నల్లగొండ
జిల్లా కాంగ్రెస్ గురించి ఏమాత్రం అవగాహన ఉన్న వారెవరైనా ఏక వాక్యంలో కుండబద్ధలు కొట్టే అంశం గ్రూపుల గొడవలు. ముఖ్య నేతల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎవరికి వారు తలా ఓ రెండు నియోజకవర్గాలు తమవిగా భావిస్తున్నారు.
దీనికి తగ్గట్టే తాము పోటీ చేయడంతో పాటు తమ తరపున ఒకరిని బరిలోకి దింపుతున్నారు. కాగా, రెండు మూడేళ్లుగా రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోమటిరెడ్డి సోదరులది ఒక వర్గం కాగా, మిగిలిన నేతల్లో అత్యధికులంతా కలిసి ఒక వర్గంగా వ్యహరిస్తున్నారు. ఇరువర్గాల రాజకీయాల వల్ల కాంగ్రెస్‌లో గ్రూపుల అభిప్రాయ బేధాలు తారస్థాయికి చేరాయి. మంత్రి జానా సాగర్, మిర్యాలగూడ, మరో మంత్రి ఉత్తమ్ హుజూర్‌నగర్, కోదాడ, దామోదర్‌రెడ్డి సూర్యాపేట, తుంగతుర్తి ఇలా.. తలా రెండు నియోజకవర్గాలకు పంచుకున్నట్టే రాజకీయం చేస్తున్నారు.
మరో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండతో పాటు నకిరేకల్ నియోజకవర్గంలో తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకుని గెలి పించుకున్నారు. ఇక, తన మంత్రి పదవికి రాజీ నామా చేశాక, తన సోదరుడు, భువనగిరి ఎంపీ రాజగోపాల్‌రెడ్డితో కలిసి ప్రధానవర్గంగా రాజకీ యం నడుపుతున్నారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తే జిల్లా కాంగ్రెస్ నేతలు ‘ఎవరికి వారే.. యమునా తీరే’ అన్న రీతిలో ఉన్నారన్న అంశం ఇట్టే తెలిసిపోతుంది. ఈ పరిస్థితల మధ్య నేతలందరినీ ఏక తాటిపైకి తెచ్చి సోనియా కృతజ్ఞతా సభ నిర్వహించడం ఇపుడు డీసీసీ అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ముందున్న పెద్ద సవాలు. అయితే, ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు తెలంగాణ అన్ని జిల్లాల్లో జరగనున్న సమావేశాలకు ఎందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతారన్న విషయంలో డీసీసీవర్గాలూ స్పష్టత ఇవ్వడం లేదు. నల్లగొండలో నిర్వహించే ఈ సమావేశం మాత్రం అతి కీలకమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అరవై సంవత్సరాల కలను నిజం చేసిన పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తె లుపుతూ ప్రతీ డీసీసీ నుంచి తీర్మానాలు చేసి పీసీసీకి పంపించాలన్న నిర్ణయం జరిగింది.
దీనిలో భాగంగానే మంగళవారం మధ్యాహ్నం డీసీసీ కార్యాల యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో నాయకులు పత్రికా ప్రకటనల ద్వారా సోనియాను పొగిడారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి ఐదు నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఒక విధంగా బల ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీ కోమటిరెడ్డికి, ఆయన వ్యతిరేక వర్గానికి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ పరిణామాల మధ్య జరుగుతున్న సభకోసం గ్రూపు ల గొడవలు తాత్కాలికంగానైనా మరిచి అంతా హాజరవుతారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. నేతలంతా హాజరైనా ఒకరినొకరు విమర్శించుకోకుండా, గొడవ జరగకుండా ఎలా ప్రయత్నిస్తారో చూడాలి.