
ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడదు:శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఇతర పార్టీలపై కాంగ్రెస్ ఆధారపడదని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ తో పొత్తు గానీ, విలీనం గానీ ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఆశించలేదన్నారు. ఇతర పార్టీలపై ఆధారపడే అవసరం కాంగ్రెస్ కు ఎప్పుడూ ఉండదన్నారు. జానారెడ్డి నివాసంలో సుదర్శన్ రెడ్డి, శ్రీధర్ బాబు, షబ్బీర్ ఆలీలు మంగళవారం సమావేశమైయ్యారు. అనంతరం టీఆర్ఎస్ పొత్తు, విలీనం చర్చలకు సంబంధించి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీదేనని తెలిపారు. ఉద్యమ స్పూర్తితో పాటు కాంగ్రెస్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు.
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను పిట్టల దొరగా అభివర్ణించారు. ఆయన ఏనాడు నిజాలు చెప్పలేదన్నారు. విలీనం కుదరదన్న తమకు టీఆర్ఎస్ తో పొత్తు కూడా అవసరం లేదన్నారు. విలీన అంశంపై హైకమాండ్ కు, కేసీఆర్ కు మధ్య జరిగిన సంభాషణను అవసరమొచ్చినప్పుడు బయటపెడతామన్నారు.