ప్రహ్లాదుడు ఏమయ్యాడో!
రుద్రవరం : రెండు రోజులు గడిచినా చేతికంది వచ్చిన కొడుకు జాడ తెలియకపోవడం వృద్ధ తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆలమూరుకు చెందిన ఓ యువకుడు బస్సు ఏజెంట్ అయిన తన మామకు తోడుగా వెళ్లి విద్యార్థులతో పాటు గల్లంతయ్యాడు. రుద్రవరం బండలం ఆలమూరుకు చెందిన కొర్రె పెద్దనాగిశెట్టి, లక్ష్మీనర్సమ్మ ఒక్కగానొక్క కుమారుడు ప్రహ్లాదుడు(22). కూతుళ్లు లక్ష్మీదేవి, నాగలక్ష్మిలకు వివాహం కాగా.. కుమారుడిని డిగ్రీ వరకు చదివించారు.
పెద్దనాగిశెట్టి అక్క కొడుకు అయిన కడప జిల్లా మైలవరం మండలం యాపరేవుల గ్రామానికి చెందిన మురళి పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ప్రహ్లాదుడు.. మురళి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోనే ఎంబీఏలో చేరాడు. మొదటి సంవత్సరం పూర్తి కాకమునుపే వెన్నెముక నొప్పితో చదువుకు స్వస్తి చెప్పాడు. అప్పటి నుంచి గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈనెల ఒకటో తేదీన ప్రహ్లాదుడు.. మురళి ఇంటికి వెళ్లాడు.
హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు మురళి ఏజెంట్‌గా వెళ్తుండగా.. ప్రహ్లాదుడిని కూడా వెంట తీసుకెళ్లాడు. అయితే బియాస్ నదిలో విద్యార్థులు ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా నీరు రావడంతో విద్యార్థులతో పాటు ప్రహ్లాదుడు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు ఆరుగురి మృతదేహాలను బయటపడగా.. మిగిలిన వారి ఆచూకీ తెలియక ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఆ ఘటనలో ప్రహ్లాదుడు కూడా ఉన్నాడని తెలిసి వృద్ధు తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అనారోగ్య కారణాలతో ఊరు వదిలివెళ్లలేని వీరు.. కుమారుడు ఏమయ్యాడోననే బెంగతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.