హైదరాబాద్‌లోని బీఆర్‌కేఆర్ భవన్‌లో ఉద్యోగుల విభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ నేడు కీలక దశకు చేరుకోనుంది. ఉద్యోగులకు జిల్లాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ జిల్లాకు తమను కేటాయిస్తారోననే ఆందోళనలో వారున్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉన్న 5 వేల ప్రధానోపాధ్యాయులు మినహా 1.04 లక్షల మంది టీచర్లు జిల్లా కేడర్ కిందకే వస్తారు. సీనియారిటీకి కాకుండా స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వాళ్ల డిమాండ్‌ను ఎవరూ పట్టించుకోలేదు.
దీంతో సీనియర్లు కోరుకున్న ప్రాంతానికి, జూనియర్లు ఇష్టం లేకున్నా కేటాయించిన ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడే అనేక సందేహాలు తెరమీదకొస్తున్నాయి. విద్యాశాఖ ఇప్పటివరకూ సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. టీచర్లను జిల్లాకు కేటాయించినా ఆ జిల్లాలో వాళ్లను ఏ స్కూలుకు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? ఈ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? విద్యా సంవత్సరం మధ్యలో ఇది సాధ్యమా? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టత లేదు. టీచర్లను విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ చేస్తే బోధన కుంటుపడొచ్చన్న వాదన విన్పిస్తోంది.
జటిలమైన సమస్య...
రాష్ట్రంలోని 33 జిల్లాలను ఏడు జోన్లుగా, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఉద్యోగుల విభజన తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే విభజన అంశమే పెద్ద ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. 1975లో లోకల్ క్యాడరైజేషన్ చేసిన తర్వాత ఉద్యోగులను పనిచేస్తున్న స్థానాల్లో కొనసాగించారని, 2006లో కొందరు స్థానికేతరులను వారి జిల్లాలకు తరలించారని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తే బాగుండేదని, ఇతర జిల్లాలకు వెళ్లలనుకొనే వారిని పంపితే సరిపోయేదని అభిప్రాయపడుతున్నాయి. కానీ అందుకు విరుద్ధంగా సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకురావడం వల్ల అందరిలోనూ గందరగోళం నెలకొందని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి ఉంటే ఈ సమస్య ఇంత జటిలం కాకుండా ఉండేదని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కనీసం కౌన్సెలింగ్ కూడా చేపట్టకుండా జూనియర్ టీచర్లను వేరే జిల్లాలకు పంపడాన్ని అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానం వల్ల స్థానికేతర జిల్లాల వాళ్లు పట్టణ ప్రాంతాలకు వస్తారని, స్థానికులు మాత్రం సీనియారిటీ లేకపోవడం వల్ల సొంత ప్రాంతానికి, కుటుంబ బాంధవ్యాలకు దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు.
కొన్ని వర్గాలకు అన్యాయం
సీనియారిటీ వల్ల ఉపాధ్యాయుల్లో ఎక్కువ మంది మారుమూల ఏజెన్సీ జిల్లాలకు వెళ్లే పరిస్థితి నెలకొందని, వారు ఇప్పట్లో రిటైరవరు కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. వేరే జిల్లాల్లో స్థానికేతరులుగా వాళ్లు పోటీ పరీక్షలు రాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలందరినీ ఏకం చేస్తామన్న ప్రభుత్వ హామీలు కాలగర్భం కలిసే వీలుందనే వాదన విన్పిస్తోంది. ఈ కేటాయింపులకు ముందే 258 ఉత్తర్వు ద్వారా లోకల్ క్యాడరైజేషన్‌లో భాగంగా జిల్లా స్థాయి పోస్టుగా పేర్కొన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టునైనా జోనల్ పోస్టుగా మారిస్తే ఏదో ఒకరోజు తాము సొంత జిల్లాకు వస్తామనే ఆశ ఉండేదని అభిప్రయపడుతున్నారు. హెడ్ కానిస్టేబుల్‌ను జోనల్ పోస్టుగా చూపించిన అధికారులకు స్కూల్ అసిస్టెంట్‌పట్ల ఎందుకు కనికరం లేదో అర్థం కావడం లేదని వరంగల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు వ్యాఖ్యానించారు.
స్థానికత స్ఫూర్తికి విరుద్ధం
స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలనే స్ఫూర్తితో కొత్త జోనల్ విధానాన్ని తీసుకుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో ఈ స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటోంది. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకొని స్థానికతను పట్టించుకోకపోవడంతో పలు శాఖల్లో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ప్రక్రియతో చాలా జిల్లాల్లో కొత్త నియామకాలు జరిగే పరిస్థితి ఉండదు. మరోవైపు ఆన్‌లైన్‌లో చేపట్టాల్సిన ఆప్షన్ల ప్రక్రియను మాన్యువల్ పద్ధతిలో చేపట్టడంతో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయి. పరపతిని ఉపయోగించుకొని కొందరు ఇష్టానుసారంగా జిల్లాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ అక్రమాలను సవరిస్తేనే ఉద్యోగులకు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది.
– చలగాని సంపత్‌కుమార్ స్వామి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
స్పష్టత ఏదీ?
ఈ రోజైతే జిల్లా కేటాయింపు ఆర్డర్లు ఇస్తారు. కానీ టీచర్లు ఏ స్కూల్లో పనిచేయాలనేది డీఈవోలు నిర్ణయించాలి. దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మార్గదర్శకాలూ ఇవ్వలేదు. టీచర్‌ను బదిలీ చేశారు కాబట్టి పాత స్కూల్లో ఉండే వీల్లేదు. కొత్త స్కూలుకు వెళ్లాలంటే సమయం పడుతుంది. విద్యాసంవత్సరం మధ్యలో ఈ పరిణామంతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది.– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment