కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందంతోనే విభజన
Published Sun, Aug 18 2013 5:34 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
పొదలకూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చీకటి ఒప్పందంతోనే తెలంగాణ విభజన ప్రక్రియ ప్రారంభమైందని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముందుగానే తెలంగాణ విభజన గురించి స్పష్టంగా తెలుసన్నారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ ఏ హక్కుతో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని కాకాణి ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా 57 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను తెలంగాణకు కేటాయించడం దుర్మార్గమన్నారు.
ఆంధ్రావాళ్లు హైదరాబాద్‌లో ఉండేందుకు తెలంగాణ ప్రాంత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎవరి జాగీరో అర్థం కావడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధాటికి తట్టుకోలేక సోనియాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నట్టు ఆరోపించారు. తెలంగాణ విభజనకు వైఎస్సార్ హయాంలో అంకుర్పాణ జరిగిందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించడాన్ని కాకాణి తిప్పికొట్టారు. 2004కు ముందు టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న సమయంలో వైఎస్సార్ రెండో ఎస్సార్సీ ప్రకారం విభజన ఉంటుందని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు.
తాను రాజీనామా చేయనని మంత్రి ఆనం ప్రకటించడం చూస్తే ఆయనకు పదవిపై ఎంతటి వ్యామోహమో అర్థం అవుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదాల ఇచ్చిన రాజీనామా స్పీకర్‌కు చేరిందో లేదోనని సందేహం వ్యక్తం చేశారు. 19వ తేదీ నుంచి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు జిల్లాలోని సమైక్యవాదులంతా మద్దతు తెలపాల్సిందిగా కాకాణి కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరడం పరిశీలిస్తే సమైక్యవాదంపై ఆయన మాటల్లోని డొల్లతనం స్పష్టమవుతోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోనం బ్రహ్మయ్య, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ పాల్గొన్నారు.
Advertisement