరిటీ, సైబర్ క్రైం విభాగాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కలిపి సుమారు 10 వేల మంది పోలీసులు అవసరమని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
బెజవాడలో డీజీపీ
విజయవాడ సిటీ : రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు ఆదివారం విజయవాడ నగరానికి వచ్చారు. గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలోని మాదిరెడ్డిపాడులో ఏర్పాటు చేయనున్న గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రం స్థలాన్ని పరిశీలించిన ఆయన రాత్రికి కమిషనరేట్‌కు చేరుకున్నారు.
అనంతరం గుంటూరు రేంజ్ అధికారులతో సమావేశమై సిబ్బంది విధివిధానాలపై సమీక్షించారు. తిరిగి సోమవారం ఉదయం ఏలూరు రేంజ్ అధికారులతో సమావేశం కానున్నట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. జిల్లాలోని నందిగామ సబ్ డివిజన్‌లోని కొన్ని పోలీస్‌స్టేషన్లను కమిషనరేట్‌లో కలిపే విషయమై రేంజ్ అధికారులతో చర్చించనున్నట్టు తెలిసింది. అనంతరం రాష్ట్ర పోలీసు సీనియర్ అధికారులతో కలిసి వార్షిక నేర నివేదికను విడుదల చేయనున్నారు.
కమిషనరేట్ పరిధిలోకి తుళ్లూరు!
Published Mon, Dec 29 2014 4:20 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement