neelam toofan
-
సమష్టి సహకారంతో అభివృద్ధి
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ కోరారు. శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ మైదానంలో ఆంధ్ర రాష్ర్ట అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు, సాధించిన ప్రగతిని వివరించారు. నీలం తుఫాన్ వల్ల కలిగిన పంట నష్టానికి 32 వేల మంది రైతులకు ప్రభుత్వం పరిహారంగా రూ.17 కోట్లు విడుదల చేసిందన్నారు. పులిచింతల ప్రాజెక్టు ముంపుకింద జిల్లాలో 12వేల 603 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటి వరకు 11వేల 559 ఎకరాలు సేకరించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఇప్పటి వరకు రూ. 459.39 కోట్లు, భూసేకరణకు రూ.571.86 కోట్లు, అటవీ భూములకు రూ.109.20 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 104కోట్ల 16లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 2, 29,528 కుటుంబాల్లోని 3,96, 922 మంది కూలీలకు సరాసరిన 31.37 రోజుల పని కల్పించినట్లు చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షా 44వేల 839 రోగులకు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ పథకం అమలులో రాష్ట్రం స్థాయిలో జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాకు అపార నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ నష్టాల అంచనాల తయారీలో నిమగ్నమై ఉన్నాయన్నారు. బాధితులకు సత్వర నష్ట పరిహారం అందించటానికి తఎ వంతు కృషి చేస్తున్నామన్నారు.సభానంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తొలుత జిల్లా కలెక్టరు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఎమ్మెల్సీలు కె.ఎస్ లక్షణరావు, సింగం బసవపున్నయ్య, ఎమ్మెల్యే ఎస్.కె మస్తాన్‌వలి, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టరు వివేక్ యాదవ్, అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
హన్మకొండటౌన్, న్యూస్‌లైన్ : భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన నేతృత్వంలో జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు ఆదివారం కలెక్టర్ కిషన్‌ను కలిసి వర్షాలతో దెబ్బతిన్న పం టలు, నష్టపోయిన రైతుల పరిస్థితిని వివరించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ఇటీవల కురి సిన భారీ వర్షాలతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలి పారు. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. వర్షాల కారణంగా జిల్లాలో సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. గతంలో నీలం తుఫానుతో పంటలు నష్టపోయి న రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ నష్ట పరిహారం అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వర్షాలతో పంటలు కోల్పోయిన రైతుల ను ప్రభుత్వం ఆదుకోకుంటే వారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారని ఆయన తెలిపారు. పంట నష్టాలను ఆదర్శ రైతులతో కాకుండా ప్రత్యేక అధికారులతో చేయిం చాలని కోరారు. వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు ఎకరానికి రూ15వేలు, పత్తి, మిర్చి పంటలకు ఎకరానికి రూ 20 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన కలెక్టర్ ను కోరారు. అలాగే రంగు మారిన ధాన్యంతోపాటు ఇతర పంటలను కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కేం ద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారి లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, ఎంపీ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొమ్మాటి సాంబయ్య, గండ్ర సత్యనారాయణరావు, వేం నరేందర్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఈగ మల్లేషం, మోహన్‌లాల్, అనిశెట్టి మురళీ, మార్గం సారంగం పాల్గొన్నారు. -
'నీలం' తూఫాన్ పరిహారం విడుదల
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: నీలం తుపాను నష్ట పరిహారం ఎట్టకేలకు విడుదలైంది. రెండో విడతలో రూ.10.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని రైతులకు పంపిణీ చేయాలని అధికారులను నిర్దేశించింది. ఇది లా ఉంటే తొలి విడతగా విడుదలైన పరిహారమే పూర్తిగా ఇప్పటికీ పంపిణీ కాలేదు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లోని రైతులకు బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో వారికి నష్ట పరి హారం అందలేదు. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి ఫలితంగా ఉండటం లేదు. గతేడాది నవంబర్‌లో నీలం తుపాను కారణంగా భారీగా పంట నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టం అంచనాలను తయారు చేసి అదే ఏడాది డిసెంబర్లో నివేదికను ప్రభుత్వానికి పంపా రు. 13,724.95 హెక్టార్లలో జరిగిన పంట నష్టానికి సంబంధించి 57080 మంది రైతులకు గాను రూ.13.34 కోట్లు మొద టి విడతగా విడుదల చేసింది. ఇందులో 11 కోట్లు పంపిణీ చేసినప్పటికీ మరో రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని జిల్లా అధికారులు నెల రోజుల క్రితమే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బ్యాంకు అకౌంట్లు లేని రైతులకు చెక్కుల పంపిణీ చేసే విధంగా ఆదేశాలివ్వాలని కోరారు. కాని ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. తాజాగా రెండో విడతలో 10,862.61 హెక్టార్లలో పంట నష్టానికి సంబంధించి 49,101 మంది రైతులకు మొత్తం రూ.10.06 కోట్లను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. 50 శాతానికి పైగా పంట నష్టం జరిగిన రైతులకు మాత్రమే ఈ పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ ఇన్పుట్ సబ్సిడీ నేరుగా ఆధార్‌తో అనుసంధానం చేసిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కానుంది. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని లబ్ధిదారులైన రైతులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తొలి విడతలోనే పరిహారం పూర్తిగా పంపిణీ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రెండో విడతలో కూడా బ్యాంక్ అకౌంట్లు లేని వారికి ఏ విధంగా పంపిణీ చేయాలన్న విషయంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. బ్యాంక్ ఖాతాలు లేని రైతులకు చెక్కల రూపంలో పరిహారం అందించే అవకాశం ఇవ్వనిపక్షంలో వేల మంది రైతులకు పంట నష్టం అందే అవకాశం లేదు. దీనిపై అధికారులు మరోసారి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తున్నారు.