'జైట్లీపై నాకు గౌరవం పోయింది'
న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాపై తాను తీసుకొచ్చిన ప్రైవేట్ బిల్లును వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. తాను ఈ బిల్లుపై పూర్తి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడాలని స్పీకర్ చెప్పడంతో 'ఈ బిల్లు తీసుకొచ్చిందే నేను. నాకు ఐదు నిమిషాల సమయం ఎలా ఇస్తారు' అంటూ కేవీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల వరకు తనకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంటే చాలా గౌరవం ఉండేదని ఆయన ఎప్పుడైతే ప్రత్యేక హోదా బిల్లును ద్రవ్య బిల్లు అన్నారో అప్పుడే తనకు ఆయనపై గౌరవం పోయిందని చెప్పారు.
రాజ్యసభను జైట్లీ అపహాస్యం చేశారని చెప్పారు. అధికారంలోకి రాకముందు ఒకలా వచ్చాక ఒకలా ప్రవర్తించకూడదని చెప్పారు. ద్రవ్యబిల్లు అని చెబుతూ రాజ్యసభను ఆయన అవమానించారని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనకు నాటి ఏపీ ఎంపీలు ఎవరూ మద్దతు ఇవ్వలేదని, అయినప్పటికీ విభజన చేశారని, ఆ విభజనకు ఎన్డీయే కూడా మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఆ సందర్భంలో ఇచ్చిన హామీలు అన్ని కూడా అటు యూపీఏ, ఎన్డీయే సమక్షంలోనే జరిగాయని ఇరువురు ఒప్పుకున్నాకే ఇచ్చారని చెప్పారు. అలాంటిది ఏడాది సమయం వృధా చేసి ఆ బిల్లును మనీ బిల్లు అని అంటారా.. ఇది ముమ్మాటికి కుట్రపూరితంగా చేసిన ప్రకటనే అని కేవీపీ అన్నారు. 'ధర్మోరక్షతి రక్షితహ' అనే శ్లోకంతో ప్రసంగం ప్రారంభించిన కేవీపీ తన బిల్లుపై ఎప్పుడు ఓటింగ్ పెడతారని స్పీకర్ ను ప్రశ్నించారు.