సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బుధవారం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పరిహారం, పునరావసం కల్పించాలని నేతలు కోరారు. తర్వలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తామని, 2019 మార్చికల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.
భేటీ అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ‘పోలవరం కాంట్రాక్టర్ల మార్పు, కమిషన్ల బేరసారాలను మేం పట్టించుకోం. ఎవరి వాటా ఎంత అన్నది తేల్చుకుని, పని మొదలుపెడితే చాలు. ప్రజాధనం వృధా అవడాన్ని ఎవరూ ఆపలేం. ఆంధ్రా ప్రజల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ముందున్న లక్ష్యం. ఈ ప్రభుత్వం వల్లకాకుంటే వచ్చే యూపీఏ ప్రభుత్వ హయాంలోనైనా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.’ అని అన్నారు.
పరిహారం, పునరావాసం అందరికీ అందాలి: కొత్తపల్లి గీత
అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. పోలవరం ముంపు ప్రాంతంలో 9 మండలాలు, 275కి పైగా గ‍్రామాలున్నాయని, నిర్వాసితుల్లో 70శాతంమంది గిరిజన, ఆదివాసీలేనని అన్నారు. పరిహారం, పునరావాసం అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చి సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని ఆమె కోరారు.
11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం: కొణతాల
భూ సేకరణ, పరిహారం ఖర్చులు పూర్తిగా కేంద్రమే భరించాలని తాము కోరినట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. ‘భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రతిపాదనలు అందలేదని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనలు అందిన తర్వాత కేంద్ర కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా 11 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఎలా పూర్తి చేస్తారో వారికే తెలియాలి. కానీ మేం ఆశావాదులం. 11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం. కాంట్రాక్టర్ల మార్పు తదితర సాంకేతికాంశాలతో మాకు సంబంధం లేదు.’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment