ఎక్కడి పనులు ఇంకా అక్కడే..
- పట్టిసీమ నుంచి పూర్తి సామర్థ్యంతో విడుదలకాని నీరు
- పూర్తిగాని అండర్ టన్నెల్స్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి 10 రోజులైనా గోదావరి జలాలు ఇంకా కృష్ణమ్మను చేరలేదు. ఇప్పటివరకూ కేవలం 0.75 టీఎంసీల నీరు మాత్రమే దిగువకు వచ్చింది. శనివారం సాయంత్రానికి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వద్దకు జలాలు చేరతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టిసీమ నుంచి కృష్ణాజిల్లా సీతారామపురం బ్రిడ్జి వరకూ పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువను ‘సాక్షి’ బృందం పరిశీలన జరిపింది.
పూర్తి సామర్థ్యంతో ఇస్తారా?
► ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న పట్టిసీమలోని 24 మోటార్లు ఆన్ చేశారు.
► అప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయి. ►గురువారం వరకూ రోజుకు 700 క్యూసెక్కులు విడుదల చేయగా, శుక్రవారం నుంచి 2,450 క్యూసెక్కులు ఇస్తున్నారు. పూర్తిసామర్థ్యంతో నీటిని విడుదల చేయడం లేదు. ► భవిష్యత్‌లో కూడా 4వేల క్యూసెక్కుల కన్నా ఎక్కువ నీరు ఇచ్చే అవకాశం కనబడటం లేదు.
అసంపూర్తిగా పనులు
► గోపాలపురం మండలం గుడ్డిగూడెం-గోపాలపురం మధ్య నాలుగు ప్రదేశాల్లో అండర్ టన్నెల్స్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ► గోపాలపురం, చిట్యాల వద్ద పైపులతో తాత్కాలికంగా వంతెనల నిర్మాణం చేపట్టారు.►యూటీలు నిర్మించవలసిన ప్రదేశాల్లో మట్టితో గట్లు పూడ్చే పనులు జరుగుతూనే ఉన్నాయి. ► దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలో 12 కిలోమీటర్ల మేర ఏటిగట్ల పనులు అసంపూర్ణంగా ఉన్నాయి. ► ముండూరు నుంచి జానంపేట వరకూ పనులు సాగుతూనే ఉన్నాయి.
► తాత్కాలిక వంతెనలు పైపులతో వేశారు. ప్రస్తుతం 2,450 క్యూసెక్కుల నీరు వస్తేనే అవి పూర్తిగా మునిగిపోయాయి.
► ఒకవేళ పూర్తి సామర్థ్యం 8,400 క్యూసెక్కుల నీరు వస్తే తాత్కాలిక వంతెనలు పూర్తిగా మునిగిపోవడంతో పాటు కొట్టుకుపోయే అవకాశం ఉంది. ► కృష్ణాజిల్లాలోనూ అదే పరిస్థితి కనపడుతోంది. పల్లెర్లమూడి వద్ద రామిలేరుపై అండర్ టన్నెల్ పనులు కూడా పూర్తి కాలేదు. సీతారామపురం వద్ద రాష్ట్ర రహదారిపై వంతెన పనులు పూర్తి కాలేదు.►వందలాది టీఎంసీ నీళ్లు ధవళేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తున్నా.. పట్టిసీమ నుంచి వదిలింది కేవలం 0.75 టీఎం సీలు. ► రోజుకు పూర్తి సామర్థ్యంతో విడుదల చేసినా కనీసం 120 రోజులపాటు గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా పంపితేగాని ఖరీఫ్‌లో ముఖ్యమంత్రి చెప్పినట్లు 80 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యం కాదు.