separation process
-
స్పష్టతలేని విభజన..ఏ జిల్లాకు వెళ్లాలో!.. ఆందోళనలో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ నేడు కీలక దశకు చేరుకోనుంది. ఉద్యోగులకు జిల్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ జిల్లాకు తమను కేటాయిస్తారోననే ఆందోళనలో వారున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 5 వేల ప్రధానోపాధ్యాయులు మినహా 1.04 లక్షల మంది టీచర్లు జిల్లా కేడర్ కిందకే వస్తారు. సీనియారిటీకి కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాళ్ల డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సీనియర్లు కోరుకున్న ప్రాంతానికి, జూనియర్లు ఇష్టం లేకున్నా కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడే అనేక సందేహాలు తెరమీదకొస్తున్నాయి. విద్యాశాఖ ఇప్పటివరకూ సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. టీచర్లను జిల్లాకు కేటాయించినా ఆ జిల్లాలో వాళ్లను ఏ స్కూలుకు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? విద్యా సంవత్సరం మధ్యలో ఇది సాధ్యమా? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. టీచర్లను విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ చేస్తే బోధన కుంటుపడొచ్చన్న వాదన విన్పిస్తోంది. జటిలమైన సమస్య... రాష్ట్రంలోని 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఉద్యోగుల విభజన తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే విభజన అంశమే పెద్ద ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. 1975లో లోకల్ క్యాడరైజేషన్ చేసిన తర్వాత ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల్లో కొనసాగించారని, 2006లో కొందరు స్థానికేతరులను వారి జిల్లాలకు తరలించారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తే బాగుండేదని, ఇతర జిల్లాలకు వెళ్లలనుకొనే వారిని పంపితే సరిపోయేదని అభిప్రాయపడుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకురావడం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొందని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ సమస్య ఇంత జటిలం కాకుండా ఉండేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టకుండా జూనియర్ టీచర్లను వేరే జిల్లాలకు పంపడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం వల్ల స్థానికేతర జిల్లాల వాళ్లు పట్టణ ప్రాంతాలకు వస్తారని, స్థానికులు మాత్రం సీనియారిటీ లేకపోవడం వల్ల సొంత ప్రాంతానికి, కుటుంబ బాంధవ్యాలకు దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. కొన్ని వర్గాలకు అన్యాయం సీనియారిటీ వల్ల ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మారుమూల ఏజెన్సీ జిల్లాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని, వారు ఇప్పట్లో రిటైరవరు కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వేరే జిల్లాల్లో స్థానికేతరులుగా వాళ్లు పోటీ పరీక్షలు రాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలందరినీ ఏకం చేస్తామన్న ప్రభుత్వ హామీలు కాలగర్భం కలిసే వీలుందనే వాదన విన్పిస్తోంది. ఈ కేటాయింపులకు ముందే 258 ఉత్తర్వు ద్వారా లోకల్ క్యాడరైజేషన్‌లో భాగంగా జిల్లా స్థాయి పోస్టుగా పేర్కొన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టునైనా జోనల్ పోస్టుగా మారిస్తే ఏదో ఒకరోజు తాము సొంత జిల్లాకు వస్తామనే ఆశ ఉండేదని అభిప్రయపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ను జోనల్ పోస్టుగా చూపించిన అధికారులకు స్కూల్ అసిస్టెంట్పట్ల ఎందుకు కనికరం లేదో అర్థం కావడం లేదని వరంగల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించారు. స్థానికత స్ఫూర్తికి విరుద్ధం స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలనే స్ఫూర్తితో కొత్త జోనల్ విధానాన్ని తీసుకుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో ఈ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటోంది. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని స్థానికతను పట్టించుకోకపోవడంతో పలు శాఖల్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రక్రియతో చాలా జిల్లాల్లో కొత్త నియామకాలు జరిగే పరిస్థితి ఉండదు. మరోవైపు ఆన్లైన్లో చేపట్టాల్సిన ఆప్షన్ల ప్రక్రియను మాన్యువల్ పద్ధతిలో చేపట్టడంతో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయి. పరపతిని ఉపయోగించుకొని కొందరు ఇష్టానుసారంగా జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను సవరిస్తేనే ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. – చలగాని సంపత్‌కుమార్ స్వామి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్పష్టత ఏదీ? ఈ రోజైతే జిల్లా కేటాయింపు ఆర్డర్లు ఇస్తారు. కానీ టీచర్లు ఏ స్కూల్లో పనిచేయాలనేది డీఈవోలు నిర్ణయించాలి. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మార్గదర్శకాలూ ఇవ్వలేదు. టీచర్‌ను బదిలీ చేశారు కాబట్టి పాత స్కూల్లో ఉండే వీల్లేదు. కొత్త స్కూలుకు వెళ్లాలంటే సమయం పడుతుంది. విద్యాసంవత్సరం మధ్యలో ఈ పరిణామంతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది.– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
