ప్రజల గుండెల నుంచి తొలగించలేవు:కేవీపీ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించిన చోటు నుంచి తొలగించిన సీఎం చంద్రబాబు కోట్లాది ప్రజల హృదయాల్లో నుంచి ఆయన్ను తొలగించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. సీఎం తన చౌకబారు పనులను మానుకుని వెంటనే విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూం సెంటర్‌లో పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
శనివారం నగరంలోని ఆంధ్రరత్నభవన్‌లో పార్టీ నేతలు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ, దేవినేని అవినాష్ తదితరులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు అనువుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని రూపకల్పన చేసినా, ఆపదలో ఉన్న వారికి సత్వర వైద్య సాయం అందేలా ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్ సేవలు ప్రారంభించినా, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినా.. వైఎస్‌ను ప్రజల గుండెల్లో నుంచి తీసి వేయలేరనే విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
మైనారిటీలకు విద్య, వైద్యరంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పేదలకు ఉన్నత విద్య అందించిన రాజశేఖరరెడ్డి ప్రజల మదిలో చిరకాలం ఉంటారని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్తును పొందుతున్న కోట్లాది రైతుల హృదయాల్లోంచి వైఎస్‌ను చంద్రబాబుతో సహా ఎవ్వరూ తొలగించలేరన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పోగాలం దాపురించినపుడు ఎవరైనా కనరు, వినరని... ఐదు లక్షల మెజారిటీతో అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు అహంకార ధోరణికి ఇది అద్దంపడుతోందని విమర్శించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించినా చంద్రబాబు గుండెల్లో నిద్రపోయి ఆయనకు బుద్ధి వచ్చేలా చేస్తారన్నారు. గోదావరి నది నీళ్లను పట్టిసీమ ద్వారా కష్ణా నదికి తీసుకొచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖరరెడ్డి పోలవరం కుడికాలువ నిర్మించకపోతే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకు ఎలా వచ్చేవో సమాధానం చెప్పాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా రాజశేఖరరెడ్డి చలవేనని అన్నారు. గోదావరి నీళ్లు కృష్ణాలో ఎలా కలిశాయో పోలవరం కుడి కాల్వ వెంట ఉన్న ప్రజలందరికీ తెలుసని స్పష్టం చేశారు.
చంద్రబాబును ప్రపంచంలో ఎవ్వరూ మోసం చేయలేరని, ఆయన ఎవ్వరినీ నమ్మరు కాబట్టే ఇది సాధ్యమన్నారు. ఎవరైనా మరొకరిని నమ్మితేనే మోసగించగలరని అన్నారు. చంద్రబాబు నమ్మిన వారినందరినీ మోసం చేశారని చెప్పారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని, తోడల్లుడికి ఉపముఖ్యమంత్రి పదవి అంటూ మోసం చేశారని చెప్పారు. బావమరిదిని ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసి ఆ తరువాత ఎన్నికలు జరగకుండా అడ్డుకుని ఆరు నెలల్లోనే ఇంటికి పంపించారని అన్నారు. బావమరిదికి నువ్వే కాబోయే పార్టీ అధ్యక్షుడివి, బీ ఫారంలు వచ్చే ఎన్నికల్లో నీ చేత్తోనే ఇస్తావని చెప్పి చివరకు మోసం చేశారని వివరించారు.