పోలీసుల్లో అయోమయం!
Published Thu, Sep 18 2014 12:15 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
సాక్షి, గుంటూరు
బదిలీలపై పోలీసు శాఖలో అయోమయం కొనసాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తయినా బదిలీల వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో అధికారులు గందరగోళానికి గురవుతున్నారు. కావల్సిన చోట పోస్టింగ్ సాధించేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు తమ పరిధిలోని స్టేషన్లకు రావల్సిన అధికారుల జాబితాను పోలీస్ ఉన్నతాధికారులకు ఇప్పటికే ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బదిలీల ప్రక్రియ ఆలస్యం కావడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు మాత్రం సీఐలు, ఎస్సైల పనితీరు, వారికొచ్చిన రివార్డులు-అవార్డులతోపాటు వారిపై ఉన్న ఆరోపణల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. అధికార పార్టీ నేతలు ఇచ్చిన జాబితాలనే ఖరారు చేసే పక్షంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు డీఎస్పీల పోస్టింగ్‌లు పూర్తి చేశాక సీఐలు, ఎస్సైల పోస్టింగ్‌లపై ఉన్నతాధికారులు దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. అయితే ఇవేమీ పట్టని కొందరు అధికారులు మాత్రం టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు అవకాశం కల్పిస్తే మీరు చెప్పినట్టే చేస్తామంటూ వారిముందు సాగిలపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు రేంజి పరిధిలో సీఐల జాబితాను ఇప్పటికే సిద్ధం చేయగా.. డీజీపీ కొన్ని మార్పులను సూచించారని, ఈ మేరకు కొత్త జాబితాను రూపొందించడంలో జిల్లా అధికారులు నిమగ్నమైనారని తెలిసింది.
విధులను పక్కనబెట్టి పైరవీలు
కొందరు అధికారులు విధి నిర్వహణను పక్కనబెట్టి మరీ టీడీపీ నేతల చుట్టూ తిరుగుతున్నారని.. దీనివల్ల శాంతిభద్రతలు క్షీణించే పరిస్థితి నెలకొందని పోలీసు వర్గాలే చెబుతున్నారుు. ఎలాగైనా బదిలీ తప్పదని, ఈలోగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని భావిస్తున్న అధికారులు, సిబ్బంది ఎలాంటి పనికైనా వెనుకాడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. సొమ్ము కోసం కొన్ని కేసులను బలవంతంగా రాజీ చేరుుస్తున్నారని సమాచారం. ఇలాంటి అక్రమాల నిరోధానికి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సిబ్బంది అందికాడికి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వారంరోజుల్లో బదిలీల పర్వం ప్రారంభం కానుందని సమాచారం. కొత్త అధికారులు వచ్చేవరకు సమస్యలు తప్పవని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
Advertisement
Advertisement