మండలిలో పట్టుసాధించేందుకు టీడీపీ ఎత్తు
హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలిలో పట్టు సాధించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సఫలమైంది. పార్టీలో చేర్పించుకునే ప్రక్రియలో సాగించిన రాయబేరాలు దారికొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఏడుగురు శనివారం సీఎం క్యాంపు కార్యాలయమైన లేక్ వ్యూ అతిథి గృహంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చైతన్యరాజు, రవివర్మ, గాదె శ్రీనివాసులునాయుడు, పుల్లయ్య, బి.ఇందిర, లక్ష్మీ శివకుమారి, షేక్ హుస్సేన్ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో షేక్ హుస్సేన్ తన పదవికి రాజీనామా చేయగా చైర్మన్ శనివారం ఆమోదించారు. దీంతో ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరినట్లయింది.
అనంతపురానికి చెందిన తిప్పేస్వామి ఇంతకుముందే ఆ పార్టీలో చేరారు. వీరిలో కొందరు నేరుగా కాంగ్రెస్ తరఫున ఎన్నికైన వారు కాగా మరికొంతమంది కాంగ్రెస్‌కు అనుబంధంగా కొనసాగినవారున్నారు. మండలిలో ఆరుగురు సభ్యులకు పరిమితమై ఉన్న టీడీపీ బలం వీరి చేరికతో తాజాగా 13కి పెరిగింది. మెజార్టీకి అవసరమైన సభ్యులకోసం ఆ పార్టీ నేతలు మంతనాలు కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వారిలో ఆరుగురు ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్‌గా సాగుతున్నందున వారి మద్దతుకోసం కూడా టీడీపీనేతలు ప్రయత్నిస్తున్నారు. వారు తమకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే కేవలం అంశాల వారీగా మాత్రమే సహకారం ఉంటుందని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రాభివృద్ధికోసమే టీడీపీలోకి: ఎమ్మెల్సీలు
రాష్ట్రాభివృద్ధికోసమే తాము టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయమైన లేక్‌వ్యూ అతిథిగహంలో బాబు సమక్షంలో టీడీపీలో చేరిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు.
టీడీపీలో చేరిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
Published Sun, Jun 22 2014 1:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement