ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. కక్షలు రగిలేచోట శాంతిసుమాలు విరిసేందుకు కృషి చేయాలి. అలాంటి పోలీసులే దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.. అంటున్నారు విమానాశ్రయం బాధితులు. గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో సర్వే చేస్తున్న అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు. అనంతరం పోరాట కమిటీ నేతలు నచ్చజెప్పడంతో ఎవరికి వారు వెనుదిరిగారు. కానీ భోగాపురం పోలీసులు రెవెన్యూ అధికారులు వారిస్తున్నా గ్రామస్తులపై అకారణంగా కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి వల్లే అతిగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
భోగాపురం: గతనెల 27న కొంగవానిపాలెం రెవెన్యూ పరిధిలో తూర్పుబడిలో సర్వే చేస్తున్న అధికారులను రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీకి చెందిన విమానాశ్రయ వ్యతిరేక కమిటీ నాయకుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొందరు నాయకులు అక్కడికి చేరుకుని అధికారులపై తిరగబడుతున్న రైతులు, గ్రామస్తులను నిలువరించారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూముల్లో సర్వే ఏవిధంగా చేస్తారని, తక్షణమే వెళ్లిపోవాలని అధికారుల్ని కోరడంతో అంతా వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో వచ్చిన సీఐ వైకుంఠరావు, ఎస్‌ఐ దీనబంధు మార్గమధ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు, రైతులను ఆపి మాట్లాడారు. ఆ సమయంలో అక్కడున్న వారిని పోలీసు సిబ్బంది సెల్‌ఫోన్‌లో వీడియో తీసి పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ ఎవీ రమణ అదేరోజు సాయంత్రం భోగాపురం వచ్చారు.
రెవెన్యూ అధికారులను కేసు పెట్టమని కోరగా.. ప్రజలతో తమకు సత్సంబంధాలుండాలని, వారి భూమిలోకి వెళ్లామని మాత్రమే తమను అడ్డుకున్నారు తప్ప ఏం జరగలేదని, ఎలాంటి కేసులొద్దని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారుల వినతిని వినిపించుకోకుండా స్టేట్‌మెంట్ మాత్రమే నమోదు చేస్తున్నాం రండని పిలిచి ముందుగా పదిమందిపై కేసులు నమోదుచేశారు. అప్పటికీ సెలవులో ఉన్న తహశీల్దారు డి.లక్ష్మారెడ్డి కేసులు వద్దని సీఐకి ఫోనులో చెప్పినా ఏం లేదంటూనే కేసులు నమోదు చేసేశారు. అది చాలదంటూ వారి వద్దనున్న వీడియో ఆధారంగా మరో 12మందిపై విడతల వారిగా కేసులు నమోదు చేశారు. అదీచాలక గ్రామాల్లోకి వెళ్ళి కేసులు నమోదు చేసిన ఇళ్లకు నోటీసులు కూడా అంటించారు. దీంతో పోలీసుల తీరుపై రెవెన్యూ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో గ్రామస్తులు, రెవెన్యూ అధికారుల మధ్య సఖ్యత చెడిందని ఒక రెవెన్యూ అధికారి వాపోయారు.
మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులా?
మా భూముల్లోకి వచ్చి మాపైనే కేసులు పెట్టారు. విమానాశ్రయానికి భూములిచ్చేందుకు వ్యతిరేకిస్తున్నా మా సమ్మతి లేకుండా భూముల్లోకి చొరబడటం దౌర్జన్యం కాదా. అడ్డుకుంటే కేసులు పెడతారా? పోలీసులు గ్రామాల్లో తిరుగుతూ, ఇళ్లకు నోటీసులు అంటిస్తూ భయబ్రాంతుల్ని చేస్తున్నారు.
- కోరాడ పాపయ్యమ్మ, బాధితురాలు
పోలీసులే అన్యాయం చేస్తే ఎవరికి చెప్పాలి
మా భూములు సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్నందుకే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారు. మేం బాధను చెప్పుకోడానికి వీలులేకుండా సెక్షన్లు అంటూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. పోలీసులే అన్యాయానికి పాల్పడితే ఎవరికి చెప్పుకుంటాం?
-కోరాడ సన్యాసమ్మ, బాధితురాలు
పోలీసుల చిచ్చు.. బాధితులకు ఉచ్చు
Published Fri, Aug 7 2015 12:03 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement