సబ్సిడీ రుణాలపై కమిటీల వేటు! | Committee eliminated subsidized loans! | Sakshi
Sakshi News home page

సబ్సిడీ రుణాలపై కమిటీల వేటు!

Published Wed, Nov 19 2014 1:28 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

సబ్సిడీ రుణాలపై కమిటీల వేటు! - Sakshi

సబ్సిడీ రుణాలపై కమిటీల వేటు!

ఎన్నికల ముందు అడ్డగోలు వాగ్దానాలు చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన అనంతరం వాటిని నెరవేర్చలేక రకరకాల కమిటీల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటికే సామాజిక పింఛన్ల ఎంపికలో జన్మభూమి పేరిట కమిటీలు ఏర్పాటుచేసి తెలుగు తమ్ముళ్లకు పెత్తనం కట్టబెట్టారు. అదేవిధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ కింద బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం అందజేసే సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికకు కూడా ప్రతి మండలానికి ముగ్గురు తెలుగు తమ్ముళ్లతో స్క్రీనింగ్  కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు తమ పార్టీకి చెందిన వారికే పచ్చజెండా ఊపే అవకాశం ఉండటంతో కొందరి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
 
ఉదయగిరి: జిల్లాలో ఈ నెల మొదటి వారంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాల కోసం లబ్ధిదారులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. ఈ నెల 15వ తేదీతో గడువు ముగుస్తుందని మొదట ప్రకటించినప్పటికీ దీనిని మళ్లీ ఈ నెల 25వరకు పొడిగించారు.

ఈ రుణాలకు సబ్సిడీ 50-60 శాతం ఉండటంతో అనేకమంది ఔత్సాహికులు రుణాలు పొందేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మండల పరిషత్‌కార్యాలయాలకు దరఖాస్తులందాయి. మరో వారం రోజులు గడువు ఉండటంతో ప్రస్తుతం అందినవాటికంటే రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు అందే అవకాశముంది. జిల్లావ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.100 కోట్లకు పైగా రుణాలు అందజేయనున్నారు. గతంలోకంటే ఈసారి సబ్సిడీ కూడా 50 శాతం పైబడి ఉండటంతో ఈ రుణాల కోసం పోటీ కూడా తీవ్రంగా ఉండనుంది.

 లబ్ధిదారుల ఎంపిక
మండల పరిషత్‌కు అందిన దరఖాస్తులను బ్యాంకర్లు, ఎంపీడీఓ, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు పరిశీలించి లబ్ధిదారుల్ని ఎంపిక చేయనున్నారు. ఈ కమిటీలో మండలాధ్యక్షుడికి కూడా చోటు కల్పించలేదు. పైగా స్క్రీనింగ్ కమిటీలో ముగ్గురు జిల్లా ఇన్‌చార్జి మంత్రిచే నియమించబడిన అధికార పార్టీ సభ్యులు ఉంటారు. వీరు చెప్పిందే ఈ ఎంపికలో చెల్లుబాటయ్యే అవకాశముంది.

గతంలో లబ్ధిదారుల ఎంపికలో బ్యాంకర్లు, ఎంపీడీఓలకు ప్రాధాన్యం ఉండేది. ప్రస్తుతం స్క్రీనింగ్ కమిటీ రావడంతో వీరు కేవలం ప్రేక్షకపాత్ర వహించే అవకాశం మాత్రమే ఉంది. ఈ పరిణామం బ్యాంకర్లకు కూడా తలనొప్పిగా మారనుంది. స్క్రీనింగ్ కమి టీ సభ్యులు తమకు ఇష్టమొచ్చిన వారి పేర్లను సూచించే అవకాశం ఉండటంతో అలాంటివారు బ్యాంకుతో సక్రమమైన లావాదేవీలు  లేకపోతే ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది.

ఈ పరిణామం రుణాల గ్రౌండింగ్‌కే ఇబ్బంది తలెత్తవ చ్చు. అయితే ప్రభుత్వం మాత్రం 50- 60 శాతం సబ్సిడీ ఇస్తున్నందున బ్యాంకర్లు ఇచ్చేది కొద్దిపాటి రుణమే కాబట్టి తమ కమిటీ సభ్యులు సూచించిన లబ్ధిదారులనే ఎంపికచేయాలని ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.

 అధిక సంఖ్యలో దరఖాస్తులు
 ఈ సబ్సిడీ రుణాలు మండలానికి ఒక్కో కేటగిరికి పదుల సంఖ్యలోనే యూనిట్లు మంజూరయ్యాయి. కానీ వీటికోసం దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తున్నాయి. ఒక్కొక్క దరఖాస్తుదారుడు ప్రభుత్వం నిర్దేశించిన వివిధ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు రూ.500 పైనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో మండలానికి అన్ని కేటగిరీలు కలుపుకుని వంద యూనిట్లు మంజూరైతే, దరఖాస్తులు మాత్రం వేల సంఖ్యలో రావటం విశేషం.

అంటే అనేకమంది పెద్ద మొత్తంలో ఖర్చుచేసి దరఖాస్తులు అందజేసినా స్క్రీనింగ్ కమిటీలదే పెత్తనం కావడంతో అర్హులకు కూడా రుణాలు అందే అవకాశం లేదనే విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారుల ఎంపికలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేయడంపై ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

 స్క్రీనింగ్ కమిటీలు రద్దు చేయాలి :
 ప్రభుత్వం సబ్సిడీ రుణాల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ పేరుతో టీడీపీ నేతలను ఎంపిక చేయడం దారుణం. దీనిద్వారా అర్హులకు అన్యా యం జరిగే అవకాశముంది. ఆ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. గతంలో మాదిరి బ్యాంకర్లు, ఎంపీడీఓలకు లబ్ధిదారుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలి. స్క్రీనింగ్ కమిటీలను రద్దు చేయాలి.               
-చేజర్ల సుబ్బారెడ్డి, ఎంపీపీ, ఉదయగిరి

 కార్పొరేషన్ రుణాలపై రాజకీయ జోక్యం తగదు:
 ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ లబ్ధిదారులకు అందజేసే సబ్సిడీ రుణాల ఎంపికలో రాజకీయ కమిటీలకు తావివ్వరాదు. ఇలా అవకాశమిస్తే కేవలం అధికారపార్టీకి చెందిన వారికే రుణాలు దక్కే అవకాశముంది. ఈ విధానం గత ప్రభుత్వాలలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వం సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపికలో తీసుకున్న ఈ వివాదాస్పద కమిటీలు రద్దు చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి.
 - చిన్నయ్య, మాజీ సర్పంచ్, తెడ్డుపాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement