పోలవరం వద్ద ఐకానిక్ వంతెన
- నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలి
- ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దగ్గర ఐకానిక్ వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిధి గృహంలో పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఇది పూర్తయితే చరిత్రలో అద్భుతమైన ప్రాజెక్టుగా నిలిచిపోతుందన్నారు. సమస్యలు ఎన్ని ఉన్నా, ఆటంకాలు ఎన్ని ఎదురైనా పనుల వేగాన్ని పెంచి నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి నిర్మాణ సంస్థలు ప్రయత్నించాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చేందుకు నాబార్డు అంగీకరించిందని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసులపై సమర్థవంతమైన వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఈ ప్రాజెక్టు ఫొటోలతో సహా రికార్డు భద్రం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మ్యూజియంలో పోలవరం చరిత్ర మొత్తం ప్రతిబింబించాలన్నారు. పోలవరం పనులను రియల్ టైమ్‌లో తెలుసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేసి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని సూచించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.