చీమకుర్తి, న్యూస్‌లైన్: ప్రభుత్వోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు బ్రేక్ పడనుంది. ప్రభుత్వం రాష్ట్రంలోని 5 వేల హైస్కూళ్లను ఎంపిక చేసి వాటిలో కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో 2008లో పథకాన్ని ప్రారంభించింది. దానిలో భాగంగా జిల్లాలోని 186 హైస్కూళ్లకు కంప్యూటర్లు అందజేసింది. 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం మీద దాదాపు 50 వేల మందికిపైగా విద్యార్థులు కంప్యూటర్ విద్యను అభ్యసించారు. రాష్ట్రం మొత్తం మీద 15 లక్షల మంది కంప్యూటర్ విద్యను అభ్యసించి ఉంటారని అంచనా.
చీమకుర్తి మండలంలో పల్లామల్లి, గాడిపర్తివారిపాలెం, దేవరపాలెం, ఆర్‌ఎల్‌పురం జెడ్పీ హైస్కూళ్లలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు కంప్యూటర్ విద్య నేర్చుకునే అవకాశం కలిగింది. ఐదేళ్లపాటు ఆయా స్కూళ్లలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యలో ఫండమెంటల్స్, టైప్ రైటింగ్, పవర్ పాయింట్, వర్డ్ పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కంప్యూటర్ విద్య అందిస్తున్నామని చెబుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను చేర్పించారు. ఫలితంగా ఆయా స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది.
ముగిసిన ప్రాజెక్టు గడువు: రాష్ట్రంలోని 5 వేల హైస్కూళ్లలో ముందుగా అనుకున్న ఐదేళ్ల ప్రాజెక్టు గడువు నేటితో ముగియనుండటంతో జిల్లాలోని కంప్యూటర్ విద్యపై శిక్షణ ఇచ్చే కోఆర్డినేటర్లు వారి పరిధిలోనున్న కంప్యూటర్లను ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు అప్పగించే పనిలో ఉన్నారు. ఇక నుంచి కంప్యూటర్ విద్య నేర్పించేందుకు ప్రత్యేక వలంటీర్లు లేనందున విద్యార్థుల కంప్యూటర్ శిక్షణకు బ్రేక్ పడనుంది. పథకాన్ని మరికొంత కాలం పొడిగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కంప్యూటర్ విద్యకు బ్రేక్
Published Thu, Oct 31 2013 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement