హస్తం కస్టడీలో ఎస్టీ పనులు!
Published Thu, Feb 13 2014 1:41 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రాష్ట్రాన్ని విభజిస్తున్నారన్న ఆవేదన తో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న వైఎస్సార్‌సీపీ లో సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయం రుచించలేదు. వైఎస్సార్‌సీపీలో చేరిన దగ్గరి నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తి డి తెచ్చి ఎమ్మెల్యే మంజూరు చేయించుకున్న కోట్లాది రూపాయల పనుల్ని జరగకుండా కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డుకుం టున్నారు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని దళారులుగా అవతారమెత్తి ఆ పనుల్ని వేలం పాట ద్వారా అమ్ముకుంటున్నారు.
తాము చెప్పినట్టే నడుచుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు హుకుం జారీ చేస్తున్నా రు. అధికారులు కూడా వారి మాట జవదాటకుండా నేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారు. దీంతో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర దశల వారీగా సాలూరు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు. సీఎం ప్రత్యేక నిధి నుంచే ఒకసారి రూ.75 లక్షలు, మరోసారి రూ.2.75 కోట్లు, తాజాగా రూ.2 కోట్లు మంజూరు చేయించుకున్నారు. అయితే, మొదటి, రెండో విడతగా మంజూరైన నిధుల్లో సగానికిపైగా పనులు చేపట్టారు.
వాటిలో దాదాపు 25 శాతం నిధులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇప్పుడా పనుల్ని చేపట్టాల్సి ఉంది. కానీ, ఎమ్మెల్యే పార్టీని వీడారన్న అక్కసుతో ఆ పనుల్ని ఎమ్మెల్యే చెప్పిన వారికి కాకుండా కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే కట్టబెట్టాలని అధికారులకు కాంగ్రెస్ కీలక నేతలు హుకుం జారీ చేశారు. దీంతో స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు తాము చెప్పినోళ్లకే పనులు ఇవ్వాలంటూ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అంతేకాకుండా దళారులుగా అవతారమెత్తి ఆ పనుల్ని వేలంపాట ద్వారా పర్సంటేజీల కింద అమ్ముకుంటున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ఈ క్రమంలో పనులు చేతులు మారుతున్నాయి. వాస్తవానికి ఆ పనులు గిరిజన గ్రామ సర్పంచ్‌ల ఆధ్వర్యం లో చేపట్టాల్సి ఉంది. కానీ వారంతా వైఎస్సార్ సీపీలో ఉన్నారన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలే కాంట్రాక్టర్లగా మారిపోతున్నారు.
సర్పంచ్‌లకు అధికారం లేకుండా.
ఇదంతా ఒక ఎత్తు అయితే గత ఏడాది డిసెంబర్ 31న సాలూరు నియోజకవర్గానికి సీఎం ప్రత్యేక నిధి కింద రూ.రెండు కోట్లు విడుదలయ్యాయి. ఎమ్మెల్యే రాజన్నదొర కృషితోనే నిధులు విడుదలైనా వాటిపై కాంగ్రెస్ కీలక నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఆ పనులపై సర్పంచ్‌లకు అధికారం లేకుండా కాంగ్రెస్ నాయకులు సిఫారసు చేసినోళ్లకే కట్టబెట్టాలని ఇంజినీరింగ్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. వారి ఆదేశాలకు భయపడి గ్రామాల్లో సర్పంచ్‌లను కాదని కాంగ్రెస్ నేతలు సూచించిన వారికి పనులు అప్పగిస్తున్నారు. ఈ పనులు ఇవ్వడం వెనుక పెద్ద వ్యాపారమే జరుగుతోంది. పనులు కావాలంటే తమ వద్దకు రావాలని, ఫలానా పర్సంటేజీ ఇస్తే పనులు ఇప్పిస్తామని అంగడి సరుకులా అధికార పార్టీ నేతలు విక్రయాలకు దిగారు. దీంతో గిరిజన సర్పంచ్‌లంతా ఆవేదన చెందుతున్నారు. తమ ఎమ్మెల్యే మంజూరు చేసిన నిధులపై వీరి పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో బీఆర్‌జీఎఫ్, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పనులపై కూడా ఆంక్షలు పెడుతున్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన సర్పంచ్‌ల గ్రామాల్లో గతంలో మంజూరు చేసిన పనుల్ని ప్రారంభించవద్దని, ఎవరైనా ప్రారంభిస్తే బిల్లులు మంజూరు కావని ఖరాఖండిగా చెప్పేయమని ఇంజినీరింగ్ అధికారులకు హకుం జారీ చేశారు.
ట్రైకార్ రుణాల మంజూరులోనూ ...
ఇదంతా ఒక ఎత్తు అయితే ట్రైకార్ రుణాలపై కాంగ్రెస్ నేతల పెత్తనం మరీ ఎక్కువైంది. గిరిజన గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యాన గ్రామసభలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను పక్కనపెట్టి కాంగ్రెస్ నేతలు సిఫారసు చేసిన వారికి రుణాలు మంజూరు చేయడంపై గిరిజన సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల హక్కుల కాలరాసి, అన్యాయం చేస్తున్నారని సర్పంచ్‌లతో సహా ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఐటీడీఏ పీఓను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కలెక్టర్ కాంతిలాల్ దండేకు లేఖ కూడా రాశారు. తమకు అన్యాయం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని, అర్హులైన గిరిజనులకే ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని, సర్పంచ్‌ల ఆధ్వర్యంలోనే పనులు జరగాలని గిరిజన సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే మరో ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అధికార పార్టీ నేతల వైఖరిపై గిరిజనులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని, ఈ విషయాన్ని అధికారులు గ్రహించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని హెచ్చరించారు.
Advertisement