సాక్షి ప్రతినిధి, కర్నూలు: దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే సామెతను తెలుగు తమ్ముళ్లు నిజం చేస్తున్నారు. జయాపజయాలమాటెలా ఉన్నా అధిష్టానం సూచనలతో పార్టీలు మారేవారితో బేరసారాలు ఆడుతున్నారు. ‘మీరు ఇప్పుడు తొందరపడకపోతే వేరొకరు పార్లమెంటు...అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు’ అని తొందరపెడుతున్నారు. ఓ రేట్ కూడా ఫిక్స్ చేస్తున్నారు. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ఒకరిద్దరు నాయకులు ఇప్పటికే ఆ పార్టీ తీర్థం కూడా పుచ్చుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలి ముడుపుల కోసం తమకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన పాపాన్ని మూటగట్టుకున్న అధికార కాంగ్రెస్‌ను జనం ఛీదరించుకుంటున్న విషయం తెలిసిందే. అందుకు మద్దతు తెలియజేసిన టీడీపీపైనా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. జిల్లాలో రెండు పార్టీలపై జనానికి నమ్మకం పోవటంతో ఇరుపార్టీ నేతలు ఎన్నికల గండం నుంచి గట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో ముగ్గురు, కర్నూలు డివిజన్ పరిధిలో ఇద్దరు, ఆదోని డివిజన్ పరిధిలో ఒకరు పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోడదూకే వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కావటం గమనార్హం. వారి చేరిక విషయంపై ఆ పార్టీ ముఖ్యులతో సంప్రదింపులు పూర్తి చేశారు. కర్నూలు అసెంబ్లీ సీటు కోసం టీడీపీకి ఓ కాంగ్రెస్ నేత భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదే విధంగా టీడీపీ నేత ఒకరు కర్నూలు పార్లమెంట్ స్థానం తనకేనని ప్రచారం చేసుకుంటూ ముందుగానే ‘కర్చీఫ్’ వేసుక్కూర్చున్నారు. అలా చేస్తే కొత్త అభ్యర్థి ఎవరైనా పార్లమెంట్ టికెట్ అడిగితే అతని నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకోవచ్చేనే అభిప్రాయంతో ఉన్నట్లు టీడీపీకి చెందిన ఓ వర్గం వెల్లడించింది. అదే విధంగా పాణ్యం అసెంబ్లీ స్థానం కోసం ఓ టీడీపీ నేత, ఇద్దరు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. నంద్యాల పార్లమెంటు, అసెంబ్లీ స్థానం కోసం కాంగ్రెస్, టీడీపీ నేతలు పోటీ చేయటానికి వెనకడుగు వేస్తున్నప్పటికి ఇరు పార్టీలు పోటీ అధికంగా ఉన్నట్లు ప్రచారం చేయిస్తున్నారు. అలా కర్నూలు, పాణ్యం టికెట్లు ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఖరారు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్..: రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీలు అనుకూలమనే విషయం తేలిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్య రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కుట్రలు తారాస్థాయికి చేరుకున్నాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీ నేతల్లో ఒకరి కొసం ఒకరు పనిచేసేందుకు ఎదుటి అభ్యర్థిని డమ్మీని పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు బోగస్ ఓటర్లను కూడా భారీగానే నమోదు చేయించుకున్నట్లు తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అడ్డదారుల్లోనైనా గెలిచేందుకు దారులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. పార్టమెంట్, అసెంబ్లీ స్థానాల్లో ఒకరిని డమ్మీ అభ్యర్థిని పెట్టి, మరొకరు లబ్ది పొందేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.
వారి రూటు.. సపరేటు
Published Wed, Jan 1 2014 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement