యాచారం, న్యూస్‌లైన్ : ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన అధిష్టానానికి మైనార్టీల తరఫున కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన సభ కొత్త చిచ్చుకు ఆజ్యం పోసింది. యాచారం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ మైనార్టీల కృతజ్ఞత సభ విమర్శలు, వాగ్వాదాలకు వేదికైంది. ఇంతకాలం బద్ధ శత్రువులుగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పీసీసీ కార్యదర్శి రాచర్ల వెంకటేశ్వర్లు ఒకే కారులో రావడం పార్టీ వర్గాలకు విస్తుగొల్పింది. కాగా బ్యానర్‌పై మాజీ హోంమంత్రి, డీసీసీ అధ్యక్షుడి ఫొటోలు లేకపోవడంతో పలువురు మండిపడ్డారు. జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సబితారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ల ఫొటోలు లేకుండా బ్యానర్ ఎలా ఏర్పాటు చేశారని నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్చ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ కార్యదర్శి రాచర్ల కల్పించుకొని బాషాకు నచ్చజెప్పి శాంతింపజేశారు.
ఎండీ గౌస్ సభను ప్రారంభిస్తుండగా చింతపట్ల గ్రామానికి చెందిన మైనార్టీ నాయకుడు లేచి వేదికపై ఇతర మండలాల నాయకులను కూర్చోబెట్టి మండలానికి చెందిన సీనియర్ నాయకులను విస్మరించారని వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కల్పించుకొని నాయకులను, సర్పంచ్‌లను వేదిక పైకి ఆహ్వానించడంతో సభ ప్రారంభమైంది. నిన్నటిదాకా డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వర్గంగా ముద్రపడిన రాచర్ల వెంకటేశ్వర్లు హఠాత్తుగా మల్‌రెడ్డితో కలిసి సభకు రావడంతో ఆయన వర్గానికి చెందిన నాయకులు విస్తుపోయారు. ఇక బ్యానర్‌పై సబిత, క్యామ మల్లేష్‌ల ఫొటోలు లేకపోగా, కనీసం వారి పేర్లు కూడా ప్రస్తావించకుండా నాయకులు ప్రసంగించడం పార్టీ శ్రేణుల్లో చర్చనీ యాంశమైంది. సభ జరుగుతుండగానే కొందరు బ్యానర్‌పై ఫొటోలు లేని విషయాన్ని సబితారెడ్డి, మల్లేష్‌లకు ఫోన్‌చేసి చెప్పారు. నిన్న మొన్నటిదాకా పార్టీలో రెండు వర్గాలుండేవి, ఆదివారం కృతజ్ఞత సభతో మరో వర్గం పుట్టినట్లయిందని పలువురు మాట్లాడుకోవడం కనిపించింది.
కాంగ్రెస్ సభలో వర్గాల చిచ్చు!
Published Mon, Jan 13 2014 12:15 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement