గొంతు కోసి... బావిలో తోసేసి... | Constable attempts to murder his new married wife | Sakshi
Sakshi News home page

గొంతు కోసి... బావిలో తోసేసి...

Published Sun, Dec 22 2013 3:30 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

గొంతు కోసి... బావిలో తోసేసి... - Sakshi

గొంతు కోసి... బావిలో తోసేసి...

శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: ఎన్నో ఆశలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టింది ఆ యువతి.  పెళ్లయి పన్నెండు రోజులైంది.. నూతన వధూవరులు అద్దె ఇంట్లో పాలు పొంగించారు. వారి జీవితం ఆనందంగా సాగాలని ఇరువురి బంధువులు ఆశీర్వదించారు. కానీ ఆ రాత్రే కాళరాత్రిగా మారింది. ప్రేమగా చెంతన చేర్చుకోవాల్సిన భర్త కిరాతకుడిలా మారాడు. గొంతుకోసి చంపేందుకు ప్రయత్నించాడు. అరసవల్లిలోని శిమ్మవీధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గురించి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
 శ్రీకాకుళం ఫైర్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నడిమింటి సత్యనారాయణకు, విజయనగరం జిల్లా జీఎం వలస మండలం చిన్నకుదమ గ్రామానికి చెందిన దివ్యశ్రీకి ఈ నెల 8న వివాహమైంది. శుక్రవారం రాత్రి అరసవల్లిలోని శిమ్మవీధిలో అద్దె ఇంట్లో పాలు పొంగించారు. సత్యనారాయణ తల్లిదండ్రులు పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లగా, దివ్యశ్రీ అమ్మ జయమ్మ, అమ్మమ్మ నారాయణమ్మ ఇంట్లో ఉన్నారు. అర్ధరాత్రి 12. 30 గంటల సమయంలో బ్లేడుతో దివ్యశ్రీపై సత్యనారాయణ దాడి చేశాడు.
 గొంతుపై తీవ్రగాయమై రక్తం కారుతుండడంతో అతనిని ప్రతిఘటించిన ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. సమీపంలోని బావివద్ద దాక్కుంది. 
 
 బయటకు వచ్చిన అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దివ్యశ్రీ అమ్మ, అమ్మమ్మను తోసేశాడు. నారాయణమ్మ ఎడమ చెయ్యి విరగ్గొట్టి కుడిచేతిని బ్లేడుతో కోసేశాడు. జయమ్మను గోడకేసి కొట్టాడు. బావిపక్కన దాక్కున్న దివ్యశ్రీని గమనించి అందులో పడేసి రాళ్లు విసిరేశాడు. పాతకాలం బావి కావడంతో ఆమె బావిలోని మెట్లను పట్టుకుని వేలాడుతూ ఉంది. అప్పటికే ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి వచ్చారు. 100 నంబరుకు సమాచారం ఇచ్చారు. ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని బావిలో ఉన్న ఆమెను రక్షించారు. గాయాల పాలైన దివ్యశ్రీ, నారాయణమ్మను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దివ్య పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం వారిద్దరూ విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
 పథకం ప్రకారమే...
 సంచలనం కలిగించిన ఈ సంఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. భార్యను ఒక పథకం ప్రకారమే హత్య చేసేందుకు ప్రయత్నించాడని భావిస్తున్నారు. ముందుగా తల్లిదండ్రులను బంధువుల ఇంటికి పంపడం దీనిని బలపరుస్తోంది. సమయం చూసి హత్యచేసేందుకే బ్లేడ్ దగ్గర ఉంచుకున్నాడని భావిస్తున్నారు. 
 
 సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై
 స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒకటో పట్టణ  ఎస్సై భాస్కరరావు శనివారం సంఘటన స్థలాన్ని, పరిసరాలను పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్నవారితో మాట్లాడారు. క్లూస్ టీం సంఘటన స్థలంలో ఆధారాలనుసేకరించింది.  ఒకటవ పట్టణ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 ఉలిక్కిపడ్డ కంబరవలస
 కంబరవలస(వీరఘట్టం) : చీమకు కూడా అపకారం చేయడని తాము అనుకుంటున్న వ్యక్తి ఇంత  క్రూరంగా ప్రవర్తించాడా అని కంబరవలస వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్ళితే మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన నడిమింటి సత్య నారాయణ పెళ్ళైన రెండు వారాలు గడవక ముందే తనతో జీవితాంతం నడిచేందుకు వచ్చిన దివ్యశ్రీపై దారుణంగా హత్యా యత్నానికి పాల్పడ్డాడని   తెలియడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళంలో  దివ్యశ్రీపై భర్త సత్య నారాయణ దాడి చేసి పీకకోసి బావిలో పడేశాడని చర్చించుకుంటున్నారు. సత్యనారాయణ ఇంత దారు ణానికి   పాల్పడతాడని ఎవరూ ఊహించలేదని గ్రామస్తులు పేర్కొన్నారు.  చికిత్స పొందుతున్న దివ్యశ్రీ ఆరోగ్యం కుదుటపడాలని స్ధానికులు భగవంతుని ప్రార్థిస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement