అనంతపురం అర్బన్ : ‘చంద్రబాబుకు రాయలసీమ కరువు, ఇక్కడి రైతులు, కూలీలు, ప్రజల కష్టాలు కనిపించడం లేదు. కరువు గురించి కనీసం మాట్లాడటం లేదు. రైతులను ఆదుకోకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. అవసరమైతే రాయలసీమలోని నాలుగు జిల్లాల బంద్ చేపడతాం. అంతిమంగా ప్రభుత్వం మెడలు వంచుతామ’ని సీపీఎం, సీపీఐ నాయకులు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో 30 గంటల ‘కరువుపై రాయలసీమ బైఠాయింపు’ కార్యక్రమాన్ని చేపట్టారు.
సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు వి.రాంభూపాల్, డి.జగదీశ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.ఓబులు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబుళేసు, మహిళ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి పాల్గొని.. ప్రసంగించారు. సీఎం చంద్రబాబు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు తప్ప సీమ రైతులను ఆదుకుందామనే కనీస స్పృహ లేదని మండిపడ్డారు.
రెయిన్‌గన్‌ల ద్వారా ఆరు లక్షల ఎకరాల్లో పంటను కాపాడామంటూ రైతులను, ప్రజలను మోసం చేశారన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా దగా చేశారని, ఉపాధి కూలీలకు సీమలో రూ.250 కోట్ల బకాయిలను చెల్లించలేదని తెలిపారు. కరువు, పంటలకు గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడటం లేదని, దీన్ని బట్టి చూస్తే ఆయనకు ఎంత నిర్లక్ష్యమో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. రాయలసీమలో ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం కల్పించింది లేదని అన్నారు.
రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, లేదంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చిత్తూరు, వైఎస్‌ఆర్, కర్నూలు జిల్లాల సీపీఎం, సీపీఐ నాయకులు చలమయ్య, రామాంజినేయులు, ఈశ్వరయ్య, షడ్రక్, జిల్లా నాయకులు ఎంవీ రమణ, కాటమయ్య, జాఫర్, నారాయణస్వామి, మల్లికార్జున, నాగేంద్ర, లింగమయ్య, సీపీఐ ఎంఎల్ నాయకుడు పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.