
అయోమయానికి తెర ఎప్పుడో!
సాక్షి, రాజమండ్రి :పుష్కరాల పనులు డిసెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఉభయ గోదారి జిల్లాల్లో 243 స్నానఘట్టాలను నిర్తిస్తాం. రూ.900 కోట్లతో పుష్కర పనులు చేస్తాం.- గోదావరి పుష్కరాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఇటీవల చేసిన ప్రకటనలివి. మొత్తం కేటాయించేదెంతన్నది ఇందులో ప్రకటించారే తప్ప.. ఈ మొత్తం నిధుల్లో ఏ శాఖకు ఎంత వస్తుందనేదానిపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితినిబట్టి డిసెంబర్ నెలాఖరు వరకూ వీటిపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. శాఖల వారీగా అసలు ఇచ్చేదెంతో, తక్షణం విడుదల చేసేదెంతో తేలిస్తేనే.. ఆ తర్వాత మరో నెల రోజులకు పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది పావన గోదావరికి జరిగే మహాపర్వ నిర్వహణకు చేపట్టే మొత్తం పనుల్లో ఇరిగేషన్ శాఖ పాత్రే కీలకం. ఈ మహత్తర సంరంభానికి ప్రధానమైన ఘాట్‌లు నిర్మించడంతోపాటు, అక్కడ జరిగే ఇతర ఏర్పాట్లలో కూడా ఈ శాఖ ముఖ్య భూమిక పోషించనుంది. పుష్కరాల కోసం జిల్లాలో మొత్తం 145 పనులకు రూ.43 కోట్లతో అంచనాలు తయారు చేశారు. వీటిలో సుమారు 64 పనులు ఘాట్‌ల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం ఉద్దేశించారు. ఇందుకు రూ.20 కోట్ల మేర ప్రతిపాదనలు తయారు చేశారు. గోదావరి తీరంలోని సుమారు 63 గ్రామాల్లో కొత్తగా ఘాట్‌లు నిర్మించేందుకు సుమారు రూ.18 కోట్లతో ప్రతిపాదించారు. ఇంకా ఘాట్‌లలో బారికేడ్ల నిర్మాణం, అత్యవసర సమయాల్లో వినియోగించే స్పీడ్ బోట్లను సిద్ధం చేయడం, పంట్ల మరమ్మతులు, ఘాట్‌లకు అనుబంధంగా ఉన్న రోడ్ల అభివృద్ధి వంటి మరో 18 పనులకు రూ.5 కోట్లు ఖర్చు కాగలవని ప్రతిపాదించారు.
పుష్కరాలు విజయవంతంగా సాగాలంటే ఈ పనులు తప్పనిసరని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత నిధులన్నీ ఇస్తే ప్రస్తుత అంచనాలపై సర్వే చేయించి పక్కాగా తుది నివేదిక తయారు చేయాలి. తర్వాత టెండర్లు పిలవడం లేదా ప్రభుత్వం ఇతర నిర్దేశించిన పద్ధతుల్లో పనులు చేపట్టాలి. మొత్తం 145 పనులకు తుది అంచనాలు ఖరారు చేయాలంటేనే అధికారులకు కనీసం 15 రోజులు పడుతుంది. దీనినిబట్టి చూస్తే రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే నిధులపై స్పష్టత వస్తే అంచనాలకు తుది రూపు ఇవ్వడం, తదనంతర ప్రక్రియకు మరో నెల రోజులైనా పడుతుంది. కనీసం డిసెంబరు నెలాఖరుకైనా పనులు ప్రారంభం కాకపోతే పుష్కరాలనాటికి కొత్త ఘాట్‌ల నిర్మాణ పనులు పూర్తి కావని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆశించిన నిధుల్లో ప్రభుత్వం కోత పెడితే, మళ్లీ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పుష్కరాల పనులను మరింత ఆలస్యం చేస్తుంది.
ప్రణాళికారహితంగా...
ఈసారి పుష్కరాలకు ప్రభుత్వం ప్రణాళికారహితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతిసారీ పుష్కరాలకు జూలై నెలలోనే అంచనాలు తీసుకుని, వాటికి తగినట్టు నిధులు కేటాయించేవారు. తర్వాత తమకు కేటాయించిన నిధుల ప్రకారం ఆయా శాఖలు అంచనాలు వేసుకుని పనులు ప్రారంభించేవారు. కానీ ప్రస్తుతం పుష్కరాలకు ఏడు నెలలు మాత్రమే వ్యవధి ఉన్నా ఇప్పటికీ ఓ స్పష్టతకు ప్రభుత్వం రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.