రాజకీయ స్వార్థం కోసమే విభజన ప్రక్రియ
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి వర్ధన్నపేట : రాజకీయ స్వార్ధం కోసం సీఎం కేసీఆర్ జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపిం చారు. స్థానిక ఆర్‌ఆండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనను బీజేపీ స్వాగతిస్తుందన్నారు. కొన్ని జిల్లాల ఏర్పాటులో ప్రజల అభీ ష్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ ముందుకెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయుల కాలం నుంచి వరంగల్, హన్మకొండ నగరాలకు విడదీయరాని బంధం ఉందన్నారు. వీటిని విడదీసి ఈ ప్రాంత వైభవాన్ని కోల్పోయేలా వ్యవహరిస్తున్నారని దు య్యబట్టారు. హన్మకొండ జిల్లా చేయవద్దని అఖిల పక్ష సమావేశంలో తాము డిమాండ్ చేశామని గుర్తుచేశారు. ప్రభుత్వ వైఖ రికి నిరసనగా ఈ నెల 30న జిల్లా బంద్‌కు పిలుపునచ్చినట్లు ప్రకటించా రు. సెప్టెంబర్ 17న వరంగల్‌లో తిరంగ్యాత్ర చేపడుతున్నట్లు వెల్లడిం చారు. కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వరంగల్‌కు వస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జడ సతీష్, జిల్లా కార్యదర్శి యాకయ్య, ప్రధాన కార్యదర్శి దిండు కిషన్, రాయపురం కుమారస్వామి, గుజ్జ ప్రవీణ్, చిర్ర కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
వేగవంతమైన విభజన ప్రక్రియ
రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైంది. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకునే పరిస్థితులలో కేంద్రం లేదు. తను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లన్నట్లు కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మెత్తబడిపోయారు. రాష్ట్ర విభజన ఆపడానికి ఇంకా చాలా దారులు ఉన్నాయని ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు చెబుతున్నారు. కొందరైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందని బహిరంగంగానే స్సష్టం చేస్తున్నారు. ఇంకా విభజన ఆపవచ్చని ప్రజలను మోసం చేయడం తనకు ఇష్టంలేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి తలవంచడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి బాలరాజు గతంలోనే చెప్పారు. కేంద్ర మంత్రులు పలువురు రాజీపడిపోయారు. కొందరు ప్యాకేజీలు అడుగుదామన్న ఆలోచనలో ఉన్నారు. వీరంతా వెనక్కు తగ్గిన నేపథ్యంలో కేంద్ర హొం శాఖ విభజన ప్రక్రియ విషయంలో దూసుకుపోతోంది. దీనికి తోడు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి. 17 అంశాలకు సంబంధించి 24 గంటల్లో సమాచారం పంపాలని కేంద్ర హొం శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నెల 19న మంత్రుల బృందం(జిఓఎం) రెండవసారి సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం తెలంగాణలోని పది జిల్లాల సమాచారం మాత్రమే హొం శాఖ కోరింది. విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచించింది. రాష్ట్ర విభజనకు సంబంధిం కేంద్ర మంత్రిత్వ శాఖలు సంబంధిత సమాచారం పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఈ నెల 11న లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయవలసి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం 17వ తేదీలోపు సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రతి శాఖ ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలను ఆదేశించించారు. సంబంధిత రంగం ఏయే ప్రాంతాల్లో ఎలా విస్తరించి ఉంది, ఇరు ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల వివరాలు, ఉద్యోగుల సమాచారంతో కూడిన స్పష్టమైన వివరాలను అందించాలని ఆదేశించారు. 19న జరిగే మంత్రుల బృందం సమావేశంలో సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి చర్చించే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు చర్చలు జరుపుతారని తెలుస్తోంది. రాష్ట్ర సచివాలయంలో కూడా ఈ ప్రక్రియ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని రాష్ట్ర పునర్విభజన (ఎస్ఆర్) విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. సచివాలయంలోని ‘బి’ బ్లాక్ ఆరో అంతస్తులో ఎస్ఆర్ విభాగం ఉంది. ఇందులో ప్రస్తుతం ఒక ఎస్ఓ, ఒక ఏఎస్ఓ మాత్రమే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ విభాగం ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎస్ఆర్ విభాగం ద్వారానే రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సమాచారమంతా కేంద్రానికి చేరుతుంది. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఎస్ఆర్ విభాగం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తుంది. ఇందుకోసం ఎస్ఆర్ విభాగంలో సాగునీరు, ఆర్థిక, సర్వీసులు, విద్యుత్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రణాళికా విభాగం సహా రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అదనపు కార్యదర్శులు లేదా సంయుక్త కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఆ అధికారులు ‘విభజన’కు అవసరమైన సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తారు. ఆ కమిటీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ విభాగంతోనే జరుపుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ జిల్లాల వారీగా ఆదాయ వివరాలు, ఆస్తులు, అప్పులు, వడ్డీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) జిల్లాల వారీగా సమకూర్చుకుంటుంది. జిల్లాల వారీగా విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా, బొగ్గు, గ్యాస్ లభ్యత తదితర సమాచారాన్ని ఇంధన శాఖ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను కూడా అందజేస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల కేటాయింపు తదితర వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రణాళికా సంఘానికి పూర్తి సమాచారం ఉంది. మొత్తంగా ‘ఎస్ఆర్’ విభాగం నుంచి అందే సమాచారం ఆధారంగా కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర విభజన, ఆస్తులు, ఆదాయ వనరులు, ఉద్యోగులు, అప్పుల పంపిణీకి ఒక ప్రాతిపదికను రూపొందిస్తుంది. ఆ ప్రాతిపదికను కేంద్రమే అమలు చేస్తుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపధ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆపడం సాధ్యం కాదని అర్ధమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. యువనేత జగన్ ఒక్కరే సమైక్యతకు కట్టుబడి ఉద్యమిస్తున్నారు. సిపిఎం, ఎంఐఎం రెండు పార్టీలు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు నిజాయితీగా జగన్ పిలుపుకు స్పందించి ముందుకు వస్తే విభజనను ఆపడం సాధ్యమవుతుంది. -
కాంగ్రెస్, టీడీపీ చీకటి ఒప్పందంతోనే విభజన
పొదలకూరు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల చీకటి ఒప్పందంతోనే తెలంగాణ విభజన ప్రక్రియ ప్రారంభమైందని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముందుగానే తెలంగాణ విభజన గురించి స్పష్టంగా తెలుసన్నారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని మండిపడ్డారు. సీడబ్ల్యూసీ ఏ హక్కుతో రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుందని కాకాణి ప్రశ్నించారు. ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా 57 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్‌ను తెలంగాణకు కేటాయించడం దుర్మార్గమన్నారు. ఆంధ్రావాళ్లు హైదరాబాద్‌లో ఉండేందుకు తెలంగాణ ప్రాంత నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎవరి జాగీరో అర్థం కావడం లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్‌ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాటికి తట్టుకోలేక సోనియాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నట్టు ఆరోపించారు. తెలంగాణ విభజనకు వైఎస్సార్ హయాంలో అంకుర్పాణ జరిగిందని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించడాన్ని కాకాణి తిప్పికొట్టారు. 2004కు ముందు టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న సమయంలో వైఎస్సార్ రెండో ఎస్సార్సీ ప్రకారం విభజన ఉంటుందని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఒక డ్రామాగా ఆయన అభివర్ణించారు. తాను రాజీనామా చేయనని మంత్రి ఆనం ప్రకటించడం చూస్తే ఆయనకు పదవిపై ఎంతటి వ్యామోహమో అర్థం అవుతుందన్నారు. ఎమ్మెల్యే ఆదాల ఇచ్చిన రాజీనామా స్పీకర్‌కు చేరిందో లేదోనని సందేహం వ్యక్తం చేశారు. 19వ తేదీ నుంచి వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు జిల్లాలోని సమైక్యవాదులంతా మద్దతు తెలపాల్సిందిగా కాకాణి కోరారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరడం పరిశీలిస్తే సమైక్యవాదంపై ఆయన మాటల్లోని డొల్లతనం స్పష్టమవుతోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోనం బ్రహ్మయ్య, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ పాల్గొన్నారు.