మా ఇళ్లను కూల్చేసి, తరిమేశారు
మానవ హక్కుల కమిటీ ముందు అంగుళూరు గ్రామస్తుల ఆవేదన
దేవీపట్నం/రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామమైన అంగుళూరును దౌర్జన్యంగా ఖాళీ చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు ఇంద్రజిత్‌కుమార్(అసిస్టెంట్ రిజిస్ట్రార్, లా), రజ్‌బీర్‌సింగ్ (డిప్యూటీ ఎస్పీ) మంగళవారం విచారణ నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని అంగుళూరును 2015 మే నెలలో అధికారులు దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు ఈ విచారణ నిర్వహించారు. ఈ సంద ర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ ఇళ్లను అధికారులు కూల్చేసి తరిమేశారని తెలిపారు. 2013 కొత్తచట్టం ప్రకారం తమకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని కమిషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.