kvp ramachandrarao
-
గడ్కరీని కలిసిన ఎంపీ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని బుధవారం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ, అరకు ఎంపీ కొత్తపల్లి గీత తదితరులు కలిశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, పరిహారం, పునరావసం కల్పించాలని నేతలు కోరారు. తర్వలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తామని, 2019 మార్చికల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. భేటీ అనంతరం కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు మాట్లాడుతూ.. ‘పోలవరం కాంట్రాక్టర్ల మార్పు, కమిషన్ల బేరసారాలను మేం పట్టించుకోం. ఎవరి వాటా ఎంత అన్నది తేల్చుకుని, పని మొదలుపెడితే చాలు. ప్రజాధనం వృధా అవడాన్ని ఎవరూ ఆపలేం. ఆంధ్రా ప్రజల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ముందున్న లక్ష్యం. ఈ ప్రభుత్వం వల్లకాకుంటే వచ్చే యూపీఏ ప్రభుత్వ హయాంలోనైనా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.’ అని అన్నారు. పరిహారం, పునరావాసం అందరికీ అందాలి: కొత్తపల్లి గీత అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. పోలవరం ముంపు ప్రాంతంలో 9 మండలాలు, 275కి పైగా గ్రామాలున్నాయని, నిర్వాసితుల్లో 70శాతంమంది గిరిజన, ఆదివాసీలేనని అన్నారు. పరిహారం, పునరావాసం అందరికీ అందాలన్నదే తమ ఉద్దేశమని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి వచ్చి సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నామన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేయాలని ఆమె కోరారు. 11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం: కొణతాల భూ సేకరణ, పరిహారం ఖర్చులు పూర్తిగా కేంద్రమే భరించాలని తాము కోరినట్లు ఉత్తరాంధ్ర చర్చావేదిక అధ్యక్షుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. ‘భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రతిపాదనలు అందలేదని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. ప్రతిపాదనలు అందిన తర్వాత కేంద్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. 2018 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా 11 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఎలా పూర్తి చేస్తారో వారికే తెలియాలి. కానీ మేం ఆశావాదులం. 11 నెలల్లో పూర్తి చేస్తే చాలా సంతోషం. కాంట్రాక్టర్ల మార్పు తదితర సాంకేతికాంశాలతో మాకు సంబంధం లేదు.’ అని అన్నారు. -
బాబు వైఖరి భవిష్యత్తు తరాలకు శాపం: కేవీపీ
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మండిపడ్డారు. చంద్రబాబు స్వార్ద వైఖరి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుందని, ఆయన తీరు భవిష్యత్తు తరాలకు శాపం లాంటిదని ఆయన అన్నారు. సోమవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా భరోసా సభను అధికార బలంతో అడ్డుకునేందుకు చంద్రబాబు యత్నించారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు విష సంస్కృతిని ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో లోపాలను సవరించుకొని పార్లమెంటులో కొత్త చట్టం తెచ్చుకోవడానికి అందరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా చంద్రబాబు తన పార్టీ ఎంపీలు కేంద్రమంత్రులతో కలిసి ముందుకు రావాలని ఆయన కోరారు. -
చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది
-
‘చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చింది’
తిరుపతి : పంచుకుని తినడానికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రజా బ్యాలెట్ కార్యక్రమంలో భాగంగా బుధవారమిక్కడ మాట్లాడుతూ... ప్యాకేజీ వల్ల మంత్రులు, నారా లోకేవ్ వేలకోట్లు అక్రమంగా ఆర్జించడానికి కుట్ర జరిగిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా టీడీపీ, బీజేపీ అడ్డుకున్నాయని వారు విమర్శించారు. చంద్రబాబుకు మతిమరుపు జబ్బు వచ్చిందని, ఇందుకే రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం నిర్మించాల్సి ఉన్నా, కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు సర్కార్ స్వీకరించిందని మండిపడ్డారు. -
ప్రజల గుండెల నుంచి తొలగించలేవు:కేవీపీ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటు నుంచి తొలగించిన సీఎం చంద్రబాబు కోట్లాది ప్రజల హృదయాల్లో నుంచి ఆయన్ను తొలగించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. సీఎం తన చౌకబారు పనులను మానుకుని వెంటనే విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూం సెంటర్లో పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని ఆంధ్రరత్నభవన్లో పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అనువుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపకల్పన చేసినా, ఆపదలో ఉన్న వారికి సత్వర వైద్య సాయం అందేలా ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్ సేవలు ప్రారంభించినా, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినా.. వైఎస్‌ను ప్రజల గుండెల్లో నుంచి తీసి వేయలేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు. మైనారిటీలకు విద్య, వైద్యరంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్య అందించిన రాజశేఖరరెడ్డి ప్రజల మదిలో చిరకాలం ఉంటారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తును పొందుతున్న కోట్లాది రైతుల హృదయాల్లోంచి వైఎస్‌ను చంద్రబాబుతో సహా ఎవ్వరూ తొలగించలేరన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోగాలం దాపురించినపుడు ఎవరైనా కనరు, వినరని... ఐదు లక్షల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు అహంకార ధోరణికి ఇది అద్దంపడుతోందని విమర్శించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా చంద్రబాబు గుండెల్లో నిద్రపోయి ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారన్నారు. గోదావరి నది నీళ్లను పట్టిసీమ ద్వారా కష్ణా నదికి తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి పోలవరం కుడికాలువ నిర్మించకపోతే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకు ఎలా వచ్చేవో సమాధానం చెప్పాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా రాజశేఖరరెడ్డి చలవేనని అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణాలో ఎలా కలిశాయో పోలవరం కుడి కాల్వ వెంట ఉన్న ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రపంచంలో ఎవ్వరూ మోసం చేయలేరని, ఆయన ఎవ్వరినీ నమ్మరు కాబట్టే ఇది సాధ్యమన్నారు. ఎవరైనా మరొకరిని నమ్మితేనే మోసగించగలరని అన్నారు. చంద్రబాబు నమ్మిన వారినందరినీ మోసం చేశారని చెప్పారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని, తోడల్లుడికి ఉపముఖ్యమంత్రి పదవి అంటూ మోసం చేశారని చెప్పారు. బావమరిదిని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసి ఆ తరువాత ఎన్నికలు జరగకుండా అడ్డుకుని ఆరు నెలల్లోనే ఇంటికి పంపించారని అన్నారు. బావమరిదికి నువ్వే కాబోయే పార్టీ అధ్యక్షుడివి, బీ ఫారంలు వచ్చే ఎన్నికల్లో నీ చేత్తోనే ఇస్తావని చెప్పి చివరకు మోసం చేశారని వివరించారు. -
'జైట్లీపై నాకు గౌరవం పోయింది'
న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాపై తాను తీసుకొచ్చిన ప్రైవేట్ బిల్లును వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. తాను ఈ బిల్లుపై పూర్తి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని స్పీకర్ చెప్పడంతో 'ఈ బిల్లు తీసుకొచ్చిందే నేను. నాకు ఐదు నిమిషాల సమయం ఎలా ఇస్తారు' అంటూ కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల వరకు తనకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటే చాలా గౌరవం ఉండేదని ఆయన ఎప్పుడైతే ప్రత్యేక హోదా బిల్లును ద్రవ్య బిల్లు అన్నారో అప్పుడే తనకు ఆయనపై గౌరవం పోయిందని చెప్పారు. రాజ్యసభను జైట్లీ అపహాస్యం చేశారని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక ఒకలా ప్రవర్తించకూడదని చెప్పారు. ద్రవ్యబిల్లు అని చెబుతూ రాజ్యసభను ఆయన అవమానించారని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు నాటి ఏపీ ఎంపీలు ఎవరూ మద్దతు ఇవ్వలేదని, అయినప్పటికీ విభజన చేశారని, ఆ విభజనకు ఎన్డీయే కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ సందర్భంలో ఇచ్చిన హామీలు అన్ని కూడా అటు యూపీఏ, ఎన్డీయే సమక్షంలోనే జరిగాయని ఇరువురు ఒప్పుకున్నాకే ఇచ్చారని చెప్పారు. అలాంటిది ఏడాది సమయం వృధా చేసి ఆ బిల్లును మనీ బిల్లు అని అంటారా.. ఇది ముమ్మాటికి కుట్రపూరితంగా చేసిన ప్రకటనే అని కేవీపీ అన్నారు. 'ధర్మోరక్షతి రక్షితహ' అనే శ్లోకంతో ప్రసంగం ప్రారంభించిన కేవీపీ తన బిల్లుపై ఎప్పుడు ఓటింగ్ పెడతారని స్పీకర్ ను ప్రశ్నించారు. -
రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులకు ఆ పార్టీ బుధవారం విప్ జారీ చేసింది. శుక్రవారం వరకూ సభకు కచ్చితంగా హాజరుకావాలని పార్టీ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రయివేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు శుక్రవారం రాజ్యసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్ జారీ చేస్తూ...కేవీపీ రామచంద్రరావు ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలపాలని ఆదేశించింది. రాజ్యసభ చీఫ్ విప్ చతుర్వేది ఈ మేరకు విప్ జారీ చేశారు.