‘దేశం’లో ఒలింపిక్స్!
- తెలుగుదేశం ఎంపీల మధ్య ఒలింపిక్ క్రీడ
- లోకేష్ రంగ ప్రవేశంతో రాజుకున్న దుమారం
- ఎవరికి వారు తమదే అసలైన కార్యవర్గం అంటున్న వైనం
ఆంధ్రప్రదేశ్ బ్యూరో: ఏపీ ఒలింపిక్ సంఘాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోడానికి టీడీపీలోని ఇద్దరు ఎంపీలు ఎత్తులకు పైఎత్తులు, ఒత్తిళ్ల మధ్య ఇదో రాజకీయ ఒలింపిక్‌లా వేడెక్కింది. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో ఈ నెల 4న తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో ఏపీ ఒలింపిక్ సంఘానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నికలను గుర్తించడంలేదంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తన వర్గంతో రంగంలోకి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. జయదేవ్ ఎన్నిక చెల్లదన్న రమేష్ అసోసియేషన్‌కు ఆదివారం(ఈ నెల 19న) ఎన్నికలు జరిగాయి. దీనికి తెరవెనుక ప్రాణం పోసింది లోకేష్ కావడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరి న్యాయస్థానం వరకు వెళ్లింది. జయదేవ్ గ్రూపు ఎన్నికలు చెల్లవంటూ గుంటూరు జిల్లా న్యాయస్థానంలో ఒకరు పిటిషన్ దాఖలు చేయగా, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరుతో ఎవరో పిటిషన్ వేశారని ఏపీ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.రాజేష్‌కుమార్ కోర్టుకు విన్నవించడం, దానిపై కోర్టు విచారణకు ఆదేశించింది.
జయదేవ్‌ను తప్పుకోవాలన్న లోకేష్
తిరుపతిలో జరిగిన ఎన్నికల్లో గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఎంపికైనట్టు ప్రకటించిన నేపథ్యంలో కత్తులు నూరిన సీఎం రమేష్ తొలుత ఈ విషయాన్ని చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ముందు పెట్టారు. ఆయన వెంటనే గల్లాకు ఫోన్ చేసి అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఏపీఓఏ ఎన్నికల అంశాన్ని ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే తాను రంగంలోకి దిగానని తేల్చిచెప్పారు. అయినప్పటికీ సీఎం రమేష్ అధ్యక్షుడిగా ఎంపికయ్యేందుకు సహకరించాలని జయదేవ్‌పై లోకేష్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ససేమిరా అన్న గల్లా జయదేవ్ జరిగిన విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు.
జయదేవ్ చె ప్పిన అంశాలను పూర్తిగా విన్న చంద్రబాబు అవునా... అని మిన్నకుండిపోయారు. మరోవైపు సీఎం రమేష్ కూడా ఈ ఎన్నిక వ్యవహారాన్ని మరో సందర్భంలో చంద్రబాబు దృష్టికి తెచ్చినప్పుడు చూద్దాం అని మాత్రం సమాధానమిచ్చినట్టు తెలిసింది. ఈ పంచాయతీ మధ్య రమేష్‌తో పాటు పవన్‌కుమార్‌లను ఎలాగైనా ఏపీఓఏ అధ్యక్ష, కార్యద ర్శులుగా ఎంపిక చేయాలనే పట్టుదలతో పెద్ద నాయకులు లోకేష్‌తో అంతర్గతంగా మంతనాలు జరిపారు. మాలక్ష్మీ గ్రూప్ అధినేత హరిశ్చంద్రప్రసాద్‌తో పాటు పలువురు ఇదే అంశంపై చర్చలు జరిపారు. దీంతో లోకేష్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థతో పాటు ఒలింపిక్ సంఘంలో కీలకంగా వ్యవ హరించే వారితో నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే ఆయా క్రీడలకు సంబంధించిన సంఘాలన్నీ ఇందులో సభ్యులుగా ఉంటారు. దాంతో వారందరినీ తమవైపు తిప్పుకోవడానికి లోకేష్ శతవిధాలా ప్రయత్నించారు. ఎలాగైనా సీఎం రమేష్ ఏపీఓఏ అధ్యక్షుడు కావాలని ఒత్తిడి తెచ్చారు. అయితే వారందుకు అంగీకరించలేదని తెలిసింది. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు పున్నయ్య చౌదరిపై టీడీపీ నేత కరణం బలరాం ద్వారా లోకేష్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
బాబుతో ఇద్దరూ చైనాకు...
చంద్రబాబు చైనా పర్యటించిన బృందంలో గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లిద్దరూ ఉన్నారు. దాదాపు వారం పాటు వారిద్దరూ చైనాలో కలిసి తిరిగినప్పటికీ రాష్ట్రంలో వారి మద్దతుదారులు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలయ్యారు. 17 అర్థరాత్రి రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు వచ్చీ రాగానే తమ మద్దతుదారులతో సమాలోచనలు జరిపారు.
జయదేవ్‌కు అవగాహన లేదు: శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీఎం రమేష్ క్రీడలపట్ల వాటి సంఘాల పట్ల గల్లా జయదేవ్‌కు అవగాహన లేదని విమర్శించారు. చైనా పర్యటనలో తమ మధ్య అవగాహన కుదిరిందని, జయదేవ్‌కు తమ అసోసియేషన్ గౌరవాధ్యక్ష పదవి ఇస్తామని రమేష్ చెప్పారు.
ఎవరైనా సరే సహించం
లోకేష్ ఎంత ఒత్తిడి తెచ్చినా నేతలు దిగిరాలేదు. ఈ ఎన్నికలకు రాజకీయ రంగు పులమడమేంటని ప్రశ్నించారు. మరోసారి ఇలాగే ఒత్తిడి తెస్తే తాము పార్టీతో పాటు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసి సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామని పలువురు నేతలు హెచ్చరించారు. పార్టీకి సంబంధం లేని ఒక మాజీ ఎంపీ హస్తం ఉన్న ప్యానెల్‌ను ఏ రకంగా వెనకేసుకొస్తారని, పైగా రమేష్ పోటీ పడుతున్న ప్యానెల్‌లో ఇతర పార్టీల వారూ ఉన్నారని జయదేవ్ తరఫున కొందరు నేతలు లోకేష్ ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజకీయాలకు తావులేదు
గుంటూరు: క్రీడల్లో రాజకీయాలకు తావులేదని, అలాంటి రాజకీయాలు తాను చేయబోనని ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గల్లా జయదేవ్ ఆదివారం మీడియాతో అన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల మేరకే రాష్ట్ర సంఘం ఏర్పడిందన్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లో ఒలింపిక్ అసోసియేషన్‌కు చెందిన కొంతమంది సభ్యులు సమావేశమై ఏప్రిల్ 4న తిరుపతిలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం 4వ తేదీన తిరుపతిలో సమావేశం నిర్వహించి ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, చైర్మన్‌గా కె.వి.ప్రభాకర్, కార్యదర్శిగా ఆర్.కె.పురుషోత్తం, ట్రెజరర్‌గా కె.పద్మనాభం ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఈ కార్యవర్గానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) గుర్తింపు కూడా ఇచ్చిందని జయదేవ్ వర్గం చెబుతోంది. అయితే ఆ ఎన్నిక చెల్లదని, ఈ నెల 19న జరిగిన ఎన్నికలే అసలైనవని వాదిస్తూ సీఎం రమేష్ వర్గం తాజా ఎన్నికల ప్రక్రియను ప్రకటింపజేసుకుని ఐఓఏ పరిశీలకుడిని పంపాలని కోరింది. అయితే, ఒలింపిక్ సంఘం ఎవరినీ పంపలేదు.
ఒలింపిక్ సంఘం ఎన్నికల్లో విజయం సాధిస్తే క్రీడాకారులతో సన్నిహిత సంబంధాలతో పాటు రాష్ర్టం, దేశంలో జరిగే ముఖ్యమైన క్రీడలకు ప్రతినిధులుగా హాజరయ్యే వీలుంటుంది. దీంతో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, సీఎం రమేష్‌లు అధ్యక్షులుగా అసోసియేషన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకోడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగించారు. ఈ సంఘాలకు కేంద్ర క్రీడల శాఖ నుంచి పెద్ద ఎత్తున నిధులందుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ అధ్యక్షుడిగా, అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి కార్యదర్శిగా పోటీకి ప్యానల్ తయారైంది. నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ప్యానెల్ వ్యవహారాలన్నీ లోకేష్ కనుసన్నల్లో జరిగిపోయాయి.