మూతపడిన విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు
స్వచ్ఛందంగా బంద్ పాటించిన నగరవాసులు
బస్టాండ్ వద్ద కాంగ్రెస్, సీపీఐ నిరసన
మధ్యాహ్నం వరకు తిరగని బస్సులు
విజయవాడ : ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు ఉద్యమించాయి. ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో సమర శంఖం పూరించాయి. నగరంలో మంగళవారం ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ సంపూర్ణమైంది. విద్య, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు ఆగిపోయాయి. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. ఉదయం నుంచి కాంగ్రెస్, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు నగరంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతంరెడ్డి లెనిన్‌సెంటర్‌లో ఆందోళనలో పాల్గొని బంద్‌కు మద్దతు ప్రకటించారు.
బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
కాంగ్రెస్, సీపీఐ నేతలు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. తొలుత బీసెంట్‌రోడ్డుకు ర్యాలీగా చేరుకుని కొద్దిసేపు నినాదాలు చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా బయల్దేరి పండిట్ నెహ్రు బస్టాండ్ చేరుకున్నారు. బస్టాండ్ ముఖద్వారం వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్, నరహరిశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, పార్టీ నేతలు దోనేపూడి శంకర్, అక్కినేని వనజ, ముజాఫర్ అహ్మద్ తదితరులు నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీపీఐ కార్యకర్తలు బస్సులకు అడ్డంగా పడుకుని నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం నగరమంతా ర్యాలీగా తిరిగి షాపులు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, సినిమా హాల్స్, విద్యాసంస్థలు మూసి వేయించారు.
బార్ అసోసియేషన్‌లో దీక్షలు
ప్రత్యేక హోదా డిమాండ్‌తో బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు రిలే నిరహారదీక్షలను మంగళవారం నుంచి ప్రారంభించారు. బార్ అధ్యక్షుడు చిత్తరువు శివ వెంకట జగదీశ్వరరావు, బార్ సభ్యులు చలసాని అజయ్ కుమార్, వైఆర్‌సీ రాజశేఖర్, సుంకర రాజేంద్రప్రసాద్, జగదీశ్వరరావు, వేముల హజరత్తయ్య గుప్తా దీక్ష నిర్వహించారు. రఘువీరారెడ్డి, రామకృష్ణ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఆర్టీసీకి రూ.70లక్షలు నష్టం
బస్‌స్టేషన్ : బంద్ ప్రభావం ఆర్టీసీపై బాగానే పడింది. సుమారు రూ.70లక్షల నష్టం వాటిల్లింది. ప్రత్యేక హోదా కావాలంటూ ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్ వల్ల మంగళవారం బస్టాండ్ బోసిపోయింది. పలు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాతే బస్సులు తిరిగాయి. అయితే, రాష్ర్టవ్యాప్తంగా బంద్ జరుగుతుందన్న విషయం గుర్తించిన వారు ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి కూడా బస్సులు ఖాళీగానే తిరిగాయి. కృష్ణా రీజియన్ పరిధిలో రోజుకు రూ.కోటీ 40లక్షలు ఆదాయం వస్తుందని, బంద్ ప్రభావంతో మంగళవారం రూ.70 లక్షలే వచ్చిందని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రామారావు ‘సాక్షి’కి తెలిపారు.
మూతపడిన కార్పొరేషన్
విజయవాడ సెంట్రల్ : ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం మూతపడింది. ఉదయం 10 గంటలకు కార్యాలయానికి అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు ఆధ్వర్యంలో ఆందోళనకారులు వచ్చి బంద్‌కు సహకరించాల్సిందిగా ఉద్యోగుల్ని కోరారు. అకౌంట్స్ సెక్షన్‌లో ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు మొరాయించడంతో బంద్ నిర్వా హకులు వాదనకు దిగారు. ఉద్యోగులు, సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయం మూతపడింది. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు.
బంద్ సంపూర్ణం
Published Wed, Aug 12 2015 1:11 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement