వేగవంతమైన విభజన ప్రక్రియ | Rapid AP Separation Process | Sakshi
Sakshi News home page

వేగవంతమైన విభజన ప్రక్రియ

Published Thu, Oct 17 2013 8:33 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

వేగవంతమైన విభజన ప్రక్రియ - Sakshi

వేగవంతమైన విభజన ప్రక్రియ

రాష్ట్ర విభజన ప్రక్రియ  వేగవంతమైంది. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకునే పరిస్థితులలో కేంద్రం లేదు. తను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లన్నట్లు కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత తొందరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం  ఉన్నట్లు కనిపిస్తోంది. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా మెత్తబడిపోయారు. రాష్ట్ర విభజన ఆపడానికి ఇంకా చాలా దారులు ఉన్నాయని ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు చెబుతున్నారు. కొందరైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందని బహిరంగంగానే స్సష్టం చేస్తున్నారు. ఇంకా విభజన ఆపవచ్చని ప్రజలను మోసం చేయడం తనకు ఇష్టంలేదని మంత్రి మాణిక్యవరప్రసాద్ చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి తలవంచడం తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రి బాలరాజు గతంలోనే  చెప్పారు. కేంద్ర మంత్రులు పలువురు రాజీపడిపోయారు. కొందరు ప్యాకేజీలు అడుగుదామన్న ఆలోచనలో ఉన్నారు. వీరంతా వెనక్కు తగ్గిన నేపథ్యంలో కేంద్ర హొం శాఖ విభజన ప్రక్రియ విషయంలో దూసుకుపోతోంది. దీనికి తోడు సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించాయి.

17 అంశాలకు సంబంధించి  24 గంటల్లో సమాచారం పంపాలని కేంద్ర హొం శాఖ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నెల 19న మంత్రుల బృందం(జిఓఎం) రెండవసారి సమావేశం కానుంది. ఈ సమావేశం కోసం తెలంగాణలోని పది జిల్లాల సమాచారం మాత్రమే హొం శాఖ కోరింది.  విభజన ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కూడా కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచించింది.  రాష్ట్ర విభజనకు సంబంధిం కేంద్ర మంత్రిత్వ శాఖలు సంబంధిత సమాచారం పంపాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి ఈ నెల 11న లేఖ రాశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేయవలసి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకోసం 17వ తేదీలోపు సమాచారాన్ని అందించాలని ఆదేశించారు. ఇందు కోసం ప్రతి శాఖ  ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలని కేంద్ర మంత్రిత్వశాఖలను  ఆదేశించించారు.
 
 సంబంధిత రంగం ఏయే ప్రాంతాల్లో  ఎలా విస్తరించి ఉంది, ఇరు ప్రాంతాల్లో ఆస్తులు-అప్పుల వివరాలు, ఉద్యోగుల సమాచారంతో కూడిన స్పష్టమైన వివరాలను అందించాలని ఆదేశించారు. 19న జరిగే మంత్రుల బృందం సమావేశంలో సీమాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీల గురించి చర్చించే అవకాశం ఉంది. అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.

 రాష్ట్ర సచివాలయంలో కూడా ఈ ప్రక్రియ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  సాధారణ పరిపాలన శాఖ పరిధిలోని రాష్ట్ర పునర్విభజన (ఎస్‌ఆర్) విభాగాన్ని పటిష్టం చేస్తున్నారు. సచివాలయంలోని ‘బి’ బ్లాక్ ఆరో అంతస్తులో ఎస్‌ఆర్ విభాగం ఉంది. ఇందులో ప్రస్తుతం ఒక ఎస్‌ఓ, ఒక ఏఎస్‌ఓ మాత్రమే  ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఈ విభాగం ప్రాముఖ్యత ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఎస్‌ఆర్ విభాగం ద్వారానే రాష్ట్ర విభజన, కొత్త రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన సమాచారమంతా కేంద్రానికి చేరుతుంది. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే ఎస్‌ఆర్ విభాగం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖలు, విభాగాల సమాచారాన్ని సేకరించి కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తుంది. ఇందుకోసం ఎస్‌ఆర్ విభాగంలో సాగునీరు, ఆర్థిక, సర్వీసులు, విద్యుత్, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రణాళికా విభాగం సహా రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్న వివిధ శాఖల అదనపు కార్యదర్శులు లేదా సంయుక్త కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఆ అధికారులు ‘విభజన’కు అవసరమైన సమాచారాన్ని సేకరించి  కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి పంపిస్తారు.
 
 ఆ కమిటీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ విభాగంతోనే జరుపుతుంది. ప్రధానంగా ఆర్థిక శాఖ జిల్లాల వారీగా ఆదాయ వివరాలు, ఆస్తులు, అప్పులు, వడ్డీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వివరాలను  సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) జిల్లాల వారీగా సమకూర్చుకుంటుంది.  జిల్లాల వారీగా విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా, బొగ్గు, గ్యాస్ లభ్యత తదితర సమాచారాన్ని ఇంధన శాఖ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీకి అందజేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల వివరాలను కూడా అందజేస్తారు. సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల కేటాయింపు తదితర వివరాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రణాళికా సంఘానికి పూర్తి సమాచారం ఉంది. మొత్తంగా ‘ఎస్‌ఆర్’ విభాగం నుంచి అందే సమాచారం ఆధారంగా కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర విభజన, ఆస్తులు, ఆదాయ వనరులు, ఉద్యోగులు, అప్పుల పంపిణీకి ఒక ప్రాతిపదికను రూపొందిస్తుంది.  ఆ ప్రాతిపదికను కేంద్రమే అమలు చేస్తుంది.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ విభజన ప్రక్రియ ఊపందుకున్న నేపధ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును ఆపడం సాధ్యం కాదని అర్ధమైపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం తీవ్ర పోరాటం చేస్తోంది. యువనేత జగన్ ఒక్కరే సమైక్యతకు కట్టుబడి ఉద్యమిస్తున్నారు. సిపిఎం, ఎంఐఎం రెండు పార్టీలు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో టిడిపి నేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు నిజాయితీగా  జగన్ పిలుపుకు స్పందించి ముందుకు వస్తే విభజనను ఆపడం సాధ్యమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement