ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ కోరారు.
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ మైదానంలో ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, సాధించిన ప్రగతిని వివరించారు. నీలం తుఫాన్ వల్ల కలిగిన పంట నష్టానికి 32 వేల మంది రైతులకు ప్రభుత్వం పరిహారంగా రూ.17 కోట్లు విడుదల చేసిందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపుకింద జిల్లాలో 12వేల 603 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 11వేల 559 ఎకరాలు సేకరించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇప్పటి వరకు రూ. 459.39 కోట్లు, భూసేకరణకు రూ.571.86 కోట్లు, అటవీ భూములకు రూ.109.20 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 104కోట్ల 16లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 2, 29,528 కుటుంబాల్లోని 3,96, 922 మంది కూలీలకు సరాసరిన 31.37 రోజుల పని కల్పించినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షా 44వేల 839 రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పథకం అమలులో రాష్ట్రం స్థాయిలో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాకు అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ నష్టాల అంచనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయన్నారు. బాధితులకు సత్వర నష్ట పరిహారం అందించటానికి తఎ వంతు కృషి చేస్తున్నామన్నారు.సభానంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలుత జిల్లా కలెక్టరు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఎమ్మెల్సీలు కె.ఎస్ లక్షణరావు, సింగం బసవపున్నయ్య, ఎమ్మెల్యే ఎస్.కె మస్తాన్‌వలి, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టరు వివేక్ యాదవ్, అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.