దీపానికీ పచ్చముద్ర
జన్మభూమి కమిటీ ఓకే అంటేనే గ్యాస్ కనెక్షన్
జిల్లా వ్యాప్తంగా 35 వేల కనెక్షన్లు
కుప్పానికే 9 వేలు
అర్హులైన పేదలందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీ ఓకే చెప్పందే కనెక్షన్ మంజూరు చేయడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు చెల్లుబాటు కావడం లేదన్న విమర్శలున్నాయి. అర్హతతో సంబంధం లేకుండా టీడీపీ శ్రేణులకే గ్యాస్ కనెక్షన్లు అందుతున్నట్లు సమాచారం.
చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం దీపం గ్యాస్ కనెక్షన్లకు సైతం జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి చేయడంతో టీడీపీ నేతలకు తప్ప పేదలకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేసిన జాబితానే తహశీల్దార్లు ఓకే చేస్తుండగా వాటికి మాత్రమే పౌరసరఫరాల శాఖ అధికారులు కనెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ఈ ప్రకారం సర్వే నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల మందికి గ్యాస్ లేనట్లు తేలింది. ఇందులో ఈ ఏడాది 1,60,800 మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 70 వేలమంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 35 వేల కనె క్షన్లు పంపిణీ చేశారు. మిగతా 35 వేల మందికి రెండవ విడతలో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా జన్మభూమి కమిటీల ఆమోదం లభించకపోవడంతో పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. లక్ష్యం మేరకు ఇంకా 1.35 లక్షల మందికి ఈ ఏడాదే గ్యాస్ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ జాబితా కాకుండా జిల్లా వ్యాప్తంగా మరో 3 లక్షలమంది అర్హులున్నారు. వీరందరికీ ఎప్పటిలోగా గ్యాస్ అందిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
అర్హతలతో పాటు అధికార పార్టీ నేతల సిఫారసు కూడా..
దీపం కనెక్షన్ కావాల్సిన వారు నిబంధనల ప్రకారం దరఖాస్తుతోపాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తున్నారు. అయితే జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి కావడంతో కేవలం అధికార పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు తప్పితే అర్హుల దరఖాస్తులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకే ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. 14 నియోజకవర్గాల పరిధిలో 35 వేల కనె క్షన్ ఇచ్చినట్లు చెబుతున్నా ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 9వేల కనెక్షన్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల పైచిలుకు అర్హులకు గ్యాస్ లేదని గణాంకాలు చెబుతున్నా అధికారులు మాత్రం వారందరికీ గ్యాస్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా జన్మభూమి కమిటీల మాటున కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే పంపిణీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.