ఎంపిక కసరత్తు
Published Mon, Jan 13 2014 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: అధికార కాంగ్రెస్‌లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తుకు ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులు ఆదివారం శ్రీకాకుళం వచ్చి అభిప్రాయాలు, దరఖాస్తులు స్వీకరిం చారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన ఇంది రా విజ్ఞాన్ భవన్‌లో మకాం వేసిన వారు శ్రీకాకుళం పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాల సేకరణ ప్రారంభించారు. అందులో భాగంగా ఆదివారం శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆజాద్ హెచ్ పటేల్, ముజబుల్ హెచ్.భగవాన్, రాజేంద్రలు ఆయా నియోజకవర్గాల నాయకులతో వేర్వేరుగా మాట్లాడారు.
అలాగే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వాలని కోరుతూ శిమ్మ రాజశేఖర్ దరఖాస్తు ఇవ్వగా, తన సతీమణికి ఇవ్వాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్ వినతిపత్రం అందజేశారు. ఆమదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తనకు గానీ, తన కుమారుడికి గానీ సీటు కేటాయించాలని అభ్యర్థించగా, జెజె మోహనరావు ఇదే స్థానం కోరుతూ దరఖాస్తు అందజేశారు. నరసన్నపేట నుంచి డోల జగన్, రెడ్డి జగన్నాథంలు దరఖాస్తు చేసుకోగా, శిమ్మ రాజశేఖర్ సైతం తనకు శ్రీకాకుళం కేటాయించని పక్షంలో నరసన్నపేట అయినా ఇవ్వాలని కోరారు. పార్లమెంటు నియోజకవర్గానికి మాత్రంఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అందరూ కృపారాణినే బలపరిచినట్లు తెలుస్తోంది.
Advertisement