‘చేతు’లు కాలాక..! | Congress party is prepared to review the situation | Sakshi

‘చేతు’లు కాలాక..!

Published Sat, Aug 2 2014 2:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘చేతు’లు కాలాక..! - Sakshi

‘చేతు’లు కాలాక..!

- పార్టీ పరిస్థితిపై సమీక్షకు కాంగ్రెస్ సిద్ధం
- ప్రభుత్వంపై పోరాటంలోనూ వెనుకంజ
- ఓటమి భారం నుంచి ఇంకా తేరుకోని పార్టీ
- సమావేశంపై నేతలు, కార్యకర్తల్లో అనాసక్తి
- నేడు పీసీసీ చీఫ్ సమక్షంలో సమావేశం

శ్రీకాకుళం: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాజయంతో అధికార పార్టీ స్థాయి నుంచి సున్నా స్థాయికి పడిపోయిన ఆ పార్టీకి ఓటమిపై సమీక్షతోపాటు కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యలపై గొంతెత్తడానికి రెండు నెలల తర్వాత గానీ తీరికి చిక్కలేదు. ఓటమి షాక్ నుంచి తేరుకోకపోవడమూ దీనికి కారణం. ఆలస్యంగానైనా పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో శనివారం శ్రీకాకుళం నిర్వహించనున్న పార్టీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశంపై నాయకులు, కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఓటమి కారణాలను సమీక్షించడంతో పాటు పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా మండల, గ్రామస్థాయి కమిటీలను పునరుద్ధరించడం సమావేశం ప్రధాన ఎజెండా. అలాగే ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడటంం, మేనిఫెస్టోలోని హామీల అమలులో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టడం, రాజధాని ఎంపికలో ఎడతెగని జాప్యంపై ప్రశ్నించడం వంటి అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు. అయితే ఇప్పట్లో పార్టీని పునరుజ్జీవింపజేయడం కష్టమని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
 
పోరాట బాటలోనూ వెనుకంజ...

ఓటమిని ముందే గ్రహించిన కాంగ్రెస్ నేత లు ఎన్నికలకు ముందు టీడీపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందున ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీపై మొదటి సంతకం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పటివరకు మాఫీ అమలుపై స్పష్టత ఇవ్వకపోయినా కాంగ్రెస్ నేతలు నోరు విప్పడం లేదు.

ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి ప్రజల పక్షాన ఉండి ప్రజలతో కలిసి పోరాట బాట పట్టడమే కాకుండా ఇటీవల నరకాసుర వధ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించగలిగింది. కానీ నిన్నటివరకు అధికారం వెలగబెట్టిన  కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ ప్రజల్లోకి రాలేకపోతోంది. అలాగే చెన్నైలో గత నెలల్లో జరిగిన రెండు దుర్ఘటనల్లో మృతి చెందిన వారిని కాంగ్రెస్ నాయకులు కనీసం పరామర్శించలేకపోయారు.
 
కార్యకర్తలు ‘చే’జారకుండాఉండేందుకేనా..
ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ కార్యకర్తలు పూర్తిగా మానసిక స్థైర్యాన్ని కోల్పోయారు. చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఉన్న కార్యకర్తలనైనా కాపాడుకునేందుకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈ సమీక్ష సమావేశం పెట్టినట్లు కనిపిస్తోంది. ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉండి కూడా జిల్లాను అభివృద్థి పథంలో నడపలేకపోయారు. అధికారం ఉన్నప్పుడే ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ప్రజలకు అండగా ఎలా నిలుస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement